సమాజం కోసం త్యాగశీలురుకండి

ABN , First Publish Date - 2022-11-12T02:23:03+05:30 IST

‘ఆదివాసీల హక్కుల కోసం పోరాట బాట పట్టి తెల్లదొరలను ఎదిరించి తెలుగునేలపై అమరుడైన అల్లూరి సీతారామ రాజు వంటి సమరయోధులను స్ఫూర్తిగా తీసుకోండి. సమాజం కోసం త్యాగశీలురుగా మారండి’ అని విద్యార్థినులకు శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయ కులపతి, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పిలుపునిచ్చారు.

సమాజం కోసం త్యాగశీలురుకండి
విద్యార్థినులతో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, వీసీ జమున తదితరులు

విద్యార్థినులకు గవర్నర్‌ పిలుపు

ఘనంగా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం

తిరుపతి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): ‘ఆదివాసీల హక్కుల కోసం పోరాట బాట పట్టి తెల్లదొరలను ఎదిరించి తెలుగునేలపై అమరుడైన అల్లూరి సీతారామ రాజు వంటి సమరయోధులను స్ఫూర్తిగా తీసుకోండి. సమాజం కోసం త్యాగశీలురుగా మారండి’ అని విద్యార్థినులకు శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయ కులపతి, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం మహిళా విశ్వవిద్యాలయ 19, 20వ స్నాతకోత్సవం వర్సిటీలోని ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పట్టభద్రులకు స్నాతకోత్సవ పట్టాలను ప్రదానం చేసిన గవర్నర్‌ మాట్లాడుతూ.. మారుతున్న కాలానుగుణంగా ఉన్నత విద్యాసంస్థలు మెరుగైన విద్యా విజ్ఞానాన్ని అందించడానికి కృషి చేయాలన్నారు. పాఠ్య, పరిశోధనలు నిరంతరం జరగాలని.. అప్పుడే సమర్థవంతమైన ఉన్నత విద్య రాణించగలుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉమ్మడి బోధన, వర్చువల్‌ లెర్నింగ్‌, ఉపన్యాసాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విద్యాసంస్థల మధ్య విజ్ఞానాన్ని పంచుకోవాలని, దీనికి అధ్యాపకులు సన్నద్ధం కావాలని సూచించారు. భారతీయ ఉన్నత విద్యా సంస్థలలో మహిళా వర్సిటీ 24వ స్థానంలో నిలిచినందుకు, 2021-22ఫార్మసీ విభాగంలో 42వ ర్యాంకును సాధించినందుకు ఆనందంగా ఉందన్నారు. ఇప్పటికే ఇక్కడి నుంచి ఆరువేల మందికిపైగా విద్యను అభ్యసించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థాయిల్లో ఉన్నారని గుర్తుచేశారు. వైస్‌ చాన్సలర్‌ (వీసీ) డాక్టర్‌ డి.జమున మాట్లాడుతూ.. దేశంలోనే తమ వర్సిటీ ఆదర్శంగా నిలిచి.. విద్యాబోధన, పరిశోధనలు నిర్వహిస్తోందని చెప్పారు. ఇప్పటికే ఎందరో ప్రముఖులు వర్సిటీని సందర్శించారన్నారు. వివిధ యూనివర్సిటీలు, విద్యాసంస్థలతో భాగస్వాములై విద్య, విజ్ఞానంలో పురోగతిలో ఉన్నామని వివరించారు. 27 విభాగాలు, 34యూజీ, పీజీ కోర్సులు నిర్వహిస్తున్నామని ప్రకటించారు. కాగా.. పీహెచ్‌డీలు 71మంది, ఎంపీల్‌ ముగ్గురు, 1903మంది వివిధ కోర్సులలో పట్టాలు అందుకున్నారు. వీరిలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన 108 మందికి గోల్డ్‌ మెడల్స్‌, బుక్‌ప్రైజ్‌లు, క్యాష్‌ప్రైజ్‌లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా, రిజిస్ట్రార్‌ మమత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-12T02:23:03+05:30 IST

Read more