కన్వర్షన్‌ ‘ఎలక్ర్టిక్‌ బస్సు’ వచ్చేసింది!

ABN , First Publish Date - 2022-05-30T07:47:31+05:30 IST

తిరుపతి- తిరుమల ఘాట్‌లో ఇకపై కన్వర్షన్‌ ఎలక్ర్టిక్‌ బస్సులు సందడి చేయనున్నాయి.

కన్వర్షన్‌ ‘ఎలక్ర్టిక్‌ బస్సు’ వచ్చేసింది!
ఎలక్ర్టిక్‌ బస్సులు

తిరుపతి(కొర్లగుంట), మే 29: తిరుపతి- తిరుమల ఘాట్‌లో ఇకపై కన్వర్షన్‌ ఎలక్ర్టిక్‌ బస్సులు సందడి చేయనున్నాయి. ఘాట్‌లో ఎలక్ర్టిక్‌ బస్సులను నడపాలని ఐదేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు దాదాపు ఓ కొలిక్కి వచ్చాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఘాట్‌లో ఎలక్ర్టిక్‌ బస్సులను ప్రయోగాత్మకంగా నడిపాయి. అందులో భాగంగా బెంగళూరుకు చెందిన ‘వీరవాహన’ కంపెనీ ప్రతినిధులు పాత బస్సుల్లోనే బ్యాటరీలను ఏర్పాటుచేసి నడుపుతామని ముందుకొచ్చారు. చిత్తూరు ఆర్టీసీ డిపోకు చెందిన ఓ బస్సు (బీఎస్‌-3 మోడల్‌)ను ఎంపికచేశారు. ఈ బస్సును బెంగళూరుకు తరలించి ఇంజిన్‌, గేర్‌బాక్స్‌, డీజిల్‌ట్యాంకు, పైపులను తొలగించారు. వీటి స్థానంలో బ్యాటరీలను అమర్చి.. రీమోడల్‌ చేశారు. గేర్లస్థానంలో.. ఫ్రంట్‌, బ్యాక్‌, న్యూట్రల్‌ చేసే బటన్లు, డిస్‌ప్లే స్టీరింగ్‌తో అత్యాధునిక సౌకర్యాలను ఏర్పాటు చేసి.. ఏడాది కిందట ఘాట్‌లో పరీక్షించారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా.. సౌకర్యంగా ఉందని కంపెనీ ప్రతినిధులు, ఆర్టీసీ నిపుణులు గుర్తించారు. దాంతో కేంద్ర ప్రభుత్వ అనుమతికోసం ఈ బస్సును పుణెలోని ‘సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ (సీఐఆర్‌టీ)కి తరలించారు. వారు కూడా పరీక్షించి.. అన్నివిధాల ఆమోదయోగ్యంగా ఉందని క్లియరెన్స్‌ ఇచ్చారు. ఇంధనం నుంచి బ్యాటరీలకు మార్చబడుతున్నట్లు కన్వర్షన్‌ సర్టిఫికెట్‌ జారీచేశారు. ఇలా దేశంలోనే తొలిసారిగా కన్వర్షన్‌ సర్టిఫికెట్‌ పొందిన బస్సుగా రికార్డులకు ఎక్కింది. ఈ బస్సు రెండ్రోజుల కిందట తిరుపతికి వచ్చింది. చిన్న చిన్న మరమ్మతులు జరుగుతున్నాయి. వచ్చేవారంలో ట్రయల్‌ రన్‌ నిర్వహించి, డ్రైవర్లకు ఘాట్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. ఐదు లక్షల కిలోమీటర్లు అధిగమించిన దాదాపు వంద బీఎస్‌-3 మోడల్‌ బస్సులను కన్వర్షన్‌ చేయనున్నారు. ఇందుకోసం బ్యాటరీలు, ఇతర పరికరాలను ప్రముఖ మేథాసర్వోడ్రైవ్స్‌ సంస్థ నుంచి వీరవాహన కంపెనీ కొనుగోలుచేసింది. తిరుపతి డిపో గ్యారేజీ ఆవరణలో 100 కేడబ్ల్యూ సామర్థ్యం ఉన్న బ్యాటరీ రీచార్జింగ్‌ యంత్రాన్ని అమర్చారు. ఎక్కువ సమయం విద్యుత్‌ అంతరాయం ఏర్పడినా జనరేటర్‌తో సరఫరా అయ్యే విద్యుత్‌తో ఈ యంత్రం పనిచేస్తుంది. కాగా.. ఈ బస్సుల నిర్వహణ బాధ్యతను మూడేళ్ల వరకు వీరావాహన సంస్థే చూసుకుంటుందని అధికారులు తెలిపారు. 

Read more