ఎమ్మెల్సీ ముసాయిదా జాబితాలో 17,491 డూప్లికేట్‌ ఓట్లు

ABN , First Publish Date - 2022-12-12T01:54:49+05:30 IST

చిత్తూరు- ప్రకాశం- నెల్లూరు ఉమ్మడి జిల్లా ఉపాధ్యాయ, పట్టభద్ర నియోజకవర్గాలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో 17,491 మంది డూప్లికేట్‌ ఓటర్లు (ఒకరి పేరు ఒకటి, అంతకంటే ఎక్కువసార్లు ఉండడం) ఉన్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది.

ఎమ్మెల్సీ ముసాయిదా జాబితాలో  17,491 డూప్లికేట్‌ ఓట్లు

చిత్తూరు కలెక్టరేట్‌, డిసెంబరు 11: చిత్తూరు- ప్రకాశం- నెల్లూరు ఉమ్మడి జిల్లా ఉపాధ్యాయ, పట్టభద్ర నియోజకవర్గాలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో 17,491 మంది డూప్లికేట్‌ ఓటర్లు (ఒకరి పేరు ఒకటి, అంతకంటే ఎక్కువసార్లు ఉండడం) ఉన్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి 16,925, ఉపాధ్యాయ నియోజకవర్గానికి 566 ఉన్నట్లు పేర్కొంది. ఇందులో చిత్తూరు జిల్లా నుంచి దాదాపు రెండు వేలకుపైగా డూప్లికేట్‌ ఓటర్లు ఉన్నారని స్థానిక ఉపాధ్యాయ సంఘాల నేతలు వెల్లడించారు. పట్టభద్రుల ఓటర్ల జాబితాకు సంబంధించి తగిన విద్యార్హతలు లేని అనర్హులు, అనుమానాస్పద పేర్లు ఉన్నట్లు తేల్చింది. వీటిపై క్షేత్రస్థాయిలో పరిశీలించి అనర్హులను తొలగించాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముఖేర్‌ కుమార్‌ మీన కలెక్టర్‌ను ఆదేశించారు. డిప్లొమా పట్టభద్రులు, 10+2+3 కలిపి మొత్తంగా 15 ఏళ్ల పాటు రెగ్యులర్‌గా చదివి ఉంటేనే అర్హులుగా పరిగణించాలని, లేకుంటే జాబితా నుంచి తొలగించాలన్నారు. ఐటీఐ విద్యార్హత కలిగిన వారు కూడా అనర్హులేనని స్పష్టం చేశారు. కొందరి విద్యార్హతలకు సంబంధించిన పూర్తి వివరాలు లేవని, మరికొందరి విద్యార్థుల గడిలో ఆంగ్ల అక్షరాలైన ఎక్స్‌, ఏ, వి వంటి అక్షరాలను పొందుపరిచారని, వీటన్నిటిని తక్షణమే పరిశీలించి తొలగించాలన్నారు. దీతో డూప్లికేట్‌ ఓటర్లు, అనర్హులను తొలగించడానికి ఆయా జిల్లాల అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. ఓటర్ల జాబితాను తీసుకొని వీఆర్వోలు, ఇతర సిబ్బంది ఇంటింటికే వెళుతున్నారు. ఒక చోట ఓటును కొనసాగించి, మిగిలిన చోట్ల తొలగించేలా మూడు రోజులుగా డిక్లరేషన్‌ తీసుకుంటున్నారు. అనర్హులకూ కారణాలు చెబుతున్నారు. ఒకవేళ వీరి వద్ద డిగ్రీ, ఆపై చదువులు చదివినట్లు ఆధారాలుంటే పరిశీలించి జిరాక్స్‌ కాపీలను తీసుకుంటున్నారు. సోమవారంలోగా మొత్తం విచారణ ప్రక్రియ పూర్తిచేసేందుకు అధికారులు నిమగ్నమయ్యారు. డూప్లికేట్‌ ఓట్ల తొలగింపుపై ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే అన్ని జిల్లాల కలెక్టర్లతో ఈనెల 15న సీఈవో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు.

Updated Date - 2022-12-12T01:54:49+05:30 IST

Read more