-
-
Home » Andhra Pradesh » Chittoor » Cheddi Gang in Tiruchanur-NGTS-AndhraPradesh
-
తిరుచానూరులో చెడ్డీగ్యాంగ్ కలకలం
ABN , First Publish Date - 2022-09-08T06:39:07+05:30 IST
తిరుచానూరు పంచాయతీ పరిధిలోని నందనవనం లేఅవుట్ (పాత ముళ్లపూడి రోడ్డు)లో విశ్రాంత లైబ్రరీ ఉద్యోగి దొరస్వామిరెడ్డి కుటుంబం నివాసం ఉంటోంది. వీరి ఇంట్లో చోరీ చేసేందుకు చెడ్డీగ్యాంగ్ విఫలయత్నం చేసింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

విశ్రాంత ఉద్యోగి ఇంట్లో చోరీకి విఫలయత్నం
ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు: సీఐ
తిరుచానూరు, సెప్టెంబరు 7: తిరుచానూరు పంచాయతీ పరిధిలోని నందనవనం లేఅవుట్ (పాత ముళ్లపూడి రోడ్డు)లో విశ్రాంత లైబ్రరీ ఉద్యోగి దొరస్వామిరెడ్డి కుటుంబం నివాసం ఉంటోంది. వీరి ఇంట్లో చోరీ చేసేందుకు చెడ్డీగ్యాంగ్ విఫలయత్నం చేసింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం వేకువన రెండు గంటల సమయంలో నలుగురు వ్యక్తులు ఇనుపరాడ్లు చేతపట్టుకొని దొరస్వామిరెడ్డి ఇంటి పిట్టగోడను దూకి ప్రాంగణంలోకి వచ్చారు. తర్వాత ఇంటి గేటు ముందున్న సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. దాదాపు అరగంటపాటు ప్రధాన ద్వారం తెరవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. చివరకు కిటికీ బోల్టును తొలగించారు. తలుపులు, కిటికీల ఇనుపచువ్వలు బలంగా ఉండడంతో చేసేదేమీ లేక చెడ్డీగ్యాంగ్ వెనుతిరిగింది. ఉదయం నిద్రలేచిన దొరస్వామిరెడ్డి ఇంటి ముందు సీసీకెమెరాలు పడి ఉండటాన్ని గమనించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ సుబ్రహ్మణ్యంరెడ్డి క్లూస్ టీమ్‌ను రప్పించి పరిశీలించారు. వీడియో ఫుటేజీలను చూశారు. బుధవారం ఈ సంఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. దీనిపై సీఐ మాట్లాడుతూ.. అపరిచిత వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, గస్తీని ముమ్మరం చేశామన్నారు. కాగా.. దొంగల ముఠాలో ఇద్దరు మంకీ క్యాంపులు ధరించినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో కూడా తిరుచానూరు పరిసర ప్రాంతాల్లో చెడ్డీగ్యాంగ్ హల్‌చల్ చేయడంతో పోలీసులు కొంతమందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఎంఆర్‌పల్లె పోలీ్‌సస్టేషన్‌లో పరిధిలో మంగళవారం వేకువన చోరీ జరిగింది. ఆ చోరీకి ఈ ముఠాకి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.