Chandrababu: సీమకు జగన్‌ ద్రోహం

ABN , First Publish Date - 2022-11-19T03:43:05+05:30 IST

ఓడిపోతామనే భయంతో, పిరికితనంతో సీఎం జగన్‌ మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.

Chandrababu: సీమకు జగన్‌ ద్రోహం

ఓటమి భయంతోనే ప్రాంతీయ చిచ్చు

ఎవరు న్యాయం చేశారో, ఎవరిది ద్రోహమో మేధావులు, యువత ఆలోచించాలి

రతనాల సీమగా మార్చాలనుకున్నా.. హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు నేనే ప్రతిపాదించా

కర్నూలును మహానగరంగా తీర్చిదిద్దాలని ప్రణాళికలు వేశా

అమరావతికి జగన్‌ మద్దతిచ్చినప్పుడు ఈ పేటీఎం బ్యాచ్‌ ఏమైపోయింది?

కర్నూలులో చంద్రబాబు నిప్పులు.. అడ్డుకునేందుకు వైసీపీ కార్యకర్తల యత్నం

కర్నూలు, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఓడిపోతామనే భయంతో, పిరికితనంతో సీఎం జగన్‌ మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. జగన్‌ రాయలసీమ ద్రోహి అని ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లాలో మూడ్రోజుల పర్యటనలో చివరి రోజు శుక్రవారం ఆయన ఇక్కడ టీడీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. అనంతరం గాయత్రీ ఎస్టేట్‌ ఎదురుగా ఉన్న టీడీపీ కార్యాలయం ఆవరణలో టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణకు బయల్దేరారు. అయితే వైసీపీ సానుభూతిపరులు, స్థానిక ఎమ్మెల్యే అనుచరులు కొందరు ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారిపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వారంతా పేటీఎం బ్యాచ్‌ అని, వైఎస్సార్‌ పార్టీ గూండాలని విరుచుకుపడ్డారు. ‘చేతగాని దద్దమ్మల్లారా.. నేరాలు, ఘోరాలు చేసే దుర్మార్గుల్లారా.. ఎంత ధైర్యం మీకు? మా ఇంటికి వస్తారా.. మా ఆఫీసుకు వస్తారా.. మీ అంతు చూస్తా..’ అని నిప్పులు చెరిగారు. ఇలాంటివారు రాయలసీమ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ‘రాయలసీమను రతనాలసీమగా మార్చాలని నేననుకున్నాను. ఈ ప్రాంతానికి ద్రోహం చేసిన వ్యక్తి జగన్‌. విశాఖకు వెళ్లి ఉత్తరాంధ్రవాళ్లను రెచ్చగొడుతున్నావు.. రాయలసీమకు వచ్చి ఇక్కడి వాళ్లను రెచ్చగొడుతున్నారు. మతానికి, కులానికి చిచ్చు పెట్టి చలి కాచుకోవాలనుకుంటున్నాడు. జగన్‌! నీవు రాజకీయాలు చేస్తావా.. గూండాయిజం చేస్తావా.. నేననుకుంటే మిమ్మల్ని తరిమితరిమి కొడతారు.. వైఎస్సార్‌ గూండాలూ గుర్తు పెట్టుకోండి. ఆరోజు నేననుకుని ఉంటే ఈ జగన్‌ ఇంటి నుంచి బయటకు వచ్చేవాడా’ అని నిలదీశారు. ఇంకా ఏమన్నారంటే..

ఎస్పీ.. ఏం చేస్తున్నావ్‌?

వైఎస్సార్‌ గూండాలు, పేటీఎం బ్యాచ్‌ మా మీదకు వస్తుంటే.. పోలీసులు ఏం చేస్తున్నారు? ఏందయ్యా ఇదీ.. ఉద్యోగం చేస్తున్నారా..? మీ చొక్కాలు విప్పి రండి. పోలీసు వ్యవస్థ సర్వనాశనమైంది. ఎస్పీ ఏం చేస్తున్నావు.. ఎవరికి కాపలా కాస్తున్నావు..? ప్రజలకు కాపలా కాస్తావా.. రౌడీలకు అండగా ఉంటావా..? మీకు ఐపీఎస్‌ ఇవ్వడమే దండగ. నేను ఒంటరివాడిని కాదు. నా వెంట ఐదు కోట్ల మంది ఉన్నారు. దెబ్బకు దెబ్బ తప్పదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నా ప్రాణాలు కూడా లెక్క చేయను. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ను నేనే ప్రతిపాదించా. అమరావతిలో రాజధాని పెట్టాలనుకున్నప్పుడు కర్నూలుకు కూడా న్యాయం చేయాలని, మహానగరంగా తీర్చిదిద్దాలని ప్రణాళికలు తయారు చేశాను. ఎయిర్‌పోర్టు కట్టాను. సోలార్‌ పార్కు తెచ్చాను. ట్రిపుల్‌ ఐటీ, ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశాను. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి తెచ్చాను. ఆరోజు రాజధాని అమరావతికి జగన్‌ మద్దతిచ్చినప్పుడు ఈ వైఎస్సార్‌ పేటీఎం బ్యాచ్‌ ఎక్కడకు పోయింది?. ఈ రాష్ట్రానికి, రాయలసీమకు ఎవరు న్యాయం చేస్తున్నారో, ఎవరు ద్రోహం చేస్తున్నారో మేధావులు ఆలోచించాలి. యువత ఆలోచించాలి. ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండలో వేలాదిగా తరలివచ్చిన ప్రజలను ఒక రాజధాని కావాలా.. మూడు రాజధానులు కావాలా అని అడిగితే.. ఒక్క రాజధాని కావాలని వారంతా గొంతెత్తారు. పేటీఎం బ్యాచ్‌ల దాడులకు భయపడే ప్రసక్తేలేదు. నాతో పెట్టుకుంటే.. వారికి అవే చివరి రోజులు. నాతో పెట్టుకోవడానికి రాజశేఖర్‌రెడ్డి కూడా వెనుకడుగు వేశాడు. రాష్ట్రానికి, రాయలసీమకు ముఖ్యంగా ఈ కర్నూలుకు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసిందో చెబుతా. ఈ మూడున్నరేళ్లలో నువ్వేం చేశావో చెప్పే ధైర్యం ఉందా జగన్‌? కర్నూలు ప్రజానీకమే బేరీజు వేసుకుని నిర్ణయిస్తారు.

చంద్రబాబును అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు, లాయర్లు

కర్నూలు, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబును శుక్రవారం కర్నూలులో వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. చంద్రబాబూ గో బ్యాక్‌.. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. నల్లబెలూన్లు ఎగురవేశారు. చంద్రబాబు బస చేసిన ప్రదేశంలో నిరసన తెలిపేందుకు కొందరు లాయర్లు రాగా.. పోలీసులు వారిని స్టేషన్‌కు తీసుకెళ్లి వదిలేశారు. టీడీపీ జిల్లాస్థాయి సమావేశం అనంతరం మధ్యాహ్నం 2.45కి చంద్రబాబు తన కాన్వాయ్‌తో పార్టీ కార్యాలయానికి బయల్దేరారు. మెడికల్‌ కాలేజీ సమీపానికి రాగానే రోడ్డు పక్కన ఉన్న వైసీపీ కార్యకర్తలు, రాయలసీమ విద్యార్థి సంఘం నాయకులు ఒక్క ఉదుటున కాన్వాయ్‌కు అడ్డంగా వచ్చారు. చంద్రబాబు కారుకు అడ్డంగా పడిపోయారు. పోలీసులు వందల్లో ఉన్నా 15-20 మంది కూడా లేని నిరసనకారులు జడ్‌ప్లస్‌ భద్రత ఉన్న చంద్రబాబు కారుకు అడ్డంగా వచ్చి ఆపే ప్రయత్నం చేయడం భద్రతా వైఫల్యాలను ఎత్తి చూపింది. అక్కడి నుంచి చంద్రబాబు టీడీపీ ఆఫీసుకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలు, లాయర్లు, వైసీపీ కార్పొరేటర్లు కొందరు ‘చంద్రబాబూ గోబ్యాక్‌’ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ టీడీపీ ఆఫీసులోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు. టీడీపీ కార్యకర్తలు కూడా వైసీపీ కార్యకర్తలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే టిడ్కో ఇళ్లను పరిశీలించేందుకు వస్తున్నారని ముందే తెలుసుకున్న పాణ్యం వైసీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకుని చంద్రబాబూ గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. ప్రతిగా టీడీపీ కార్యకర్తలు సీఎం జగన్‌ డౌన్‌డౌన్‌ అంటూ నినదించారు.

పది శాతం పనులు చేయలేని దద్దమ్మ

కర్నూలు శివారులో టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పది వేల టిడ్కో ఇళ్లను చంద్రబాబు పరిశీలించారు. వాటిని చూసి ఒకింత ఆవేదనకు లోనయ్యారు. ‘టిడ్కో ఇళ్లు 90 శాతం పూర్తి చేశాను. ఈ మూడున్నరేళ్లలో మిగతా పది శాతం పూర్తి చేసి పేదలకు ఇవ్వలేని చేతగాని దద్దమ్మ ఈ సీఎం. టిడ్కో ఇళ్లు చూస్తుంటే బాధేస్తోంది. తుప్పు పట్టాయి. బూజు పట్టింది. తలుపులు ఊడిపోయాయి. దుర్మార్గంగా.. బాధ్యత లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మన ప్రభుత్వంలో ఇంటికి రూ.3 లక్షలు ఇస్తే.. ఈ జగన్‌ రూ.1.80 లక్షలు ఇస్తున్నాడు. అది కూడా కేంద్రం డబ్బే. భూసేకరణలో కొండలు, చెరువులు తీసుకుని రూ.6 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డాడు’ అని విరుచుకుపడ్డారు. ఈ-తాండ్రపాడులో ఆక్రమణకు గురైన గంగమ్మ చెరువును కూడా ఆయన పరిశీలించారు.

Updated Date - 2022-11-19T04:14:58+05:30 IST

Read more