గో ఆధారిత ఉత్పత్తులతోనే క్యాన్సర్‌ రహిత సమాజం

ABN , First Publish Date - 2022-10-08T06:13:37+05:30 IST

గో ఆధారిత ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడంతోపాటు యోగా, ధ్యానం అలవరుచుకోవడం వల్ల క్యాన్సర్‌ రహిత సమాజాన్ని నిర్మించవచ్చని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు.

గో ఆధారిత ఉత్పత్తులతోనే క్యాన్సర్‌ రహిత సమాజం
సమావేశంలో ప్రసంగిస్తున్న సినీనటి గౌతమి

టీటీడీ ఈవో ధర్మారెడ్డి

దేవస్థానం ఉద్యోగినులకు క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం


తిరుపతి సిటీ, అక్టోబరు 7: గో ఆధారిత ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడంతోపాటు యోగా, ధ్యానం అలవరుచుకోవడం వల్ల క్యాన్సర్‌ రహిత సమాజాన్ని నిర్మించవచ్చని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. టీటీడీ మహిళా ఉద్యోగులకు శ్వేత ఆధ్వర్యంలో క్యాన్సర్‌పై మూడ్రోజుల  అవగాహన కార్యక్రమాన్ని తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఈవో ప్రసంగించారు. మహిళలు క్యాన్సర్‌పై అవగాహన కల్గి ఉంటే తొలిదశలోనే గుర్తించి.. నివారించే అవకాశం ఉంటుందన్నారు. మాంసాహారం, పాశ్చాత్యపు ఆహారపు అలవాట్లు కూడా క్యాన్సర్‌కు కారణాలన్నారు. గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల వాడకంతో క్యాన్సర్‌ బారిన పడకుండా ఉండే అవకాశాలున్నాయని చెప్పారు. అందుకే గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ.. మార్కెట్‌ ధర కంటే ఎక్కువ చెల్లించి రైతుల నుంచి 12 రకాల ఉత్పత్తులను కొనుగోలు చేయాలని టీటీడీ బోర్డు నిర్ణయించిందన్నారు.టీటీడీ ఉద్యోగులు మాంసాహారాన్ని మానుకోవాలని పిలుపునిచ్చారు. సినీ నటి గౌతమి మాట్లాడుతూ.. వయసుతో నిమిత్తం లేకుండా ఎవరికైనా క్యాన్సర్‌ రావచ్చన్నారు. క్యాన్సర్‌ వస్తే చావు తప్పదనే భావన తప్పు అని.. దానికి తానే నిదర్శనమని చెప్పారు. అలాగే తనకు క్యాన్సర్‌ వచ్చినప్పటి నుంచి కోలుకునే వరకు ఎదురైన అనుభవాలను తెలియజేసి.. ఉద్యోగినుల సందేహాలనూ  నివృత్తి చేశారు. జేఈవో సదా భార్గవి, స్విమ్స్‌ డైరెక్టర్‌ వెంగమ్మ, టీటీడీ ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతి కూడా క్యాన్సర్‌కు కారణాలు,  ఆరోగ్యపు అలవాట్లు వంటి వాటిపై ప్రసంగించారు. శ్వేత సంచాలకులు ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.

Read more