ఎన్నికలే లక్ష్యంగా...

ABN , First Publish Date - 2022-11-25T00:13:55+05:30 IST

జిల్లా అధికార పార్టీ అధ్యక్షుడిగా వున్న చెవిరెడ్డి భాస్కర రెడ్డికి పార్టీ అనుబంధ విభాగాల రాష్ట్ర కో ఆర్డినేటర్‌గా పదవి... ఆ స్థానంలో జిల్లా అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన రెడ్డి తనయుడు రామ్‌కుమార్‌రెడ్డి నియామకం... మరోవైపు సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే హేమలతకు అవకాశం... రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు తీసుకున్న నిర్ణయాలివి. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర పైనే వ్యవధి వున్నప్పటికీ రాష్ట్రంలో కొంతకాలంగా ఎన్నికల వేడి రగులుకుంటున్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టుగా ప్రధాన రాజకీయ పార్టీల్లో వేగంగా నిర్ణయాలు జరుగుతున్నాయి.తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా వున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి తాజాగా పార్టీ అధినేత జగన్‌ ఇతర బాధ్యతలు అప్పగించారు.

ఎన్నికలే లక్ష్యంగా...

తిరుపతి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లా అధికార పార్టీ అధ్యక్షుడిగా వున్న చెవిరెడ్డి భాస్కర రెడ్డికి పార్టీ అనుబంధ విభాగాల రాష్ట్ర కో ఆర్డినేటర్‌గా పదవి... ఆ స్థానంలో జిల్లా అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన రెడ్డి తనయుడు రామ్‌కుమార్‌రెడ్డి నియామకం... మరోవైపు సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే హేమలతకు అవకాశం... రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు తీసుకున్న నిర్ణయాలివి. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర పైనే వ్యవధి వున్నప్పటికీ రాష్ట్రంలో కొంతకాలంగా ఎన్నికల వేడి రగులుకుంటున్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టుగా ప్రధాన రాజకీయ పార్టీల్లో వేగంగా నిర్ణయాలు జరుగుతున్నాయి.తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా వున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి తాజాగా పార్టీ అధినేత జగన్‌ ఇతర బాధ్యతలు అప్పగించారు. పార్టీ అనుబంధ విభాగాలను రాష్ట్రస్థాయిలో పర్యవేక్షించే సమన్వయకర్తగా నియమించారు. ఇప్పటికే ఆ బాఽధ్యతలు చూస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డికి చెవిరెడ్డి సహాయకుడిగా వ్యవహరించనున్నారు. జిల్లా అధ్యక్ష పదవికి మాజీ సీఎం నేదురుమల్లి జనార్దనరెడ్డి తనయుడు రామ్‌కుమార్‌రెడ్డిని నియమించారు. ఇప్పటి వరకూ రామ్‌కుమార్‌రెడ్డి కేవలం వెంకటగిరి నియోజకవర్గంలో అధికార పార్టీ వర్గ రాజకీయాలకే పరిమితమై వున్నారు. అక్కడ మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వర్గం, రామ్‌కుమార్‌రెడ్డి వర్గం రెండూ క్రియాశీలంగా వున్నాయి. రాష్ట్రస్థాయి నామినేటెడ్‌ పదవి పొందినప్పటికీ రామ్‌ కుమార్‌రెడ్డికి ఇప్పటివరకూ జిల్లా పార్టీలో తగిన గుర్తింపు లేదనే చెప్పాలి. ఇపుడు ఆయన్ను అధిష్ఠానం జిల్లా పార్టీ అధ్యక్ష పదవిలో నియమించడంతో ప్రాముఖ్యత ఇచ్చినట్టయింది. వెంకటగిరి, గూడూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని కొన్ని మండలాల్లో రామ్‌కుమార్‌రెడ్డి వర్గీయులు ఈ నియామకంతో సంబరాలు చేసుకున్నారు. జిల్లా అధ్యక్ష పదవితో రామ్‌కుమార్‌రెడ్డి అనివార్యంగా క్రియాశీలం కావాల్సి వుంది. ఆ మేరకు జిల్లాస్థాయిలో ప్రభావం ఎలా వున్నా ప్రత్యేకించి వెంకటగిరి నియోజకవర్గంలో అధికార పార్టీ వర్గాల నడుమ ఇప్పటికే వున్న పోటీపూర్వక వాతావరణం మరింత పెరిగే అవకాశముంది.

సత్యవేడు టీడీపీ ఇన్‌ఛార్జిగా హేమలత

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇన్‌ఛార్జులు లేని నియోజకవర్గాలపై టీడీపీ అధిష్ఠానం దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే జీడీ నెల్లూరులో పార్టీ సమన్వయ కర్తగా భీమినేని చిట్టిబాబును నియమించిన అధిష్ఠానం తాజాగా సత్యవేడు నియోజకవర్గంలో సర్దుబాట్లు చేసింది. అందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే హేమలతను ఇన్‌ఛార్జిగా ప్రకటించింది. 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆమెకు 2014, 2019 ఎన్నికల్లో టికెట్‌ దక్కలేదు. 2019 ఎన్నికల్లో జేడీ రాజశేఖర్‌కు టికెట్‌ ఇవ్వగా ఆయన ఓటమి చెందారు. అయినా ఎన్నికల ఫలితాలతో నిమిత్తం లేకుండా ఆయన ఇప్పటిదాకా నియోజకవర్గంలో చురుగ్గా పనిచేస్తూనే వున్నారు. శ్రేణులకు అందుబాటులో వుంటూ పార్టీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. అక్కడ వర్గ రాజకీయాల కారణంగా ఏడాదిన్నరగా హేమలత క్రియాశీలమయ్యారు.తనకు గానీ, లేదా చెన్నైలో వైద్యురాలిగా వున్న తన కుమార్తెకు గానీ ఇన్‌ఛార్జిగా అవకాశం ఇవ్వాలని అధినేతను అభ్యర్థించారు. గతంలో జడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన ఆమె అనుభవాన్ని పరిగణనలోకి తీసుకున్న అధిష్ఠానం ఆమెకే అవకాశం కల్పించింది. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న జేడీ రాజశేఖర్‌ నైరాశ్యం చెందకుండా ఆయనకు తగిన న్యాయం చేసేందుకు అధిష్ఠానం నిర్ణయం తీసుకుందని, ఆ మేరకు ఆయనతో త్వరలో మాట్లాడి సర్దుబాటు చేయనున్నట్టు సమాచారం. మొత్తానికి వర్గ రాజకీయాలతో, ఇన్‌ఛార్జి లేకుండా గత మూడేళ్ళుగా ఇబ్బందుల్లో వున్న సత్యవేడు తెలుగుదేశం పార్టీకి అధిష్ఠానం పరిష్కారం చూపడంతో శ్రేణులు ఊరట చెందుతున్నాయి. ఇదేవిధంగా పూతలపట్టు, చిత్తూరు, తంబళ్ళపల్లె సెగ్మెంట్ల విషయంలో కూడా సాధ్యమైనంత త్వరగా అధిష్ఠానం నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నట్టు తెలిసింది. మొత్తానికీ ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలు రానున్న ఎన్నికలను దృష్టిలో వుంచుకుని వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

Updated Date - 2022-11-25T00:13:55+05:30 IST

Read more