నేటినుంచి అందుబాటులోకి కరెంటు బస్సులు

ABN , First Publish Date - 2022-09-29T06:10:30+05:30 IST

ఆర్టీసీ ప్రవేశపెట్టిన కరెంటు ఏసీ బస్సులు గురువారం నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.

నేటినుంచి అందుబాటులోకి కరెంటు బస్సులు
తిరుపతిలో కరెంటు బస్సుల ప్రదర్శన

తిరుపతి(కొర్లగుంట), సెప్టెంబరు 28:ఆర్టీసీ ప్రవేశపెట్టిన కరెంటు ఏసీ బస్సులు గురువారం నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.తిరుమల బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో వచ్చిన 10 బస్సులనూ కొండకే తిప్పనున్నారు.ఈ బస్సులను అద్దె ప్రాతిపదికన నడిపేందుకు మెగా ఇంజనీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థతో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కిలోమీటర్‌కు రూ. 54చొప్పున ఆర్టీసీ ఆ కంపెనీకి చెల్లిస్తుంది.మంగళవారం సాయంత్రం అలిపిరి చెకింగ్‌ పాయింట్‌ వద్ద ముఖ్యమంత్రి జగన్‌ ఈ బస్సులను లాంఛనంగా ప్రారంభించారు. బుధవారం మళ్లీ ఆర్టీసీ ఉన్నతాధికారులు, మీడియా ప్రతినిధులతో ఓ ట్రిప్పు తిరుమల ఘాట్‌లో ట్రయల్‌రన్‌ నిర్వహించారు.అనంతరం ఏడు విద్యుత్‌ ఏసీ బస్సులను ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం నగర వీధుల్లో తిప్పారు.అనంతరం బస్సులకు రిజిస్ర్టేషన్‌ కార్యక్రమం కూడా పూర్తి చేశారు.గురువారం ఉదయం 6గంటలకు అన్ని బస్సులూ రైల్వేస్టేషన్‌ వద్ద అందుబాటులో వుంటాయి.బస్సుకు 35మందిని ఎక్కించుకుని తిరుమల రాంభగీచ బస్టాండులో దింపుతాయి. మళ్లీ అక్కడి నుంచి తిరుపతి రైల్వేస్టేషన్‌ చేరుకుంటాయి.మూడు ట్రిప్పులు తిరిగిన తరువాత చార్జింగ్‌కు ఆగుతాయి. ప్రస్తుతానికి పగలు మాత్రమే ఈ బస్సులను తిప్పేందుకు నిర్ణయించారు.పెద్దలకు రూ. 110, పిల్లలకు రూ. 80, రిటర్న్‌ టికెట్‌తో కలిపి పెద్దలకు రూ. 200, పిల్లలకు రూ. 150చెల్లించవలసి వుంటుంది.  


Read more