రైతులకు న్యాయం చేయలేకపోతున్నా

ABN , First Publish Date - 2022-12-30T01:16:44+05:30 IST

రైతులకు న్యాయం చేయలేకపోతున్నామన్న బాధ తనలో వుందని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులకు న్యాయం చేయలేకపోతున్నా
వలంటీర్ల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి

ఎమ్మెల్యే రామనారాయణరెడ్డి ఆవేదన

డక్కిలి, డిసెంబరు 29 : రైతులకు న్యాయం చేయలేకపోతున్నామన్న బాధ తనలో వుందని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.డక్కిలి మండలంలో గురువారం జరిగిన వలంటీర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ వెనకబడ్డ వెంకటగిరి నియోజకవర్గంలో రైతులు వర్షాధారం పైనే పంటలు సాగుచేస్తున్నారని అయితే చెంతనే తెలుగుగంగ కాలువ ద్వారా నీళ్లు ప్రవహిస్తున్నా కొన్ని చెరువులకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. కాలువకు అక్కడక్కడా తూములు ఏర్పాటుచేస్తే అన్ని చెరువులకూ నీళ్లు ఇవ్వగలమని చెప్పారు. అయితే ఆ ప్రతిపాదనలు విజయవాడలో నిలిచిపోయాయని చెప్పారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి శంఖుస్థాపన చేసిన సోమశిల-స్వర్ణముఖి కాలువ నిర్మాణంలో భాగంగా ఆల్తూరుపాడు వద్ద నిర్మించనున్న రిజర్వాయరు నిర్మాణం ఇద్దరు కాంట్రాక్టర్లు మారాక ఇప్పుడు పనులు రద్దుచేయడం వల్ల అక్కడి రైతులు నాలుగేళ్లుగా పంటలు పండించుకోలేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వాయరు నిర్మిస్తామని చెప్పి ఉన్న చెరువును పూర్తిగా తొలగించడంతో చెరువులో నీరు నిలబడక రైతులు తమ పొలాలను బీడుగా వదిలేశారని చెప్పారు. ఇక్కడి రైతులు పెద్దమనుషులు కాబట్టి పంటలు ఎండిపోతున్నా రిజర్వాయరు నిర్మించకపోతారా అని ఓపికతో ఎదురుచూస్తున్నారని చెప్పారు. రైతుల్లో అసహనం పెరిగిపోతే ప్రభుత్వానికి, పార్టీకే నష్టం జరుగుతుందన్న విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని పార్టీ పరిశీలకుడు సత్యనారాయణరెడ్డిని ఆనం కోరారు. సుమారు 300మంది రైతుల పరిస్థితి దీనంగా మారిందని, తాను గతంలో ఆర్డీవోతో మాట్లాడి ఆ గ్రామాన్ని క్రాప్‌ హలిడేగా ప్రకటించాలని కోరడం జరిగిందన్నారు. తర్వాత వచ్చిన ఆర్డీవో చెరువు వద్దకు వెళ్లి అసలు ఇక్కడ చెరువు కనిపించడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారన్నారు. అయితే అక్కడి రైతులకు పంట నష్టపరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు. గ్రామాల్లో అభివృద్ధి ఆశించిన మేర జరగలేదన్న ఆనం అభివృద్ధికి సంబందించి ఎన్నో ఫైళ్లు అమరావతిలో కదలిక లేకుండా ఆగిపోయి వున్నాయంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్‌ బ్యాంకు డైరెక్టరు వెలికంటి రమణారెడ్డి, జడ్పీటీసీ కలిమలి రాజేశ్వరి, ఎంపీపీ గోను రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T01:16:47+05:30 IST