నేటి నుంచి వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

ABN , First Publish Date - 2022-07-28T09:03:28+05:30 IST

నేటి నుంచి వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

నేటి నుంచి వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

విలీన మండలాల్లో రెండు రోజులు బాధితుల పరామర్శ 


అమరావతి, జూలై 27(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గురువారం నుంచి మరో విడత వరద ప్రాంతాల్లో పర్యటించనున్నారు. విలీన మండలాల్లో ఆయన రెండు రోజుల పాటు పర్యటించి బాధితులను పరామర్శించనున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. పోయిన వారం రెండు రోజుల పాటు ఆయన ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించి బాధితులను కలిశారు. అప్పుడే విలీన మండలాలకు కూడా వెళ్లాలని భావించినా అప్పటికి ఆ ప్రాంతంలో వరద ఉధృతి తగ్గకపోవడంతో ఆ పర్యటన వాయిదా పడింది. గురువారం ఉదయం ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో పర్యటిస్తారు. ఆ రాత్రి ఆయన భద్రాచలంలో బస చేస్తారు. శుక్రవారం ఉదయం రామాలయాన్ని సందర్శించి పూజలు చేస్తారు. అదేరోజు ఎటపాక, కూనవరం, వర రామచంద్రాపురం మండలాల్లో బాధితులను పరామర్శిస్తారు. 


వరద ప్రాంతాల్లో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సేవలు

వరద బాధితులను ఆదుకొనేందుకు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ భువనేశ్వరి తెలిపారు. బాధిత ప్రాంతాల్లో ఆహారం, తాగునీరు, మందులు సహా ఇతర వస్తువుల పంపిణీ ప్రారంభించామని చెప్పారు. ఎన్టీఆర్‌ ట్రస్టు సిబ్బంది సహకారంతో జరుగుతున్న ఈ సేవా కార్యక్రమాలను ఆమె బుధవారం సమీక్షించారు. గోదావరి జిల్లాలు సహా రాష్ట్రవ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సుమారు 8వేల కుటుంబాలకు నిత్యావసరాలు, మందులు, పాలు అందించామని, అదే స్ఫూర్తితో మిగిలిన వారికి సాయం అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. 


Updated Date - 2022-07-28T09:03:28+05:30 IST