మా భూములకు పరిహారం ఇవ్వండి సారూ..!

ABN , First Publish Date - 2022-01-04T05:15:21+05:30 IST

ప్రభుత్వ అవసరాల కోసం 475 ఎరకాల భూమి సేకరించి ఏడాదిన్నర అవుతున్నా ఇంత వరకు నష్టపరిహారం ఇవ్వలేదని వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన స్పందన కార్యక్రమంలో వారు అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.

మా భూములకు పరిహారం ఇవ్వండి సారూ..!
ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న అధికారులు

అధికారులకు మొరపెట్టుకున్న పాదిరేడు రైతులు 


చిత్తూరు, జనవరి 3: ప్రభుత్వ అవసరాల కోసం 475 ఎరకాల భూమి సేకరించి ఏడాదిన్నర అవుతున్నా ఇంత వరకు నష్టపరిహారం ఇవ్వలేదని వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన స్పందన కార్యక్రమంలో వారు అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. పాదిరేడు మాదిగవాడ, దళితవాడ, తట్నేరి దళితవాడ, వడమాలపేట మాదిగవాడ, దళితవాడ, రామసముద్రం ఎస్టీకాలనీ, ఎల్‌ఎం కండ్రిగ గ్రామాల పరిధిలో 475 ఎకరాల భూమిని ప్రభుత్వం రైతుల నుంచి తీసుకుందన్నారు. ఆర్డీవో, తహసీల్దార్‌ పలుమార్లు రైతులతో సమావేశాలు నిర్వహించి స్టాంపు పేపర్ల మీద సంకతాలు తీసుకున్నారని చెప్పారు. ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్నా నేటికీ నష్టపరిహారం అందలేదని వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. ఫ ఆక్రమణలో ఉన్న 0.50 సెంట్ల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని పాఠశాలకు అదనపు గదులను నిర్మించి ఇవ్వాలని నగరిలోని పుదుపేట ప్రాథమిక పాఠశాల పేరెంట్స్‌ కమిటీ సభ్యులు అధికారులకు వినతిపత్రం అందజేశారు. మనోహర్‌ అనే వ్యక్తి పాఠశాల గోడను కూలగొట్టి తన ఇంటి కోసం పిల్లర్లు వేశాడని, ఈ విషయాన్ని ఎంఈవో, హెచ్‌ఎంకు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు. ఫ రేణిగుంట మండలం గోపాలకృష్ణాపురం వద్ద ఉన్న శ్రీఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ యాజమాన్యం తమ టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ ఒరిజనల్‌ సర్టిఫికెట్లను ఇవ్వడం లేదని పలువురు ఎంబీఏ విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు విచారించి న్యాయం చేయాలని కోరారు.ఫ పెండింగ్‌ బిల్లులు, గౌరవ వేతనాలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తూ మధ్యాహ్న భోజన కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. అప్పులు తెచ్చి విద్యార్థులకు వండి పెడుతున్నా బిల్లులను ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించారు. ధర్నాలో ఆ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి వరలక్ష్మి, ఉపాధ్యక్షుడు రామూర్తి, ఏఐటీయూసీ నేతలు వాడ గంగరాజు, చైతన్య తదితరులు పాల్గొన్నారు. కాగా, స్పందన కార్యక్రమంలో మొత్తం 194 వినతులు అందాయి. ఇందులో రెవెన్యూశాఖకు సంబంధించి 105, డీఆర్‌డీఏకి 19, పౌరసరఫరాలశాఖకు 5, హౌసింగ్‌శాఖకు 3, సంక్షేమ శాఖలకు 24, పోలీసుశాఖకు 3, ఇతర శాఖలకు సంబంధించి 35 అర్జీలు అందాయి. జేసీలు రాజశేఖర్‌, వెంకటేశ్వర్‌, డీఆర్వో మురళి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జేసీలు రాజాబాబు, వెంకటేశ్వర్‌, రాజశేఖర్‌, డీఆర్వో మురళి అర్జీదారుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. 

Read more