రంగుపైన రంగులు

ABN , First Publish Date - 2022-09-29T06:29:48+05:30 IST

నగరంలోని గోడలమీద హిందూ దేవుళ్లు, జాతీయ నాయకుల చిత్రాలను చెరిపేసి వైసీపీ రంగులు వేసిన తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో తిరుపతి కార్పొరేషన్‌ దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టింది.

రంగుపైన రంగులు

జనాగ్రహంతో ఆగమేఘాలపై తెల్లరంగు వేశారు

తిరుపతి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : నగరంలోని గోడలమీద హిందూ దేవుళ్లు, జాతీయ నాయకుల చిత్రాలను చెరిపేసి వైసీపీ రంగులు వేసిన తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో తిరుపతి కార్పొరేషన్‌ దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టింది. సీఎం తిరుపతి పర్యటనకు ముందు రోజు పార్టీ రంగులద్దినవారు, ఆయన తిరిగి వెళ్లిపోగానే వాటిమీద తెల్లరంగు పూశారు. ఆధ్యాత్మిక నగరంలో ఇవేం రాజకీయ చర్యలంటూ పలువురు విమర్శలకు దిగారు. సీఎం జగన్‌ తిరుపతి పర్యటనలో భాగంగా ఆయన ప్రయాణించే మార్గంలో  రాత్రికి రాత్రే తారు రోడ్లు వేశారు. డివైడర్లకు రంగులు వేశారు. ఈ క్రమంలో  బాలాజీ కాలనీ సర్కిల్‌ వద్దగల ఎస్వీయూనివర్సిటీ క్యాంపస్‌ స్కూల్‌ గోడలపై ఉన్న జాతీయ నేతలు, పురాణ ఇతిహాస చిత్రాలు మసకబారి కళావిహీనంగా కనిపించడంతో వాటిపై  వైసీపీ రంగులను పులిమేశారు.మీడియాలో విమర్శలు రావడంతో బుఽధవారం ఉదయం  హడావుడిగా పార్టీ రంగుల మధ్యలో కాషాయం, గోధుమ రంగులను పూసి మేం అన్ని రంగులూ వేశామంటూ మీడియాకు సమాచారం ఇచ్చారు. అయితే అప్పటికీ విమర్శలు రావడంతో అన్ని రంగుల మీదా తెల్లరంగు పూసేశారు.


Read more