AMARAVATHI: ఏకపక్షం.. చట్టవిరుద్ధం!

ABN , First Publish Date - 2022-11-08T05:24:00+05:30 IST

రాజధాని అమరావతిలో ఆర్‌ -5 జోన్‌ ఏర్పాటు, సీఆర్‌డీఏ చట్టానికి సవరణలపై రైతులు భగ్గుమన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులను నాశనం చేసేందుకు ఏకపక్ష చర్యలు చేపట్టారని.. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. Capital's farmers are angry over R-5 zone

AMARAVATHI: ఏకపక్షం.. చట్టవిరుద్ధం!

ఆర్‌-5 జోన్‌పై రాజధాని రైతుల ఆగ్రహం

సీఆర్‌డీఏ చట్టాన్ని సవరిస్తారా?

గ్రామసభల్లో అభిప్రాయ సేకరణ లేకుండా స్పెషలాఫీసర్ల ద్వారా తీర్మానాలా?

న్యాయపోరాటం చేస్తామని ప్రకటన

సీఆర్‌డీఏ అధికారులకు అభ్యంతరాల సమర్పణ

విజయవాడ, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో ఆర్‌ -5 జోన్‌ ఏర్పాటు, సీఆర్‌డీఏ చట్టానికి సవరణలపై రైతులు భగ్గుమన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులను నాశనం చేసేందుకు ఏకపక్ష చర్యలు చేపట్టారని.. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. వెనక్కి తగ్గకపోతే న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. సోమవారం మంగళగిరి మండల పరిధిలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు.. తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల రైతులు విజయవాడలోని సీఆర్‌డీఏ కార్యాలయానికి వచ్చి తమ అభ్యంతరాలను సమర్పించారు. పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఈ ఐదు మండలాల్లోని 900.97 ఎకరాల భూములను పేదల ఆవాసాల కోసం ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు చేస్తూ జగన్‌ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసిన సంగతి తెలిసిందే. ఇందుకోసం సీఆర్‌డీఏ చట్టంలో మార్పులు కూడా చేసింది. వీటిపై రైతుల నుంచి అభ్యంతరాలు కోరింది. రాజధాని రైతులు ముక్త కంఠంతో ఆర్‌-5 జోన్‌, సీఆర్‌డీఏ చట్ట సవరణలను వ్యతిరేకించారు. మొత్తం 23 అంశాలతో కూడిన ఎనిమిది పేజీల లేఖలను సీఆర్‌డీఏ అధికారులకు అందజేశారు. స్పెషలాఫీసర్ల ద్వారా తీర్మానాలు చేయించి సీఆర్‌డీఏ చట్టసవరణకు పూనుకోవడం అన్యాయమని అభ్యంతరాల్లో పేర్కొన్నారు.

అమరావతి రాజధాని కోసం తాము భూములిచ్చి ఒప్పందంలో భాగస్వాములుగా ఉన్నామని, తమతో చర్చించకుండా తమ అంగీకారం లేకుండా స్పెషలాఫీసర్లు చట్టసవరణలకు తీర్మానాలు చేయడం పూర్తిగా ఏకపక్షమని, చట్టవిరుద్ధమని తేల్చిచెప్పారు. అక్కడి స్థానిక సంస్థలకు ప్రస్తుతం పాలక వ ర్గాలు లేవని, ఈ దశలో స్పెషలాఫీసర్లు ఆర్‌-5 జోన్‌లో పేదల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఏకపక్షంగా తీర్మానాలు చేయడం తీవ్ర అభ్యంతరకరమన్నారు. గ్రామ పంచాయతీ చట్టాన్ని అనుసరించి ఏ స్పెషలాఫీసర్‌ కూడా గ్రామ సభ నిర్వహించకుండా సుమోటోగా తీసుకుని తీర్మానాలు చేయకూడదని తెలిపారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని, సహజ న్యాయ సూత్రాలను తుంగలో తొక్కినట్లేనని చెప్పారు. ఏపీసీఆర్‌డీఏ చట్టం సెక్షన్‌ 53 (డీ) ప్రకారం బలహీనవర్గాల ఇళ్ల కోసం ఐదు శాతం ప్రాంతాన్ని రాజధానిలో కేటాయించాలని ఉందని.. ఈ నిబంధనల ప్రకారం ఎస్‌-3 జోన్‌లో ఎవరైతే రాజధాని నిర్మాణం కోసం ఇళ్లను కోల్పోతారో వారికే అవి కేటాయించాలని అమరావతి రాజఽధాని నగరం మాస్టర్‌ ప్లాన్‌ 92వ పేజీలో నిర్దేశించారని గుర్తుచేశారు. ఈ నిబంధనలను కాదని సీఆర్‌డీఏ చట్టసవరణలు చేపట్టడం అన్యాయమన్నారు. లేఖలు అందచేసిన అనంతరం రాజధాని రైతులు మీడియాతో మాట్లాడారు. ఆర్‌ -5 జోన్‌ ఏర్పాటుక ప్రభుత్వం దురుద్దేశంతో తీసుకున్న నిర్ణయమని తెలిపారు. రాజధానికి భూములిచ్చిన గ్రామస్థుల అభిప్రాయం తీసుకోకుండానే స్పెషలాఫీసర్ల ద్వారా చట్టాలు మార్చడం అన్యాయమన్నారు. సీఆర్‌డీఏ చట్టం మార్పును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కాదంటే న్యాయపోరాటానికి సిద్ధమవుతామని తేల్చిచెప్పారు.

Updated Date - 2022-11-08T05:24:01+05:30 IST