పోరాట యోధుల వల్లే స్వేచ్ఛ

ABN , First Publish Date - 2022-07-05T08:13:42+05:30 IST

అల్లూరి సీతారామరాజు వంటి స్వాతంత్య్ర సమర యోధుల పోరాట పటిమ, త్యాగాల వల్లే స్వేచ్ఛా భారతదేశంలో ఉన్నామని టీడీపీ అధినేత చంద్రబాబు

పోరాట యోధుల వల్లే స్వేచ్ఛ

అల్లూరికి చంద్రబాబు ఘన నివాళి


అమరావతి, జూలై 4(ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు వంటి స్వాతంత్య్ర సమర యోధుల పోరాట పటిమ, త్యాగాల వల్లే స్వేచ్ఛా భారతదేశంలో ఉన్నామని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. అల్లూరి 125వ జయంత్యుత్సవాల సందర్భంగా సోమవారం ఆయన హైదరాబాద్‌లోని స్వగృహంలో అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. అల్లూరి పోరాటం ఎనలేనిదని, కానీ ఆయనకు జాతీయ స్ధాయిలో రావాల్సినంత గుర్తింపు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ఇప్పుడు అధికారికంగా జయంత్యుత్సవాలు నిర్వహించడం అభినందనీయమని, ప్రధాని స్వయంగా రాష్ట్రానికి వచ్చి అల్లూరికి నివాళులర్పించడం ఎంతో సముచితమని.. దీనిని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. పార్లమెంటు హాల్లో అల్లూరి విగ్రహం పెట్టాలని గతంలో స్పీకర్‌ నిర్ణయించారని, దీనిని తక్షణం ఆచరణలోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. కాగా మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలోనూ అల్లూరి జయంతి కార్యక్రమాన్ని పార్టీ నేతలు నిర్వహించారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, గురజాల మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.


విప్లవ జ్యోతికి నీరాజనాలు: పవన్‌

అణచివేతలో ఉద్భవించిన విప్లవాగ్ని అల్లూరి సీతారామరాజు అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కొనియాడారు. అల్లూరి 125వ జయంతి సందర్భంగా ఆ మహా వీరునికి నమస్సుమాంజలి అర్పిస్తున్నట్లు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. పాలకులు ప్రజల సంపద, మాన ప్రాణాల భక్షకులుగా మారిన నాడు, అవినీతి, ఆశ్రిత పక్షపాతానికి లోనైననాడు, ప్రభుత్వాలను కూకటివేళ్లతో పెకిలించే వీరులు ఉదయిస్తారని చెప్పడానికి అల్లూరి సీతారామరాజు నిలువెత్తు తార్కాణం గుర్తుచేశారు. విప్లవ జ్యోతికి వ్యక్తిగతంగా, పార్టీ తరఫున నీరాజనాలు ఆర్పిస్తున్నట్లు పేర్కొన్నారు.


అసెంబ్లీ ప్రాంగణంలో... 

అల్లూరి 125 జయంతిని పురస్కరించుకుని సోమవారం అమరావతి శాసనసభ ప్రాంగణంలో ఘనంగా వేడుకలు జరిగాయి. శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు, ఇతర అధికారులు, సిబ్బంది అందరూ సమావేశమై అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. శాసనమండలి ఉప కార్యదర్శి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read more