జాతీయ కార్మిక సదస్సుకు ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-08-25T05:57:20+05:30 IST

రుచానూరు సమీపంలోని హోటల్‌ తాజ్‌ వేదికగా గురు,శుక్ర వారాల్లో జరగనున్న జాతీయ కార్మిక సదస్సుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

జాతీయ కార్మిక సదస్సుకు ఏర్పాట్లు

తిరుపతి చేరుకున్న కేంద్ర కార్మిక శాఖ మంత్రి

వర్చువల్‌గా ప్రసంగించనున్న ప్రధాని మోదీ


తిరుపతి, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి):తిరుచానూరు సమీపంలోని హోటల్‌ తాజ్‌ వేదికగా గురు,శుక్ర వారాల్లో జరగనున్న జాతీయ కార్మిక సదస్సుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ  సదస్సుకు అధ్యక్షత వహించనున్న కేంద్ర మంత్రి ఎస్‌.హెచ్‌.భూపేంద్ర యాదవ్‌ బుధవారం మధ్యాహ్నమే తిరుపతి చేరుకున్నారు. శ్రీకాళహస్తికి వెళ్లి ముక్కంటి దర్శనం చేసుకుని రాహుకేతు పూజల్లో పాల్గొన్నారు.అనంతరం తిరుమల చేరుకున్నారు.గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని తిరుపతికి రానున్నారు.గురువారం సాయంత్రం 4.30 గంటలకు సదస్సు ప్రారంభం కానుంది. ఢిల్లీ నుంచీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభోత్సవ ఉపన్యాసం చేస్తారు. అనంతరం 5.30 గంటలకు ఇ-శ్రమ్‌, సామాజిక భద్రత అంశాలపై వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నివేదికల సమర్పణ, వాటిపై చర్చ జరుగుతాయి. రెండవ రోజైన శుక్రవారం ఉదయం 9 గంటలకు సదస్సు ప్రారంభమవుతుంది. స్వస్థసే సమృద్ధి, ఆరోగ్య భద్రత, పీఎం జేఏవై తదితర అంశాలపై సమీక్ష వుంటుంది. 10.30 గంటలకు లేబర్‌ కోడ్స్‌, రిజిస్ట్రేషన్‌, లైసెన్సు విధానాలపై చర్చ జరుగుతుంది. మధ్యాహ్నం 12.15 గంటలకు 2047-విజన్‌ శ్రమేవ్‌ జయతే అంశంపై చర్చ సాగిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచీ 3.30 గంటల నడుమ ముగింపు కార్యక్రమం వుంటుంది. మొత్తం మీద సదస్సు కార్మికుల సంక్షేమానికి మెరుగైన విధానాలను రూపొందించడంలో, ఆయా పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో కేంద్ర రాష్ట్రాల మధ్య మరింత సమన్వయం ఏర్పరిచే దిశగా కృషి చేయనుంది. కార్మికులకు సామాజిక రక్షణను అమలు చేయడంలో భాగంగా ఆన్‌ బోర్డింగ్‌ సామాజిక భద్రతా పథకాల కోసం ఇ-క్రామ్‌ పోర్టల్‌ను ఏకీకృతం చేయడంపై ప్రధానంగా సదస్సులో చర్చించనున్నారు.రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఈఎస్‌ఐ ఆస్పత్రుల ద్వారా వైద్య సంరక్షణను మెరుగుపరచడం, పీఎం జన్‌ ఆరోగ్య యోజనతో ఏకీకరణ కోసం స్వాస్థ్య సే సమృద్ధి, అలాగే నాలుగు లేబర్‌ కోడ్‌ల కింద నియమాలను రూపొందించి, వాటి అమలుకు పద్ధతులు ఏర్పరచడంపై కూడా సదస్సు చర్చింనుంది. అంతే కాకుండా 2047-విజన్‌ శ్రమేవ్‌ జయతే కింద అసంఘటిత కూలీలు, ప్లాట్‌ఫామ్‌ వర్కర్లతో సహా కార్మికులందరికీ సామాజిక రక్షణ కల్పించడం, పనికి న్యాయమైన, సమానమైన పరిస్థితులను కల్పించడం, పనిలో లింగ సమానత్వం అమలు వంటి సమస్యలపై కూడా సదస్సు దృష్టి సారించనుంది


రాష్ట్రాల కార్మిక మంత్రులు, ఉన్నతాధికారుల రాక


  సదస్సులో పాల్గొనేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాల కార్మిక శాఖల మంత్రులు, రాష్ట్రాలతో పాటు కేంద్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ఉన్నతాధికారులు బుధవారం రాత్రిలోగా చేరుకోనున్నారు. సదస్సుకు హాజరయ్యే అతిధులకు వారిస్థాయికి తగ్గట్టుగా వసతి, రవాణా సదుపాయాలను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. సదస్సుకు ఒకరోజు ముందే తిరుపతి చేరుకున్న కేంద్ర ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌ నీలం సామిరావు, కేంద్ర కార్మిక శాఖ డైరెక్టర్‌ రాహుల్‌ భగత్‌, సెంట్రల్‌ పీఎఫ్‌ అదనపు కమిషనర్‌ శ్రీకృష్ణ, పీఎఫ్‌ ప్రాంతీయ అధికారి రవీంద్ర కుమార్‌ జిల్లాకు సంబంధించిన కలెక్టర్‌, జేసీ, ఎస్పీ తదితర అధికారులతో సమావేశమై సదస్సు ఏర్పాట్ల గురించి సమీక్షించారు. మంత్రులు, అధికారులు కలిపి 90 మంది హాజరు కానుండగా వారికి అవసరమైన సదుపాయాలు కల్పించే పనులు పూర్తయ్యాయి. పలువురు మంత్రులు, ఉన్నతాధికారుల వెంట కుటుంబసభ్యులు కూడా వస్తుండడం, తిరుమల సహా చుట్టుపక్కల పుణ్యక్షేత్రాలు, ఇతర దర్శనీయ స్థలాలు సందర్శించే అవకాశమున్న నేపధ్యంలో దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేశారు. కాగా కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షా అధ్యక్షతన దక్షిణాది రాష్ట్రాల జోనల్‌ సమావేశాల తర్వాత మరోసారి జాతీయ స్థాయి కార్యక్రమానికి తిరుపతి వేదిక కావడంతో జిల్లా యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా పరిగణించి ఆ మేరకు ఏర్పాట్లు చేసింది.


రెండువేలమందితో బందోబస్తు:ఎస్పీ

 తిరుపతి(నేరవిభాగం), ఆగస్టు 24: కార్మిక సదస్సుకు పోలీసు యంత్రాంగం పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది. సదస్సును అడ్డుకోవాలని వామపక్ష పార్టీలు పథక రచన చేస్తున్న నేపథ్యంలో 2వేల మంది పోలీసు సిబ్బందితో భద్రతా చర్యలు చేపట్టారు. తాజ్‌ హోటల్‌ పరిసర ప్రాంతాల్లో నాలుగు చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు.వీఐపీలు పర్యటించే, ప్రయాణించే ప్రదేశాలు, మార్గాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. సదస్సు జరిగే రెండు రోజులు హోటల్‌, సమీప ప్రాంతాల్లో డ్రోన్‌ కెమెరాలతో నిఘా ఏర్పాటుచేయనున్నారు.పొరుగు జిల్లాల నుంచి తిరుపతిలోకి ప్రవేశించే ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశాకే అనుమతిస్తున్నారు.తాజ్‌ హోటల్లోని సభావేదిక ఏర్పాట్లను బుధవారం ఎస్పీ పరమేశ్వర రెడ్డి పరిశీలించారు. వీఐపీలు  ఆలయాలకు వెళ్లివచ్చేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరించారు. ఏఎస్పీలు సుప్రజ, కులశేఖర్‌, విమలకుమారి, ఎస్బీ డీఎస్పీ వెంకటరమణ ఇతర డీఎస్పీలు ఎస్పీ వెంట ఉన్నారు. 

Read more