పింఛన్లు పంపిణీ చేసింది 75 శాతమే

ABN , First Publish Date - 2022-04-05T06:48:23+05:30 IST

సామాజిక పింఛన్ల పంపిణీకి సరిపడా సొమ్మును ఆయా సచివాలయాల ఖాతాల్లో జమ చేయడంలో ప్రభుత్వం ప్రతి నెలా విఫలం అవుతోంది.

పింఛన్లు పంపిణీ చేసింది 75 శాతమే

నేటితో ముగియనున్న గడువు

ఆందోళనలో పెన్షన్‌దారులు


చిత్తూరు, ఆంధ్రజ్యోతి/ పెనుమూరు, ఏప్రిల్‌ 4: సామాజిక పింఛన్ల పంపిణీకి సరిపడా సొమ్మును ఆయా సచివాలయాల ఖాతాల్లో జమ చేయడంలో ప్రభుత్వం ప్రతి నెలా విఫలం అవుతోంది. దీంతో సమయానికి పెన్షన్‌ డబ్బుల అందక పెన్షన్‌దారులు ఇబ్బంది పడుతున్నారు.  పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం నిర్దేశించిన గడువు 5వ తేది. మంగళవారంతో ముగియనుంది. ఇప్పటికి ఉమ్మడి జిల్లాలో 75 శాతం మందికే పింఛన్లు ఇచ్చారు. దీంతో మిగిలిన పెన్షన్‌దారులు ఆందోళన చెందుతూ.. సెక్రటరీలు, వలంటీర్లను అడుగుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 5,21,255 మంది పెన్షన్‌దారులుండగా.. ఇప్పటివరకు 3,89,331 మందికే పింఛన్లు ఇచ్చారు. మార్చి 31వ తేదీన 75శాతం పెన్షన్‌ సొమ్ము మాత్రమే సెక్రటరీల ఖాతాల్లో జమ అయింది. ఆ సొమ్మును ఆయా వలంటీర్లు 1, 2 తేదీల్లో పంపిణీ చేసేశారు. ఏప్రిల్‌ 1 నుంచి 3వ తేది వరకు బ్యాంకులు పనిచేయలేదు. 4వ తేది సోమవారం బ్యాంకులు పనిచేసినా, మిగిలిన 25శాతం నిధులు సెక్రటరీల ఖాతాలకు జమ కాలేదు. దీంతో సెక్రటరీలు, వలంటీర్లు ఆయా పెన్షన్‌దారులకు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. 


ఒకరికిస్తే ఇంకొకరు గొడవ పడతారని.. 

పెనుమూరు మండలంలో 6,799 మంది పెన్షన్‌దారులకు ప్రతి నెలా రూ.1.67 కోట్లను పంపిణీ చేస్తున్నారు. ఈ నెలలో ఇప్పటివరకు 4,692 మందికి రూ.1.16 కోట్లను మాత్రమే అందించినట్లు అధికారులు చెబుతున్నారు. సరిపడా డబ్బులు రాకపోవడంతో ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వకుంటే గ్రామాల్లో గొడవలు అవుతాయని కొన్నిచోట్ల సెక్రటరీలు పంపిణీనే చేయలేదు. పెనుమూరు మండలంలోని చింతపెంట, చార్వాగానిపల్లె, రామకృష్ణాపురం, చిన్నకలికిరి పంచాయతీల్లో పూర్తిగా పంపిణీ కాలేదు. మిగిలిన కొన్ని పంచాయతీల్లో వైసీపీ నేతలు రెఫర్‌ చేసినవారికే పింఛన్లు ఇచ్చారన్న విమర్శలున్నాయి. 


అన్ని పంచాయతీలకూ 75శాతమే జమ

పెద్దపంజాణి మండలం రాజుపల్లె గ్రామ పంచాయతీలో రూ.15.69 లక్షలు ప్రతినెలా పెన్షన్‌దారులకు పంపిణీ చేయాలి. ఈసారి రూ.11.45 లక్షలే ఖాతాలో పడ్డాయి. వాటిని పంచేసి, మిగిలిన నిధుల కోసం సెక్రటరీలు ఎదురుచూస్తున్నారు. ఇదే మండలం లింగాపురం పంచాయతీలో రూ.7.48 లక్షలకుగాను రూ.5.95 లక్షలు, కొళత్తూరు గ్రామ పంచాయతీలో రూ.13.12 లక్షలకుగానూ రూ.11.80 లక్షలు మాత్రమే అందాయి. 

గుడిపాల మండలం రామభద్రాపురం పంచాయతీలో 209 పెన్షన్‌దారులకుగానూ 109 మందికే పంపిణీ చేశారు. నాలుగు రోజులు పూర్తయినా పెన్షన్‌ అందకపోవడంతో, దానిమీదే ఆధారపడి బతికేవాళ్లంతా నిలదీస్తున్నారని సర్పంచి గోళ్ల హరిణి హేమాద్రినాయుడు అంటున్నారు. 

Read more