BRS: బీఆర్‌ఎస్ ప్రకటనపై ఏపీలో సంబరాలు

ABN , First Publish Date - 2022-10-05T22:40:54+05:30 IST

సీఎం కేసీఆర్.. బీఆర్‌ఎస్ పార్టీ ప్రకటనపై ఏపీలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిఫై ఏపీ టీఆర్‌ఎస్ నేతలు కొబ్బరికాయలు కొట్టారు.

BRS: బీఆర్‌ఎస్ ప్రకటనపై ఏపీలో సంబరాలు

విజయవాడ: సీఎం కేసీఆర్.. బీఆర్‌ఎస్ పార్టీ ప్రకటనపై ఏపీలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిఫై ఏపీ టీఆర్‌ఎస్ నేతలు కొబ్బరికాయలు కొట్టారు. ఏపీలో BRS ఆడుగులు పడబోతున్నాయని, రాష్ట్రానికి చెందిన కీలక నేతలు కేసీఆర్‌తో టచ్‌లో ఉన్నారని ఏపీ టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. జాతీయ రాజకీయాల్లో కీలక మార్పు లక్ష్యంగా అడుగులు పడబోతున్నాయని తెలిపారు. తెలుగువాడు ప్రధాని కాబోతున్నారని, ఇది తెలుగువారందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ఆ మధ్య కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వెలివర్రులో ఘనంగా నిర్వహించారు. ఉండి, వెలివర్రుకు చెందిన కేసీఆర్‌ అభిమానులు దండు సుబ్బరాజు ఆయన మిత్రులు భారీ కేక్‌ను తయారు చేయించి కట్‌ చేశారు. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక గ్రీన్‌ లైఫ్‌ నర్సరీలో పూలు, కూరగాయలు, మొక్కలతో కేసీఆర్‌ చిత్రాన్ని తీర్చిదిద్ది వేడుకగా నిర్వహించారు. కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా గుర్తుతెలియని వ్యక్తులు విశాఖలోని ముఖ్యకూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. ‘దేశానికి అవసరమైన జన హృదయనేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ మద్దిలపాలెం, సత్యం జంక్షన్‌, గురుద్వార, స్పెన్సర్స్‌, సిరిపురం జంక్షన్లలో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు.


ఏపీ నుంచి ఆహ్వానం

‘దళిత బంధు’ పథకం చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోనూ టీఆర్‌ఎస్‌ పార్టీ పెట్టాలంటూ అక్కడి నుంచి వేలాది వినతులు వస్తున్నాయని ఈ పార్టీ ప్లీనరీలో కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘సార్‌... మీ పార్టీని ఇక్కడ కూడా ప్రారంభించండి. మిమ్మల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు మీ పథకాలు కావాలి’’ అని ఆంధ్ర ప్రాంతం నుంచి అనేక మంది విజ్ఞప్తి చేస్తున్నారని తెలిపారు. అయితే ఆయన అనుకున్నట్లే బీఆర్‌ఎస్ పార్టీ విస్తరణలో భాగంలో ఏపీలో అడుగుపెట్టాని భావిస్తున్నారు. కొత్త పార్టీలోకి అనేక చేరికలు ఉంటాయని.. టీడీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వస్తారని చెప్పుకొచ్చారు. శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, కడప తదితర జిల్లాలకు చెందిన కొందరు నాయకులు తమతో టచ్‌లో ఉన్నారని టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. వీరిలో కొందరితో కేసీఆరే నేరుగా మాట్లాడారని అంటున్నారు. సమైక్యాంధ్రప్రదేశ్‌ ఉన్నప్పుడు..  టీడీపీలో ఉన్న పలువురు కేసీఆర్‌కే కాకుండా...టీఆర్‌ఎస్‌లోని పలువురికి సన్నిహితంగా ఉన్నవారే. వీరిలో కొందరు బీఆర్‌ఎస్‌ ఏర్పాటుపై సంతోషం వ్యక్తం చేశారని, పార్టీలో చేరి క్రియాశీలంగా ఉండేందుకు ఆసక్తి కనబరిచారని పేర్కొంటున్నారు. ఆంధ్రలోనూ తమ పార్టీ శాఖ ఉంటుందని, క్రమంగా దానిని ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. 


ఇంకోవైపు.. బీఆర్‌ఎస్‌ ఏర్పాటు తర్వాత పలు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణలు మారతాయని కేసీఆర్‌ అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకల్లో రాజకీయ మార్పులు ఉంటాయని భావిస్తున్నారు. జాతీయ పార్టీగా గుర్తింపు పొందేందుకు అవసరమైన ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాలను గెలుచుకోవడం పెద్ద కష్టమేమీ కాదని టీఆర్‌ఎస్‌ నేతలు ధీమా వ్యక్తంచేశారు. అయితే కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో పార్టీని విస్తరించడం వేరు... ఏపీలో విస్తరించడం వేరని అంటున్నారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంతా ఆంధ్ర పాలకులపై ద్వేషంతోనే నడిచింది. విభజన జరిగినా ఇప్పటికీ తెలంగాణతో ఏపీకి అనేక రకాల సమస్యలు ఉన్నాయి. నీటి దగ్గర్నుంచి కరెంట్ బకాయిల వరకూ ఈ సమస్యలు ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్నాయి. రెండు రాష్ట్రాల మధ్య ఇలాంటి వివాదాలు ఇంకా పరిష్కారం కాలేదు. టీఆర్ఎస్ వల్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించారనే అభిప్రాయం ఏపీలో ఉంది. సర్కార్ అన్యాయం చేస్తోందన్న అభిప్రాయం బలంగా ఉన్న సమయంలో ఏపీ నుంచి ఎవరైనా కేసీఆర్‌తో కలుస్తారా లేదా అన్నది అనుమానమే. 

Read more