-
-
Home » Andhra Pradesh » Chittoor » Booth committees should work as a guide for volunteers-NGTS-AndhraPradesh
-
వలంటీర్లకు దీటుగా బూత్ కమిటీలు పనిచేయాలి
ABN , First Publish Date - 2022-07-18T06:25:34+05:30 IST
వలంటీర్ల వ్యవస్థకు దీటుగా తెలుగుదేశం పార్టీ బూత్ లెవెల్ ఇన్‌చార్జీలు పనిచేయాలని మాజీ మంత్రి అమరనాథరెడ్డి సూచించారు. పలమనేరు టీడీపీ కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గంలోని 5 మండలాల పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, యూనిట్, క్లస్టర్, బూత్‌లెవెల్ ఇన్‌చార్జీలు, ఐ-టీడీపీ నేతలతో ఆయన సమావేశమయ్యారు.

టీడీపీ శ్రేణులకు మాజీ మంత్రి అమర్ పిలుపు
పలమనేరు, జూలైౖ 17: వలంటీర్ల వ్యవస్థకు దీటుగా తెలుగుదేశం పార్టీ బూత్ లెవెల్ ఇన్‌చార్జీలు పనిచేయాలని మాజీ మంత్రి అమరనాథరెడ్డి సూచించారు. పలమనేరు టీడీపీ కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గంలోని 5 మండలాల పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, యూనిట్, క్లస్టర్, బూత్‌లెవెల్ ఇన్‌చార్జీలు, ఐ-టీడీపీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. వైసీపీ తమ కార్యకర్తలనే వలంటీర్లుగా ఏర్పాటు చేసుకుని వారి ద్వారానే ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతోందని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే కార్యక్రమాలు జరుగుతున్నాయని దానిపై దృష్టిపెట్టాలన్నారు. ఇప్పటికే వలంటీరు వ్యవస్థ ద్వారా వైసీపీ అందరి సమాచారాన్ని సేకరించుకుందని వారికి దీటుగా అన్ని అంశాల్లో బూత్‌స్థాయినుంచి పార్టీని పటిష్ఠపరిచేలా ఇన్‌చార్జీలు పనిచేయాలన్నారు. ప్రజలు టీడీపీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని ఐతే ఆ ఓట్లు వేయించుకోవడానికి కృషి చేయాలన్నారు. పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు ఓటర్ల జాబితాలో సమస్యలను గుర్తించి పూర్తి చేయాలన్నారు. సోషల్ మీడియాలో మరింత ఉత్సాహంగా యువత పనిచేసి గ్రామస్థాయినుంచి పార్టీ కార్యక్రమాలను నిర్వర్తించాలన్నారు. ఇక ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను వెలుగులోకి తేవాలన్నారు. ఇక వైసీపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో వ్యవసాయ మోటర్లకు మీటర్లను అమర్చడం రైతులకు ఉరితాళ్లు బిగించడమేనని ఆయన అభివర్ణించారు. శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ కార్యక్రమంతో రైతులు పూర్తిగా నష్టపోతారని, ప్రధానంగా చిత్తూరు జిల్లా రైతాంగానికి మరింత నష్టం తప్పదని వివరించారు. ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 21న నెల్లూరు జిల్లా మనుబోలులో రైతుపోరుబాటను నిర్వహిస్తున్నామని, దీన్ని విజయవంతం చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సీఎం కాకపోతే రాష్ట్ర భవిష్యత్ అంధకారమేనని అన్నారు. మరోమారు జగన్ సీఎం అయితే శ్రీలంకకు మించిన పరిస్థితి చూడాల్సి వస్తుందన్నారు. బ్రహ్మయ్య, ఖాజాపీర్, సుబ్రమణ్యగౌడు, గిరిబాబు, రంగనాథ్, ఆనంద్, సోమశేఖర్, నాగరాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు.