చంద్రగిరిలో మత్తు విక్రయాల జోరు!

ABN , First Publish Date - 2022-11-30T02:12:08+05:30 IST

చంద్రగిరిలో మత్తుపదార్థాల విక్రయం రోజురోజుకూ పెరిగిపోతోంది.నెమ్మదిగా విద్యార్థులు వీటికి అలవాటుపడుతుండడంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

చంద్రగిరిలో మత్తు విక్రయాల జోరు!
చంద్రగిరి టవర్‌ క్లాక్‌ వద్ద టీడీపీ ఆందోళన

చంద్రగిరి, నవంబరు 29: చంద్రగిరిలో మత్తుపదార్థాల విక్రయం రోజురోజుకూ పెరిగిపోతోంది.నెమ్మదిగా విద్యార్థులు వీటికి అలవాటుపడుతుండడంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సోమవారం సాయంత్రం ఓ టీ షాపులో ఒక బాలిక సిగరెట్‌ తాగుతుండడాన్ని ఆమె తల్లిదండ్రులు గుర్తించి షాపు యజమానిని నిలదీయడంతో పాటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో టీ షాపులో సిగరెట్‌ తాగుతూ కన్పించిన బాలిక తల్లిదండ్రులతో పాటు పోలీసులను టీడీపీ నాయకులు కలిశారు. వైసీపీ నాయకులు గంజాయి, మత్తు పదార్థాలను విక్రయిస్తూ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి విక్రయాలకు వైసీపీ నాయకులే డీలర్లుగా మారారని చిత్తూరు పార్లమెంటు టీడీపీ ఉపాధ్యక్షుడు గౌస్‌బాషా ఆరోపించారు.వైసీపీ సోషల్‌ మీడియా కన్వీనర్‌ మట్టిరెడ్డి నవీన్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ బాలికల హైస్కూల్‌ ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలంలో టీ దుకాణం నిర్వహిస్తూ, బాలికలకు డ్రగ్స్‌ అలవాటు చేస్తున్నారని బాధితులు సోమవారమే ఫిర్యాదు చేసినా ఇంతవరకు నవీన్‌కుమార్‌రెడ్డిని ఎందుకు అరెస్ట్‌ చేయలేదని నిలదీశారు.గతంలో కూడా చంద్రగిరిలో వైసీపీ కార్యకర్తలు విచ్చలవిడిగా గంజాయి, మత్తు పదార్థాలు విక్రయిస్తున్నారని ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.సోమవారం రాత్రి బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, అయితే అది ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు కావడంతో డీఎస్పీ విచారిస్తారని సీఐ ఓబులేశు వారికి తెలిపారు.అనంతరం టీడీపీ నాయకులు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు వెళ్లారు.పాఠశాల ఎదురుగా మత్తు పదార్థాలు విక్రయిస్తుంటే ఎందుకు స్పందించడం లేదని హెచ్‌ఎం వెంకటనారాయణచౌదరిని ప్రశ్నించారు. ఆమ్‌ఆద్మీపార్టీ నాయకులు కూడా పాఠశాల ఆవరణలో నిరసన తెలిపారు.దీంతో హెచ్‌ఎం వెంకటనారాయణ చౌదరి, ఉపాధ్యాయులు, బాలిక తల్లిదండ్రులు కలిసి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఆ సమయంలో అక్కడున్న డీఎస్పీ నరసప్పకు మత్తుపదార్థాల విక్రయంపై ఫిర్యాదు చేశారు. సాయంత్రం టీడీపీ నాయకులు చంద్రగిరి టవర్‌ క్లాక్‌ వద్ద రోడ్డుపై బైఠాయించారు. వైసీపీ ప్రభుత్వానికి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.వైసీపీ కార్యకర్తలు విచ్చలవిడిగా గంజాయి, మత్తు పదార్థాలు విక్రయిస్తున్నా పోలీసులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు.టీడీపీ మండలాధ్యక్షుడు సుబ్రమణ్యం నాయుడు, ప్రధాన కార్యదర్శి కొండూరు ప్రవీణ్‌, తెలుగు మహిళ రాష్ట్ర కార్యదర్శి సింగు సుధ,ఉపాధ్యక్షురాలు లంకెళ్ళ లలిత, నాయకులు రమే్‌షరెడ్డి, గిరిధర్‌రెడ్డి,రాకే్‌షచౌదరి, కొమ్మినేని నాగరాజు, సజ్జా పురుషోత్తం, సునీల్‌, రామారావు, గ్యాస్‌ నాగరాజు, దిలీ్‌పనాయుడు, మంగాపురం భాస్కర్‌, రాధ, శ్రీకాంత్‌చౌదరి, తుడా మాజీ డైరెక్టర్‌ బాలకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

విచారించి చర్యలు తీసుకొంటాం:డీఎస్పీ

బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుపై ఎస్పీ ఆదేశాల మేరకు విచారించి చర్యలు తీసుకొంటామని డీఎస్పీ తెలిపారు.ఆ బాలిక గంజాయి సేవించిందా, లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి రక్త నమూనాలను పరీక్షకు పంపించామన్నారు.బాధితురాలిని రాజీ పోవాలని తాను చెప్పినట్టు వచ్చిన ఆరోపణలు వాస్తవం కాదని తెలిపారు. నవీన్‌కుమార్‌రెడ్డిపై ఇదివరకే రెండు కేసులున్నాయని తెలిపారు.

అసాంఘిక శక్తులను అణచివేయండి:చెవిరెడ్డి

చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కడ అసాంఘిక శక్తులు కనిపించినా అణచివేయాలని, అందులో అధికార పార్టీల తేడా చూపొద్దని పోలీసులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తప్పు ఎవరు చేసినా ఎవరూ సమర్థించకూడదన్నారు. ప్రతిదీ రాజకీయం చేయడాన్ని వదిలేసి తప్పు ఎవరు చేస్తున్నారో గుర్తించి పోలీసులకు పట్టించాలన్నారు. మాదక ద్రవ్యాలు అమ్ముతుంటే పోలీసులు నిర్దాక్షిణంగా వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

Updated Date - 2022-11-30T02:12:08+05:30 IST

Read more