చెలరేగుతున్న సెల్‌ఫోన్‌ దొంగలు!

ABN , First Publish Date - 2022-09-10T06:20:12+05:30 IST

రుపతిలో సెల్‌ఫోన్‌ దొంగలు చెలరేగిపోతున్నారు.

చెలరేగుతున్న సెల్‌ఫోన్‌ దొంగలు!

తిరుపతిలో రోజుకు 20కి పైగా మాయం

బస్టాండ్లు, యాత్రికుల సముదాయాలు, 

రైతుబజారు వద్దే ఎక్కువ చోరీలు 


ఇరవైరోజుల క్రితం  ఓ రైల్వే ప్రయాణికుడు మూత్ర విసర్జనకని ఒకటో ప్లాట్‌ఫారం మీదుగా పార్శిల్‌ ఆఫీసు దాటి కాస్త చీకట్లోకి వెళ్లాడు. అక్కడ ఇద్దరు యువకులు కత్తులతో బెదిరించి సెల్‌ఫోన్‌తోపాటు అతడి వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బునూ లాక్కుపోయారు. 

నాలుగు వారాలక్రితం రాత్రిపూట అలిపిరి లింక్‌ బస్టాండ్‌లో విశ్రాంతి తీసుకుంటున్న ఓ ప్రయాణికుడి జేబులోని సెల్‌ఫోన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాజేశారు. 


తిరుపతి(నేరవిభాగం), సెప్టెంబరు 9: తిరుపతిలో సెల్‌ఫోన్‌ దొంగలు చెలరేగిపోతున్నారు. బస్టాండ్లు, యాత్రికుల సముదాయాలు, రాయలచెరువు రోడ్డులోని రైతుబజారు వద్దే ఎక్కువగా ఫోన్లు చోరీ అవుతున్నాయి. నగరంలోని ప్రతి పోలీసు స్టేషన్‌కూ నిత్యం సెల్‌ఫోన్‌ చోరీకి సంబంధించిన ఫిర్యాదులు వస్తుండడమే ఇందుకు నిదర్శనం. 


రద్దీ ప్రాంతాల్లోనే ఎక్కువ


ఆర్టీసీ బస్టాండులో సెల్‌ఫోన్‌ చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి. పోలీసులతోపాటు ఆర్టీసీ సెక్యూరిటీ నిఘా ఇక్కడ పెద్దగా లేకపోవడమే దీనికి కారణం. మరోవైపు బస్టాండులోని సీసీ కెమెరాలు పనిచేయకపోవడం కూడా దొంగలకు కలిసి వస్తోంది. బస్సెక్కే హడావుడిలో ప్రయాణికులుంటే వారి జేబుల్లోని సెల్‌ఫోన్లను కొట్టేసే పనిలో దొంగలుంటున్నారు. అలాగే శ్రీనివాసం, విష్ణు నివాసం వంటి యాత్రికుల వసతి సముదాయాల్లోనూ అదనుచూసి పనికాచ్చేస్తున్నారు. రాయలచెరువు రోడ్డులోని రైతుబజారులోనూ సెల్‌ఫోన్‌ దొంగతనాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. ఇక్కడ ఒకే వారంలో నాలుగు సెల్‌ఫోన్‌ దొంగతనాలు జరిగాయని స్థానికులు తెలిపారు.  మున్సిపల్‌ మార్కెట్‌ ప్రాంతంలోనూ ఈ చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి. 


రాత్రయితే చాలు


ఆర్టీసీ బస్టాండు, పెద్దకాపు లేఔట్‌ ప్రాంతాల్లో సెల్‌ఫోన్‌ దొంగలు మరింత చెలరేగిపోతున్నారు. రాత్రిపూట ఈ ప్రాంతాల్లో ఏమరుపాటుగా ఉంటే మాట్లాడుతుండగానే సెల్‌ఫోన్‌ను లాక్కెళ్లిపోతున్నారు. ద్విచక్రవాహనాల్లో వేగంగా వస్తూ ఈ చోరీలకు పాల్పడుతున్నారు. ఎవరైనా ప్రతిఘటించే ప్రయత్నం చేస్తే దాడులకు తెగబడుతున్నారు. మే నెలలో తిరుపతి బస్టాండ్‌ పార్కింగ్‌ స్థలంలో ఆటోలో నిద్రిస్తున్న డ్రైవరు జేబులోని సెల్‌ను చోరీ చేయడానికి ఓ యువకుడు ప్రయత్నించాడు. నిద్ర మేల్కొన్న ఆటోవాలా ప్రతిఘటించడంతో మరో దొంగతో కలిసి  కత్తితో పొడిచి తప్పించుకుపోయారు. ఇలాంటి ఘటనలకు సంబంధించి పోలీసులకు పలు ఫిర్యాదులు ఉన్నప్పటికీ ఈ చోరీలను నిలువరించలేకపోతున్నారు. 


వస్తున్న ఫిర్యాదులు తక్కువే..!


నగరంలో రోజుకు సగటున 20 నుంచి 30 సెల్‌ఫోన్లు చోరీకి గురౌతున్నట్టు సమాచారం. కానీ పోలీసులకు మాత్రం తక్కువగానే ఫిర్యాదులు అందుతున్నాయి. తిరుపతికి ఎక్కువగా ఇతర ప్రదేశాలవారు వస్తుండడంతో చోరీలపై ఫిర్యాదు చేయడం లేదు. ఎందుకంటే విచారణ పేరుతో మళ్లీ తిరుపతికి రావాల్సి ఉండటంతో మిన్నకుండిపోతున్నారు. స్థానికులు, కొందరు యాత్రికులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా.. సాంకేతిక కారణాలరీత్యా తక్షణం చోరీకి గురైన సెల్‌ఫోన్లకు గుర్తించలేమని, అవకాశం దొరికేవరకు వేచి ఉండాల్సిందేనని పోలీసులు చెబుతున్నారు. అందువల్ల వారు ఫిర్యాదుదారులనుంచి సెల్‌ఫోన్‌ ఐఎంఈఐ నెంబర్లను తీసుకుని.. రికవరీ చేశాక ఫోన్‌ చేస్తామంటూ పంపించేస్తున్నారు. ఒక్కోసారి దొంగలు దొరికినప్పటికీ అప్పటికే వారు ఆ ఫోన్లను విక్రయించేయడం,  అవి ఇతర రాష్ట్రాల్లో ఉండటంవల్ల రికవరీ మరింత కష్టమౌతోందని పోలీసులు పేర్కొంటున్నారు.  

Read more