ఏపీ వైపు మొగ్గు చూపిన కేంద్రం

ABN , First Publish Date - 2022-09-30T01:35:02+05:30 IST

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తలెత్తే పర్యావరణ సమస్యలు.. పొరుగు రాష్ట్రాలు లేవనెత్తుతున్న అభ్యంతరాలపై

ఏపీ వైపు మొగ్గు చూపిన కేంద్రం

ఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తలెత్తే పర్యావరణ సమస్యలు.. పొరుగు రాష్ట్రాలు లేవనెత్తుతున్న అభ్యంతరాలపై పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేకంగా సమావేశమైంది. పోలవరం (Polavaram) వల్ల ఎవరికీ నష్టం రాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని 4 రాష్ట్రాల సీఎస్‌ల సమావేశంలో కేంద్ర జలశక్తి స్పష్టం చేసింది. ఏపీ వైపు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపింది. ఏపీ సీఎస్‌ సమీర్‌ శర్మ ఈ సమావేశంలో ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పొరుగు రాష్ట్రాలతో ఉన్న సమస్యలపై వివరించారు. అయితే పొరుగు రాష్ట్రాల వాదనలను తోసిపుచ్చింది. ముంపు ప్రభావంపై మరోసారి అధ్యయనం చేయాలన్న.. తెలంగాణ వాదనను కేంద్రం పట్టించుకోలేదు. దీనిపై ఇప్పటికే రెండుసార్లు అధ్యయనం చేశామని తెలిపింది. పోలవరం వల్ల భద్రాచలంకు ముంపు ఉండదని కేంద్రం తేల్చిచెప్పింది. పోలవరం బ్యాక్‌వాటర్ ఎఫెక్ట్‌పై థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలని తెలంగాణ డిమాండ్ చేసింది.


ముంపు నివారణ చర్యలు చేపట్టాలని తెలంగాణ (Telangana) నీటి పారుదల శాఖ (Telangana Irrigation Department) కోరింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో అనేక మార్పులు జరిగాయని...  దీనితో ముంపు సమస్య కూడా తీవ్రంగా ఉందని కేంద్రజలశక్తి శాఖకు మూడు రాష్ట్రాలు తెలిపాయి. తమ రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టలేదని ఒడిశా, ఛత్తీస్‌గఢ్ అభ్యంతరం తెలిపాయి. ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించాల్సిందేనని పట్టుబట్టాయి. ఒడిషాలో ముంపు లేకుండా రక్షణ కుడ్య నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చింది. ప్రజాభిప్రాయ సేకరణకు ఒడిషా, ఛత్తీస్‌గఢ్‌లు సహకరించట్లేదని ఏపీ తెలిపింది. అయితే కేంద్ర జలశక్తి సమావేశం అసంపూర్తిగా ముగిసింది. అక్టోబర్ 7న మరోసారి సమావేశం కావాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. 


ఒడిసాలో ముంపు సమస్య లేకుండా ఉండేందుకు కరకట్ట నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు ఒడిసాతో కలిసి ఉమ్మడి సర్వేను నిర్వహించి ముంపు ప్రాంతాల్లో భూసేకరణ చేపట్టేందుకు కూడా సంసిద్ధత వ్యక్తంచేసింది. కానీ దీనిపై ఎన్ని సార్లు లేఖలు రాసినా ఒడిసా నుంచి స్పందన లేదు. అందుచేత ఆ రాష్ట్రంలోని ముంపు ప్రాంతాల సమస్యపై కేంద్రమే చొరవ తీసుకుని ఒక నిర్ణయాన్ని ప్రకటించి ఒప్పించాల్సి ఉంది. ఇప్పటి వరకూ ముంపు సమస్య ఒడిసా నుంచే ఎదురువుతుండగా.. తాజాగా తెలంగాణ నుంచి కూడా అవరోధాలు ఎదురవుతున్నాయి.


పోలవరం నిర్మాణంతో భద్రాచలం మునిగిపోతుందని అంటోంది. జాతీయ హోదా కలిగిన ఈ ప్రాజెక్టుకయ్యే వ్యయమంతంటినీ కేంద్రమే భరించాల్సి ఉంది. కాంక్రీట్‌ నిర్మాణ పనులతో సహా భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల వ్యయం బాధ్యతా కేంద్రానిదే. కానీ భూసేకరణ విషయంలో రాష్ట్రాన్ని తప్పుబడుతూ వస్తోంది. భూసేకరణలో జాప్యం కారణంగా వ్యయాలు విపరీతంగా పెరిగాయని.. సహాయ పునరావాస చెల్లింపుల బాధ్యత తనది కాదని. 2013 భూసేకరణ చట్టం మేరకు చెల్లింపులు జరపాలంటే కష్టమని అంటోంది. ఈ సమస్య వీడని చిక్కుముడిలా మారింది. ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాలకు పరిహారం చెల్లింపులపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ రోజు జరిగిన సమావేశం అసంపూర్తిగా ముగియడంతో ఏపీ ప్రజలు నిరాశ చెందుతున్నారు.

Read more