Chandrababu: ఎన్టీఆర్ పేరు మార్చడం సరైంది కాదని జగన్‌ చెల్లెలే చెప్పారు..

ABN , First Publish Date - 2022-09-22T21:55:44+05:30 IST

ఎన్టీఆర్ పేరు మార్చడం సరైంది కాదని సీఎం జగన్‌ చెల్లెలు షర్మిల చెప్పారని చంద్రబాబు అన్నారు.

Chandrababu: ఎన్టీఆర్ పేరు మార్చడం సరైంది కాదని జగన్‌ చెల్లెలే చెప్పారు..

అమరావతి (Amaravathi): రాష్ట్రానికి ఎయిమ్స్ తీసుకొస్తే కనీసం నీటీ సరఫరా కూడా చేయలేదని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) విమర్శించారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ (NTR) పేరును తొలగించడంపై.. టీడీపీ బృందం గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌కు కలిసి ఫిర్యాదు చేసింది. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరు మార్చడం సరైంది కాదని సీఎం జగన్‌ (CM Jagan) చెల్లెలు షర్మిల (Sharmila) చెప్పారన్నారు. ఎన్టీఆర్ పేరును మార్చడం తెలుగు జాతికి అవమానమన్నారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నిధులను కూడా దోచుకున్నారని, స్నాతకోత్సవం జరుపుకోవడానికి కూడా డబ్బులు లేవని చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు.


హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాలని సీఎం జగన్ ఒక చీకటి చట్టం తెచ్చారని చంద్రబాబు అన్నారు. అత్యవసరంగా, హడావుడిగా వర్శిటీ పేరు మార్చారన్నారు. అన్ని మెడికల్ కళాశాలలను ఒక యూనివర్శిటీ కిందకు తేవాలని 1986లో హెల్త్ వర్సిటీ తెచ్చారన్నారు. 1998లో మేము ఎన్టీఆర్ పేరు వర్శిటీకి పెట్టామన్నారు. 24 ఏళ్లలో వేల మంది విద్యార్థులు వైద్య విద్య అభ్యసించారన్నారు. రాష్ట్రంలో 32 మెడికల్ కాలేజీలు ఉంటే 18 టీడీపీ హయాంలోనే వచ్చాయన్నారు. అసెంబ్లీలో ఇన్ని అసత్యాలు చెప్పిన సీఎంను ఇంతవరకు చూడలేదన్నారు. జగన్ చెప్పిన వాటిలో మూడు కాలేజీలకు మాత్రమే కేవలం అనుమతులు వచ్చాయన్నారు. ఎన్టీఆర్ పేరు తీసెయ్యాలనే ఆలోచన ఎలా వచ్చింది?.. ఎన్టీఆర్‌కు వైఎస్సార్‌తో పోలిక ఏంటని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కంటే వైఎస్సార్ గొప్ప అని చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలన్నారు. వర్శిటీకి గవర్నర్ ఛాన్సలర్‌గా ఉన్నారని, పేరు మార్పుపై గవర్నర్‌ను అడిగారా? అని చంద్రబాబు నిలదీశారు. ఎవరి హయాంలో ఏమీ వచ్చాయి అనేది వైసీపీ నేతలు కూడా చూడాలన్నారు. తప్పును తప్పు అని చెప్పక పోతే ఎమ్మెల్యేలు ఎందుకన్నారు. ఇలాంటి వాళ్ళు సీఎంగా కాదు.... అసలు రాజకీయాల్లోనే ఉండకూడదన్నారు. మళ్ళీ ఎన్టీఆర్ పేరు పెట్టే వరకు పోరాటం చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

Updated Date - 2022-09-22T21:55:44+05:30 IST