జంబ్లింగ్‌ విధానంలో 11నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్స్‌

ABN , First Publish Date - 2022-03-04T06:42:41+05:30 IST

గతంలోవలె ఈఏడాది కూడా ఇంటర్మీడియట్‌ ప్రయోగ పరీక్షలు జంబ్లింగ్‌ విధానంలో జరగనున్నాయి.

జంబ్లింగ్‌ విధానంలో 11నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్స్‌
సమావేశంలో ప్రసంగిస్తున్న రాజశేఖర్‌

92 పరీక్ష కేంద్రాలకు హాజరుకానున్న 35,554 మంది విద్యార్థులు


తిరుపతి(విద్య), మార్చి 3: గతంలోవలె ఈఏడాది కూడా ఇంటర్మీడియట్‌ ప్రయోగ పరీక్షలు జంబ్లింగ్‌ విధానంలో జరగనున్నాయి. కొవిడ్‌ కారణంగా గత ఏడాది ఈ పరీక్షలు జరపకుండా దరఖాస్తు చేసిన విద్యార్థులందరినీ పాస్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి కొవిడ్‌ ప్రొటోకాల్‌ పాటిస్తూ ఈనెల 11 నుంచి 31 తేదీవరకు వివిధ దశల్లో ఈ ప్రయోగపరీక్షలు నిర్వహించేలా ఇంటర్‌బోర్డు అధికారులు చర్యలు చేపట్టారు. ఈపరీక్షలపై గురువారం తిరుపతిలోని ఆర్డీవో కార్యాలయంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌.రాజశేఖర్‌ నేతృత్వంలో ప్రాంతీయ ఇంటర్‌బోర్డు అధికారులతో సమావేశం జరిగింది. జిల్లావ్యాప్తంగా 92 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. జనరల్‌, ఒకేషనల్‌ కోర్సుల్లో మొత్తం 35,554 (జనరల్‌-27,480మంది, ఒకేషనల్‌- 8,074) మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు చెప్పారు. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు, మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెండుసెషన్లలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆర్‌ఐవో వై.వెంకటరెడ్డి తెలిపారు. హైపవర్‌ కమిటీ సభ్యులు గోపాల్‌రెడ్డి, డీఈసీ సభ్యులు వేణుగోపాల్‌రెడ్డి, శ్రీధర్‌, బాబు తదితరులు పాల్గొన్నారు. 

Read more