వసతి అవస్థలు

ABN , First Publish Date - 2022-06-07T06:43:23+05:30 IST

తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతున్న క్రమంలో వసతికి కూడా అదేస్థాయిలో ఇబ్బందులు పెరుగుతున్నాయి.తిరుమలలో ఉన్న గదుల ద్వారా 40వేల మందికి బస కల్పించే అవకాశముండగా అంతకుమించి రద్దీ పెరుగుతుండడంతో గదులు లభించక చాలా మంది గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సి వస్తోంది.

వసతి అవస్థలు
గదుల కోసం క్యూలైన్లలో భక్తులు

గదులు లభించక తిరుమలలో భక్తుల పాట్లు

గంటల తరబడి క్యూలైన్లలోనే నిరీక్షణ

40వేల మందికే కొండపై బస సౌకర్యం

అంతకు మించితే ఆరుబయటే 


తిరుమల, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతున్న క్రమంలో వసతికి కూడా అదేస్థాయిలో ఇబ్బందులు పెరుగుతున్నాయి.తిరుమలలో ఉన్న గదుల ద్వారా 40వేల మందికి బస కల్పించే అవకాశముండగా అంతకుమించి రద్దీ పెరుగుతుండడంతో గదులు లభించక చాలా మంది గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సి వస్తోంది.ఆలయ పరిసర ప్రాంతాలు, ఫుట్‌పాత్‌లు, పార్కులు, కార్యాలయాల ముందు భక్తులు సేదదీరాల్సి వస్తోంది. 

తిరుమలలో దాదాపు 7,500కాటేజీలున్నాయి.రూ.50 నుంచి రూ.6,800వరకు ధర కలిగిన వీటిలో కొన్ని దాతలు కట్టించినవైతే మరికొన్ని టీటీడీయే నిర్మించింది. వీటి ద్వారా 35వేల నుంచి 40 వేల మందికి బస కల్పించటానికి వీలవుతుంది. అంతకుమించి భక్తులు తిరుమలకు చేరుకున్నప్పుడల్లా గదులకు డిమాండ్‌ పెరిగిపోతోంది. వేసవి సెలవులు కూడా జత కావడంతో ప్రస్తుతం రోజుకు 70వేల నుంచి 90వేలమంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు.సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ముందు గది తీసుకుని సేద తీరిన తర్వాత దర్శనానికి వెళుతుంటారు.అయితే భక్తుల సంఖ్య పెరిగిన ప్రతిసారీ గది పొందేందుకు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. అయితే తిరుమలలో ఇకపై భవన నిర్మాణాలు జరగకూడదనే నిబంధన ఉండడంతో ఉన్న గదులనే సర్దుబాటు చేయడం తప్ప టీటీడీ వద్ద మరో ఆప్షన్‌ లేదు. కొండపై ఉన్న 7,500 గదుల్లో పద్మావతి, ఎంబీసీలో కలిపి దాదాపు 1,300 గదులను సిఫార్సు లేఖలపై కేటాయిస్తారు. మరో 1,600 గదులు అడ్వాన్స్‌ రిజర్వేషన్‌కు వెళ్లిపోతాయి. ఇక, ఎమ్మెల్యే, ఎంపీల సిఫార్సులపై మరో వెయ్యి గదులను టీబీ కౌంటర్‌లో కేటాయిస్తారు.2,500 గదులను కరెంట్‌ బుకింగ్‌లో భక్తులకు కేటాయిస్తుంటారు. కొండపై విధులు నిర్వహించే టీటీడీ ఉద్యోగులు, డిప్యుటేషన్‌ అధికారులు, ఇతర ప్రైవేట్‌ సంస్థలకు శాశ్వత కేటాయింపు కింద దాదాపు 250 గదులను కేటాయించారు. మిగిలిన వాటిలో దాదాపు 850 గదులకు మరమ్మతులు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో నెలల తరబడి మరమ్మతులు జరుగుతూనే ఉండడంతో భక్తులందరికీ కాటేజీలు సర్దుబాటు చేయలేక టీటీడీ సతమతమవుతోంది.టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్య అధికంగా ఉండడం,అఽధికారపార్టీ ఎమ్మెల్యేల సంఖ్య కూడా ఎక్కువగా ఉండడంతో వారి సిఫార్సులపై కూడా ఎక్కువ సంఖ్యలో గదులు కేటాయించాల్సి వస్తోంది.దీంతో ఉన్న గదుల్లో సగభాగం కంటే తక్కువ మాత్రమే కరెంట్‌ బుకింగ్‌లో కేటాయించాల్సి వస్తోంది. టైంస్లాట్‌ సర్వదర్శనాలున్నంత వరకు గదులకు డిమాండ్‌ తక్కువగానే కనిపించింది.ప్రస్తుతం టోకెన్‌ రహిత సర్వదర్శనాలను మాత్రమే అమలుచేస్తున్న క్రమంలో తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది.ఈ క్రమంలోనే గదులకూ డిమాండ్‌ భారీగా ఉంటోంది. ఒక గదిని పొందేందుకు సుమారు 5 నుంచి 7 గంటల సమయం పడుతోంది. పైగా, గదిని పొందిన భక్తులకు తమ లగేజీని గదిలో పెట్టి తాళాలు వేసుకుని దర్శనానికి వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 10 నుంచి 20 గంటల సమయం పడుతోంది. అంటే అప్పటివరకు ఆ గది కేవలం లగేజీకి మాత్రమే పరిమితమవుతోంది. ఈక్రమంలోనే తిరుమలలో గదుల సమస్య తారస్థాయికి చేరుకుంటోంది.గతంలో వారాంతాల్లో మాత్రమే సాయంత్రం తర్వాత గదుల కేటాయింపు కేంద్రాలను మూసివేసేవారు.ప్రస్తుతం రోజూ గదుల కొరత కారణంగా సాయంత్రానికే మూతపడుతున్నాయి. 

సర్వదర్శనాలు మినహా వీఐపీ బ్రేక్‌, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, సుపథం, వృద్ధులు,దివ్యాంగులు, డిఫెన్స్‌, ఆర్జితసేవల టికెట్లు కలిగిన భక్తులకు దర్శనం ఎప్పుడో ముందుగానే నిర్ణయమవుతుంది కాబట్టి వారిలో సగంమందికైనా తిరుపతిలో గదులు కేటాయిస్తే కొండపై బస కష్టాలు కొంతైనా తగ్గించవచ్చని టీటీడీ అధికారులు కొంతమంది  ఆలోచిస్తున్నారు.సర్వదర్శన భక్తులకు దర్శనానికి పట్టే  సమయాన్ని ప్రచారం చేస్తే గుడికి వెళ్లేటప్పుడు గదిని ఖాళీ చేసి లగేజీని లాకర్లలో భద్రపరుచుకుంటే మరో భక్తుడికి ఆ గదిని కేటాయించే వెసులుబాటు లభిస్తుందన్న విషయాన్ని భక్తుల్లో విస్తృత ప్రచారం చేయాలన్న ఆలోచన కూడా చేస్తున్నారు. దీంతో పాటు టైంస్లాట్‌ సర్వదర్శన టోకెన్లు కూడా జారీ చేసి వాటిని పొందిన భక్తులు తమకు కేటాయించిన దర్శన సమయానికే తిరుమలకు వచ్చేలా చర్యలు తీసుకుంటే బస సమస్య తగ్గించే అవకాశాలుంటాయని భావిస్తున్నారు.తిరుమలలోని నాలుగు వసతి సముదాయాల్లో లాకర్ల సంఖ్యతో పాటు సౌకర్యాలు పెంచితే మరో 15వేల మందికి బస కష్టాలు తీర్చే అవకాశముంటుందని ఆలోచిస్తున్నారు. 



Updated Date - 2022-06-07T06:43:23+05:30 IST