డ్రగ్స్‌ అడ్డాగా మారిన రాష్ట్రం

ABN , First Publish Date - 2022-12-09T23:52:00+05:30 IST

డ్రగ్స్‌ సరఫరాకు రాష్ట్రం అడ్డాగా మారిందని తెలుగు యువత నేతలు ఆరోపించారు. చిత్తూరు ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం వీరు విలేకరులతో మాట్లాడారు.

డ్రగ్స్‌ అడ్డాగా మారిన రాష్ట్రం
ప్లకార్డులు చూపుతున్న తెలుగుయువత నేతలు

నిరుద్యోగులను నిండా ముంచిన సీఎం జగన్‌

తెలుగు యువత నేతల విమర్శ

చిత్తూరు సిటీ, డిసెంబరు 9: డ్రగ్స్‌ సరఫరాకు రాష్ట్రం అడ్డాగా మారిందని తెలుగు యువత నేతలు ఆరోపించారు. చిత్తూరు ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం వీరు విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్‌ పట్టుబడినా వాటి మూలాలు ఎక్కువగా మన రాష్ట్రంలోనే ఉన్నాయని గుర్తుచేశారు. యువత ఎక్కువగా మాదకద్రవ్యాలకు బానిసలవుతూ తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. మాదక ద్రవ్యాలను నిరోధించాల్సిన వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో డ్రగ్స్‌ మాఫియా చెలరేగిపోతోందన్నారు. అధికార పార్టీనేతలు వారి అనుచరులు కొందరు డ్రగ్స్‌, గంజాయి, హెరాయిన్‌ వంటి మాదకద్రవ్యాల అక్రమవ్యాపారం చేస్తూ కోట్లు గడిస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి వస్తే లక్షల్లో ఉద్యోగాలు ఇస్తామని తన పాదయాత్రలో నిరుద్యోగులకు జగన్‌ మాయమాటలు చెప్పారన్నారు. తీరా అధికారంలోకి రాగానే నిరుద్యోగులను నిలువునా ముంచారన్నారు. వైసీపీ అధికారంలోకివచ్చి మూడున్నరేళ్లవుతున్నా ఇంతవరకు జాబ్‌క్యాలెండర్‌ విడుదల చేయలేదన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో అనేక పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కొత్త పరిశ్రమలు రాకపోగా, ఉన్న పరిశ్రమలు సైతం ఇతర రాష్ట్రాలకు తరలివెలుతున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వం మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు కార్యక్రమంలో తెలుగు యువత చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు కాజూరు రాజేష్‌, రాష్ట్ర అధికార ప్రతినిధులు వరుణ్‌కుమార్‌, గోళ్ళ హేమాద్రి నాయుడు, నేతలు హేమరాజు, రాంప్రసాద్‌, గౌస్‌, యువరాజు, భరత్‌, ప్రతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-09T23:52:01+05:30 IST