లేనిభూమికి రికార్డుల సృష్టి!

ABN , First Publish Date - 2022-05-24T07:50:24+05:30 IST

క్షేత్ర స్థాయిలో భూమి ఉండదు. కానీ, పట్టాదారు పాసు పుస్తకాలు ఉంటాయి. వాటితో బ్యాంకుల్లో రుణాలు, రైతు భరోసా వంటి ప్రభుత్వ పథకాల లబ్ధి పొందుతారు.

లేనిభూమికి రికార్డుల సృష్టి!

వంద మంది పేరిట పాసు పుస్తకాల తయారీ

ఇప్పటికి 28 ఎకరాల గుర్తింపు.. తొలగింపు


చిత్తూరు, ఆంధ్రజ్యోతి/పాలసముద్రం


క్షేత్ర స్థాయిలో భూమి ఉండదు. కానీ, పట్టాదారు పాసు పుస్తకాలు ఉంటాయి. వాటితో బ్యాంకుల్లో రుణాలు, రైతు భరోసా వంటి ప్రభుత్వ పథకాల లబ్ధి పొందుతారు. ‘రెవెన్యూ’లో ఇలాంటి లీలలు సర్వ సాధారణం. తాజాగా పాలసముద్రం మండలంలో ఇలాంటి ఓ సంఘటన వెలుగు చూసింది. పాలసముద్రం మండలంలోని వనదుర్గాపురం, తిరుమల రాజుపురం, నరసింహాపురం, శ్రీకావేరిరాజపురం, సింహరాజపురం గ్రామ పంచాయతీలు తమిళనాడు సరిహద్దుకు సమీపంలో ఉన్నాయి. అత్తిమాంజేరిపేట, అత్తిమాంజేరి, కాటూరు, బాలాపురం, చిన్ననాగు పూండి, కొత్తూరు మిట్ట వంటి గ్రామాలు పాలసముద్రం మండలానికి సరిహద్దులో ఉంటాయి. ఈ కారణంగా ఇక్కడి తెలుగు, తమిళ ప్రజలు కలిసిపోయి ఉంటారు. తమిళనాడుకు చెందిన గ్రామాల్లోని కొందరు పాలసముద్రంలో ఉంటున్నట్టు నకిలీ ఐడీ కార్డులను తయారు చేసుకుని తహసీల్దార్‌ కార్యాలయం నుంచి ఐదారేళ్ల కిందట నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలను పొందినట్లు తెలుస్తోంది. అలాగే తమిళనాడుకు సరిహద్దులోని తెలుగు గ్రామాల ప్రజలు కూడా పుస్తకాలను తీసుకుని లబ్ధి పొందుతున్నట్లు సమాచారం. ఇలా తెలుగు, తమిళ గ్రామాలకు చెందిన 200 మందికిపైగా పట్టాదారు పుస్తకాలు పొందినట్లు ప్రచారంలో ఉంది. గతంలో ఇక్కడ పనిచేసిన ఓ తహసీల్దార్‌, రెవెన్యూ అధికారులు కలిసి సుమారు వంద మంది పేరిట నకిలీ పాసు పుస్తకాలను తయారీ చేశారనే ఆరోపణలున్నాయి. ఆన్‌లైన్‌లోనూ నమోదు చేసి.. 250 నుంచి 300 ఎకరాల లేని భూమికి రికార్డుల్ని సృష్టించినట్లు అంచనా. వీటికి ఆన్‌లైన్‌లో వన్‌బీ, అడంగల్‌ నమోదు చేశారు. ఇలా తప్పుడు పట్టాలు తీసుకున్నవారంతాపాలసముద్రంలోని సప్తగిరి గ్రామీణ బ్యాంకులో ఎకరాకు రూ.50 వేలు చొప్పున పంట రుణాలు, వీటిపై 4శాతం వడ్డీ రాయితీ, రైతు భరోసా- పీఎం కిసాన్‌ యోజన ద్వారా లబ్ధిపొందుతున్నట్లు తెలిసింది. పంట రుణాలను ఇచ్చేటప్పుడు బ్యాంకు ఫీల్డ్‌ ఆఫీసర్లు పొలాలను పరిశీలించాలి. కానీ, వన్‌బీ, అడంగల్‌ ఉంటే రుణాలు మంజూరు చేసేస్తున్నారు. క్షేత్రస్థాయిలో భూమి ఉందో లేదో చూస్తే ఇలాంటి అక్రమాలను అరికట్టవచ్చు.


3 నెలల కిందట వీఆర్‌ఏ సస్పెన్షన్‌ 

తహసీల్దార్‌కు తెలిసి కొన్ని, తెలియకుండా మరికొన్ని నకిలీ పాసుపుస్తకాలను అప్పటి వీఆర్‌ఏ ఒకరు తయారు చేసినట్లు సమాచారం. తమిళనాడుకు చెందిన వ్యక్తులకు పాసుపుస్తకంతో పాటు భూమి కూడా ఇస్తామని రూ.లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ‘భూమి చూపించండి.. ఖాళీ పుస్తకాలను ఏం చేసుకోవాలి.. లేదంటే మా డబ్బులు మాకిచ్చేయండి’ అంటూ తమిళనాడు వాసులు ఒత్తిడి చేశారు. వీఆర్‌ఏ పట్టించుకోకపోవడంతో ప్రస్తుత తహసీల్దారు భాగ్యలతకు వారు ఫిర్యాదు చేశారు. ఆమె ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో మూడు నెలల కిందట వీఆర్‌ఏను సస్పెండ్‌ చేశారు.


12 నకిలీ పాస్‌ పుస్తకాల రద్దు 

ఈ నకిలీ పాస్‌పుస్తకాలపై తహసీల్దార్‌ భాగ్యలత దృష్టి సారించారు. ‘వనదుర్గాపురానికి చెందిన 12 నకిలీ పాసుపుస్తకాలను రద్దు చేశాం. ఆ 12 పాసుపుస్తకాల్లో 30 ఎకరాల భూమి ఉంది. వారంతా బ్యాంకులో తీసుకున్న రుణాలను చెల్లించేసి, పుస్తకాలను సరెండర్‌ చేశారు’ అని ఆమె వివరించారు.

Read more