కాణిపాక బ్రహ్మోత్సవాలకు సర్వంసిద్ధం

ABN , First Publish Date - 2022-08-31T07:00:28+05:30 IST

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది.

కాణిపాక బ్రహ్మోత్సవాలకు సర్వంసిద్ధం
వెలుగులీనుతున్న కాణిపాక ఆలయం

ఐరాల(కాణిపాకం), ఆగస్టు 30: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. కరోనా కారణంగా రెండేళ్లు బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించారు. ఈ ఏడాది వైభవంగా నిర్వహించడానికి ఆలయ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో సురే్‌షబాబు, ఈఈ వెంకటనారాయణ ఏర్పాట్లు చేపట్టారు. ప్రధాన ఆలయానికి పంచరంగులు వేశారు. అనుబంధ మణికంఠేశ్వర స్వామి, వరదరాజస్వామి ఆలయాలకు, కల్యాణ మండపాలు, అగరంపల్లె ఆర్చికి రంగులు వేశారు. కాణిపాకాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేశారు. స్వామి దర్శనానంతరం వెలుపలకు వచ్చే భక్తులు స్వామి ప్రసాదాలు కొనుగోలు చేసేలా లడ్డూ కౌంటర్లను సిద్ధం చేశారు. తాత్కాలిక వైద్యశాలను అందుబాటులో ఉంచారు. భక్తుల కోసం నిరంతర అన్నదానం ఉంటుంది. వివిధ ప్రాంతాల నుంచి కాణిపాకం వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులను నడపనున్నారు. ఇక ఆలయంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను కలెక్టర్‌ హరినారాయణన్‌, ఎస్పీ రిషాంత్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. 


నేడు పట్టువస్త్రాల సమర్పణ 

వరసిద్ధుడి బ్రహ్మోత్సవాలకుగాను బుధవారం చవితి రోజున స్వామికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య ఈ కార్యక్రమం ఉంటుందని ఆలయ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో సురే్‌షబాబు తెలిపారు.


నేటి నుంచి ఉత్సవాలు ప్రారంభం 

వరసిద్ధుడి ఆలయంలో బుధవారం (వినాయక చవితి) నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. చవితి రోజున కాకర్లవారిపల్లెకు చెందిన గాలి మునస్వామి నాయుడు స్వామికి అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం కాణిపాక విఘ్నేశ్వర యువజన సంఘం వారు పుష్ప కావుళ్లను సమర్పించి రాత్రి స్వామికి గ్రామోత్సవాన్ని నిర్వహించనున్నారు. సెప్టెంబరు 1న ఉదయం ధ్వజారోహణం, రాత్రి హంస వాహన సేవ నిర్వహిస్తారు. 2న నెమలి, 3న మూషిక, 4న ఉదయం చిన్నశేష, రాత్రి పెద్ద శేష, 5న ఉదయం చిలుక, రాత్రి వృషభ, 6న గజ వాహన సేవ, 7న రథోత్సవం, 8న రాత్రి స్వామికి తిరుకల్యాణం, అశ్వవాహన సేవ, 9న ధ్వజావరోహణం, సాయంత్రం స్వామికి వడాయత్తు ఉత్సవం, రాత్రి ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఆ తర్వాత ప్రత్యేక ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 10న అధికారనంది, 11న రావణబ్రహ్మ, 12న యాళి, 13న విమానోత్సవం, 14న సూర్యప్రభ, 15న చంద్రప్రభ, 16న కామధేను, 17న పుష్పపల్లకి సేవ, 18న కల్పవృక్ష వాహనం, 19 పూలంగి సేవ, 20న తెప్పోత్సవంతో ముగుస్తాయి.

Read more