చెక్‌డ్యామ్‌లు ఇలా.. నీళ్లు నిలిచేదెలా?

ABN , First Publish Date - 2022-12-10T00:10:10+05:30 IST

కౌండిన్య నదిపై పలుచోట్ల చెక్‌డ్యామ్‌లు నిర్మించారు. వీటిలో చాలావరకు తెగిపోయాయి. నిర్మాణంలో అధికారులు నాణ్యతను పట్టించుకోకపోవడంతో ఇలా జరిగిందన్న ఆరోపణలున్నాయి.

చెక్‌డ్యామ్‌లు ఇలా.. నీళ్లు నిలిచేదెలా?
గంగవరం మండలం కేటిల్‌ఫారం వద్ద చెక్‌డ్యాం నుంచి వెళ్లిపోతున్న నీరు

పలమనేరు, డిసెంబరు 9: పరుగెత్తే నీటిని నిలపాలి. భూమిలోకి ఇంకింపచేయాలి. తద్వారా భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయి. దీనికోసం కౌండిన్య నదిపై పలుచోట్ల చెక్‌డ్యామ్‌లు నిర్మించారు. వీటిలో చాలావరకు తెగిపోయాయి. నిర్మాణంలో అధికారులు నాణ్యతను పట్టించుకోకపోవడంతో ఇలా జరిగిందన్న ఆరోపణలున్నాయి. దీంతో నీళ్లు నిలవక.. తమిళనాడుకు తరలిపోతున్నాయి. దీంతో చెక్‌డ్యామ్‌ల లక్ష్యం నెరవేరడం లేదు. కౌండిన్య నదిపై పలుచోట్ల నిర్మించిన చెక్‌డ్యాంలు అప్పుడే తెగిపోయాయి. కాంట్రాక్టర్ల నాసిరకం నిర్మాణాలతో తెగిపోయి నదీ జలాలు తమిళనాడుకు తరలిపోతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. పలమనేరు నియోజకవర్గంలోని పెద్దపంజాణి, గంగవరం, పలమనేరు మండలాల్లో కేవలం వర్షాకాలంలో మాత్రమే కౌండిన్య నది ప్రవహిస్తుంది. ఈ నదికి ఎగువన ఉండే పుంగనూరు చెరువు, పెద్దపంజాణి, గంగవరం మండలాల్లోని కొన్ని చెరువులు నిండి కలుజు పారితే కౌండన్యకు జలకళ సంతరించుకుంటుంది. దీంతో ఈ కౌండిన్య పరివాహక ప్రాంతంలోని మూడు మండలాల్లో భూగర్భ జలాలు పెంచేందుకు నదిపై పలుచోట్ల చెక్‌డ్యాంలు నిర్మించారు. నాలుగు దశాబ్దాలుగా పెద్దపంజాణి, గంగవరం, పలమనేరు మండలాల పరిధిలో ఏటా ఎక్కడో ఒక చోట చెక్‌డ్యాంలు నిర్మిస్తూ, పాతవాటికి మరమ్మతులు చేపడుతున్నారు. ఇరిగేషన్‌ శాఖ పరిధిలో రెండు దశాబ్దాల క్రితం నిర్మించిన చెక్‌డ్యాంలు నేటికి కొన్ని చోట్ల చెక్కుచెదరక పోగా పదేళ్ల క్రితం నిర్మించిన చెక్‌డ్యాంలు గండిపడటం, కొట్టుకు పోయాయి. నాసిరకం నిర్మాణాల వల్లే ఇలా జరిగిందన్న ఆరోపణలున్నాయి. సాధారణంగా చెక్‌డ్యాంల నిర్మాణంలో నాసిరకం బయట పడితే సంబంధిత కాంట్రాక్టరును బ్లాక్‌ లిస్టులో పెట్టడం, లేదా మళ్లీ ఆ చెక్‌డ్యాంను సదురు కాంట్రాక్టరు సొంతనిధులతో నిర్మింప జేయడం, లేదా ఆ నిర్మాణానికి చెల్లించిన ప్రజాధనం రాబట్టాలి. ఈ నిబంధనలు ఎందుకు అమలు కావడం లేదన్నది స్థానికుల ప్రశ్న. చెక్‌డ్యాంలు కొట్టుకుపోతున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు లేకపోలేదు. ఇకనైనా ఇరిగేషన్‌ అధికారులు కౌండిన్య నదిపై నిర్మించే చెక్‌డ్యాంల విషయంలో నాణ్యతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా వుంది.

Updated Date - 2022-12-10T00:10:12+05:30 IST