అటెండెన్స్‌ యాప్‌ పనిచేయక... బోధన సాగక!

ABN , First Publish Date - 2022-08-17T05:49:22+05:30 IST

ఉన్న యాప్‌లు చాలక మరో యాప్‌. లెక్కకు మిక్కిలి యాప్‌లతో ఉపాధ్యా యులను కట్టడి చేసి, బడిని జైలుగా మార్చి, విద్యా ర్థులను గాలికి వదిలేసిన సర్కారు సరికొత్తగా టీచర్స్‌ ఆన్‌లైన్‌ అటెండ్‌ యాప్‌ను తీసుకొచ్చింది. అది పనిచేయక ఉదయపు తరగతులు మొత్తం హుష్‌ అయిపోయాయి

అటెండెన్స్‌ యాప్‌ పనిచేయక... బోధన సాగక!
యాప్‌ పనిచేయడంలేదని మొబైళ్లు చూపుతున్న కుప్పం ప్రాంతంలోని ఉపాధ్యాయులు

ఉపాధ్యాయలోకం సతమతం

  

కుప్పం, ఆగస్టు 16: ఉన్న యాప్‌లు చాలక మరో యాప్‌. లెక్కకు మిక్కిలి యాప్‌లతో ఉపాధ్యా యులను కట్టడి చేసి, బడిని జైలుగా మార్చి, విద్యా ర్థులను గాలికి వదిలేసిన సర్కారు  సరికొత్తగా టీచర్స్‌ ఆన్‌లైన్‌ అటెండ్‌ యాప్‌ను తీసుకొచ్చింది. అది పనిచేయక ఉదయపు తరగతులు మొత్తం హుష్‌ అయిపోయాయి. యాప్‌లో తమ ఫొటోతో అ టెండెన్స్‌ను నమోదు చేసుకోకుంటే ఆబ్సెంట్‌ వేసే స్తామన్న సర్కారు హుకుంతో బెంబేలెత్తిన టీచర్లు... మొబైళ్లు చేతుల్లో పెట్టుకుని అటూఇటూ తిరిగేస్తూ ఆన్‌లైన్‌ కటాక్షంకోసం నిరీక్షిస్తూ తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.


యాప్‌లతో కుస్తీ...

ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే బోధన సాగడం లేదు. ప్రతిరోజు పాఠశాలకు వెళ్లింది మొదలు టీచ ర్లందరూ యాప్‌లతో కుస్తీ పడాల్సి వస్తోంది. విద్యా ర్థులు తినకముందు, తిన్నాక, బాత్‌రూంలకు వెళ్లాక, తిరిగి వచ్చాక... ఇలా ప్రతిదీ ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సిన దీనస్థితి. ఇవి చాలదన్నట్లుగా సర్కారు టీచర్స్‌ ఆన్‌లైన్‌ అటెండెన్స్‌ యాప్‌ కొత్తగా తీసుకొచ్చింది. ఈ యాప్‌లో అందరూ ఉపాధ్యా యులూ పేర్లు రిజిస్టర్‌ చేసుకుని తీరాలని, అది కూడా సోమవారంనాటితో పూర్తి కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఉపాధ్యాయులందరూ సోమవారం తమ సొంత మొబైళ్లలో ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసి, తమ పేర్లను రిజిస్టర్‌ చేసుకున్నారు. అందుకు కూడా తంటాలు తప్పలేదు. ఇక మంగళ వారంనుంచి టీచర్స్‌ అటెండెన్స్‌ యాప్‌లో ఫొటో సహా అటెండెన్స్‌ ఉండాలని, అది కూడా ఉదయం తొమ్మిదిలోపే జరిగిపోవాలని, ఆ సమయం దాటి ఒక్క నిమిషమైనా ఆబ్సెంట్‌ తప్పదని వాట్సాప్‌ మెసేజ్‌లు ఇబ్బడిముబ్బడిగా వచ్చి పడిపో యాయి. అధికారుల ఆదేశాలు ఆయా పాఠశాలల హెచ్‌ఎంలకు అందాయి. దీంతో టీచర్లం దరూ మంగళవారం ఉదయం 8 నుంచి 8.30 గంటల మధ్యే బడులకు ప రుగులు తీశారు. ఇక అక్కడినుంచి ఇబ్బం దులు మొదలు. ఒక్కో పాఠశాలలో ఏ ఒకరిద్దరికో తప్ప, మరెవరికీ ఆన్‌లైన్‌ యాప్‌ పనిచేయలేదు. ఉదయం 8.30 గంటల నుం చి ఇదే పనితో వారికి సరిపోయింది. పాఠశాలలో ఒకరిద్దరి మొబైళ్లలో మాత్రం యాప్‌ పని చేస్తుండ డంతో వాటిలోనే ఆన్‌లైన్‌ అటెండెన్స్‌ వేయడానికి  పోటీ పడ్డారు. దీంతో ఆ మొబైళ్లు కూడా హాంగ్‌ అయిపోయాయి. సాయంత్రం దాకా కేవలం సగం మంది మాత్రమే అటెండెన్స్‌ వేయగలిగారు. తిరిగి ఇదే అవస్థ సాయంత్రం కూడా ఎదురైంది.  నాలుగు గంటలకు అటెండెన్స్‌ యాప్‌లో మళ్లీ టీచర్లు హాజరు నమోదు చేయాలన్న నిబంధన ఉంది. దీంతో తిరిగి యాప్‌తో కుస్తీ తప్పనిసరి అయ్యింది. పదేపదే ప్రయత్నిస్తే ఎప్పుడో సా యంత్రం ఐదు నుంచి ఐదున్నర గంటలదాకా  కొద్దిమంది టీచర్ల అటెండెన్స్‌ మాత్రం యాక్సెప్ట్‌ అ యింది. అప్పటికే బడి సమయం మించి పోతుం డడంతో ఏదైతే అదే అయిందని చాలామంది టీచర్లు  ఇంటిదారి పట్టారు. 

ఈ యాప్‌ తికమకలో విద్యార్థులను గాలికి వదల్లేక, అలాగని క్లాసులు తీసుకోలేక టీచర్లు పడిన ఇబ్బంది పడ్డారు. ఉదాహరణకు... కుప్పం పట్టణం లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో మొత్తం 18 మంది టీచర్లున్నారు. వీరు ఉదయం 8.30 నుంచి ఆన్‌లైన్‌ యాప్‌లో అటెండన్స్‌ వేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఉదయం 11 గంటలదాకా కేవలం ఇద్దరు టీచర్ల అటెండెన్స్‌ మాత్రమే యాక్సెప్ట్‌ అయ్యాయి. మిగిలినవారు కుస్తీలు పడుతూనే ఉండిపోవాల్సి వచ్చింది. కేవలం ఈ పాఠ శాలే కాదు, నియోజకవర్గంలోని ప్రతి పాఠశాల లోనూ ఇదే పరిస్థితి. 


నోరు మెదపని ఉన్నతాధికారులు...


ఉన్న యాప్‌లు చాలక ఆన్‌లైన్‌ టీచర్స్‌ అటెండె న్స్‌ యాప్‌ తీసుకొచ్చిన సర్కారు పెద్దలపై ఉపాధ్యా యలోకం మండి పడుతోంది. దీన్ని వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తోంది. నిజానికి ఆన్‌లైన్‌ అటెండెన్స్‌ యాప్‌ను టీచర్లెవరూ మొబైళ్లలో డౌన్‌లోడ్‌ చేసుకోవద్దంటూ ఫ్యాప్టో మూడునాలుగు రోజులుగా పిలుపు ఇస్తూనే ఉంది. అయితే ప్రభుత్వం ఎక్కడ క్రమశిక్షణ చర్యలకు పా ల్పడుతుందోనని ఆందోళన చెందిన టీచర్లు చాలా మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. అంత పెద్ద హం గామా చేసిన సర్కారు పెద్దలు అటెండెన్స్‌ యాప్‌ పనిచేయకపోడంపై నోరు మెదపడంలేదు. కనీసం బుధవారమైనా యాప్‌ పనిచేస్తుందో లేదో తెలి యదని, ఇది తమ ఉద్యోగాలపాలిట గుది బండగా తయారయిందని ఉపాధ్యాయలోకం వాపోతోంది.

Updated Date - 2022-08-17T05:49:22+05:30 IST