Shock to Jagan: సీఎం జగన్కు కేంద్ర ఎన్నికల కమిషన్ షాక్

ABN , First Publish Date - 2022-09-22T00:00:56+05:30 IST

సీఎం జగన్ (CM Jagan)కు కేంద్ర ఎన్నికల కమిషన్ షాకిచ్చింది. పార్టీలో శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నిక చెల్లదని సీఈసీ

Shock to Jagan: సీఎం జగన్కు కేంద్ర ఎన్నికల కమిషన్ షాక్

అమరావతి: సీఎం జగన్ (CM Jagan)కు కేంద్ర ఎన్నికల కమిషన్ షాకిచ్చింది. పార్టీలో శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నిక చెల్లదని సీఈసీ (Central Election Commission) స్పష్టం చేసింది. ఏ పార్టీలోనూ శాశ్వత పదవులు అనేవి ఉండకూడదని, అది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొంది. అలాంటి ఎన్నిక.. నియమాలను ఉల్లంఘించినట్లేనని సీఈసీ పేర్కొంది. వైసీపీ (YCP) జనరల్ సెక్రటరీకి కేంద్రం ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా ఇటీవల జరిగిన ఆ పార్టీ ప్లీనరీలో జగన్మోహన్‌రెడ్డిని ఎన్నుకున్నారు. ఈమేరకు ప్లీనరీలో పార్టీ రాజ్యాంగాన్ని సవరించుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మార్గదర్శకాల ప్రకారం.. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ప్రతి రెండేళ్లకోసారి పార్టీ సర్వసభ్య సభను నిర్వహించి ప్రత్యక్ష విధానంలో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలి. శాశ్వత అధ్యక్షుడిగా కొనసాగేందుకు మార్గదర్శకాలు అంగీకరించవు. అయినప్పటికీ జగన్‌ను శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.


ప్రజాప్రాతినిధ్య చట్టం (1951) ఏం చెబుతోందంటే..

ప్రజాస్వామ్య పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా దేశంలో ప్రజాప్రాతినిధ్య చట్టం(1951) తీసుకొచ్చారు. నియంతృత్వ పోకడలకు తావులేకుండా ప్రజాస్వామ్యం పరిఢవిల్లేలా రాజకీయ పార్టీ, దాని ఆఫీస్‌ బేరర్లు (అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి వగైరా) ఉండాలని.. ప్రతి ఐదేళ్లు, అంతకుముందే ఎన్నికల ద్వారా అధ్యక్షుడిని, ఇతర పదాధికారులను ఎన్నుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రవర్తనా నియమావళి స్పష్టం చేస్తోంది. 140 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఇప్పుడు దేశాన్ని ఏలుతున్న బీజేపీ.. రాష్ట్రంలో పాలిస్తున్న వైసీపీ దాకా ఆ నియమావళిని పాటించి తీరాలని అందులోని సెక్షన్‌ 5 చెబుతోంది. రాజకీయ పార్టీలు గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు కూడా కొన్ని అంశాలపై ఈసీ స్పష్టత కోరుతుంది.


13వ ఆప్షన్‌లో రెండో సబ్‌క్లాజు కింద ‘ఆఫీస్‌ బేరర్స్‌ కోసం ఎన్నికలు నిర్వహిస్తుంటారా.. లేదా? పార్టీలో అన్ని పదవులకు ఐదేళ్లకోసారయినా ఎన్నికలు నిర్వహిస్తుందా.. లేదా  ప్రశ్నలకు బదులు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 29 ప్రకారం ఈ నియమావళిని జారీ చేశారు. భారతదేశం అంటేనే ప్రజాస్వామిక, లౌకికవాద దేశమని.. పార్టీలు దానికిలోబడే పనిచేసేలా ఈ చట్టం తీసుకొచ్చారు. పార్టీలు ప్రజాస్వామ్యాన్ని కూలదోస్తూ నియంతృత్వాన్ని పెంచి పోషించకుండా అడ్డుకునేందుకే ఆఫీస్‌ బేరర్లను ఎన్నికల ద్వారా ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నుకోవాలన్న నిబంధన చేర్చారు. అయితే వైసీపీకి జగన్‌ శాశ్వత అధ్యక్షుడంటూ ఆ పార్టీ చేసుకున్న తీర్మానం చట్టబద్ధంగా చెల్లదని విశ్లేషకులు చెప్పారు. ఇప్పుడు  పార్టీలో శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నిక చెల్లదని సీఈసీ స్పష్టం చేసింది.

Updated Date - 2022-09-22T00:00:56+05:30 IST