బాలుడి కోసం వెళ్లి... నీటిగుంటలో మునిగి కూలీ మృతి

ABN , First Publish Date - 2022-10-03T05:43:57+05:30 IST

నలుగురు పిల్లలు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఒక చిన్నారి నీటి గుంటలో పడ్డాడు. ఆ బాలుడుని కాపాడడం కోసం వెళ్లి నీటి కుంటలో పడి ఓ కూలీ మృతి చెందాడు.

బాలుడి కోసం వెళ్లి...  నీటిగుంటలో మునిగి కూలీ మృతి
నీటిలో మునిగి మృతి చెందిన ఆనంద్‌

తిరుచానూరు, అక్టోబరు 2: నలుగురు పిల్లలు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఒక చిన్నారి నీటి గుంటలో పడ్డాడు. ఆ బాలుడుని కాపాడడం కోసం వెళ్లి నీటి కుంటలో పడి ఓ కూలీ మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన తనపల్లి వద్ద చోటుచేసుకుంది. ఎస్‌ఐ జగన్నాథ్‌రెడ్డి కథనం మేరకు.. అనంతపురం పట్టణ పరిధిలోని సాయినగర్‌కు చెందిన చాకలిఆనంద్‌(45) తిరుపతిరూరల్‌ మండలం తనపల్లి వద్ద సిమెంట్‌ ఇటుకలు తయారీ ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తాడు. ఆదివారం తనపల్లి ఇందిరమ్మ హౌసింగ్‌ కాలనీకి చెందిన నలుగురు పిల్లలు సమీపంలోని నీటి కుంట వద్ద ఆడుకోవడానికి వెళ్లారు. ఈ క్రమంలో లోకేశ్‌ అనే చిన్నారి అదుపుతప్పి నీటి గుంటలో పడిపోయాడు. తోటిపిల్లలు భయంతో కేకలు వేశారు. సమీపంలో సిమెంట్‌ బ్రిక్స్‌ తయారు చేస్తున్న ఆనంద్‌ చిన్నారిని రక్షించడానికి గుంటలో దూకాడు. ఈత రాకపోవడంతో ఆనంద్‌ బురద ఊబిలో కూరుకుపోయాడు. పక్కనే ఉన్న వృద్ధుడు నీటిలో మునిగిపోతున్న చిన్నారిని కాపాడి బయటకు తీశాడు. స్థానికులు సిమెంట్‌ ఫ్యాక్టరీ యజమాని భూపాల్‌కి సమాచారం అందించారు. ఆయన స్థానికుల సహాయంతో ఆనంద్‌ మృతదేహాన్ని వెలికి తీశారు. పోలీసులు కేసు నమోదుచేసి ఆనంద్‌ మృతదేహాన్ని రుయాకు తరలించారు.  

Updated Date - 2022-10-03T05:43:57+05:30 IST