100 కోట్ల డిమాండ్‌ నోటీసు రద్దు చేయండి

ABN , First Publish Date - 2022-08-25T09:39:27+05:30 IST

100 కోట్ల డిమాండ్‌ నోటీసు రద్దు చేయండి

100 కోట్ల డిమాండ్‌ నోటీసు రద్దు చేయండి

హైకోర్టును ఆశ్రయించిన త్రిశూల్‌ సిమెంట్స్‌

విచారణ 30కి వాయిదా


అమరావతి, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): మైనింగ్‌శాఖ ఇచ్చిన అనుమతులకు మించి లైమ్‌స్టోన్‌ ఖనిజాన్ని తవ్వి, తరలించినందుకుగాను రూ. 100.24 కోట్లు పెనాల్టీ చెల్లించాలంటూ మైనింగ్‌శాఖ 2020 మే7న జారీ చేసిన డిమాండ్‌ నోటీసును సవాల్‌ చేస్తూ త్రిశూల్‌ సిమెంట్స్‌ కంపెనీ అప్పటి మేనేజింగ్‌ పార్ట్నర్‌ షేక్‌ హుసేన్‌ బాషా దాఖలు చేసిన వ్యాజ్యం బుధవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. పిటిషన్‌పై ప్రాథమిక విచారణ జరిపిన న్యాయస్థానం ఇదే వ్యవహారంతో ముడిపడి ఉన్న మరో వ్యాజ్యంతో కలిపి ప్రస్తుత వ్యాజ్యాన్ని ఈ నెల 30న విచారిస్తామని తెలిపింది. ఈ రెండు వ్యాజ్యాలను డివిజన్‌ బెంచ్‌ ముందు ఉంచాలా? లేదా తామే తగిన ఉత్తర్వులు ఇవ్వాలా? అనే విషయంపై ఆ రోజు నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావు బుధవారం ఆదేశాలిచ్చారు. అనంతపురం జిల్లా యాడికి మండలం కొనుప్పలపాడు గ్రామం పరిధిలోని సర్వేనెం. 22/బిలో త్రిసూల్‌ సిమెంట్స్‌కి 1605 ఎకరాల్లో మైనింగ్‌ లీజు మంజూరు చేస్తూ 2006 ఏప్రిల్‌ 25న ప్రభుత్వం జీవో 125 జారీ చేసింది. సిమెంట్‌ కంపెనీ ఏర్పాటు చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా ఖనిజాన్ని తవ్వి తరలించారంటూ మైనింగ్‌ లీజును తర్వాత ప్రభుత్వం రద్దు చేసిం ది. పరిధి దాటి అక్రమంగా లైమ్‌స్టోన్‌ తరలించినందుకుగాను రూ.100.24 కోట్లు పెనాల్టీ చెల్లించాలని 2020 మే 7న మైనింగ్‌ అధికారులు డిమాండ్‌ నోటీసు పంపించారు. ఆ నోటీసును సవాల్‌ చేస్తూ త్రిశూల్‌ సిమెంట్స్‌ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది శివరాజ్‌ శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ.. 2011లోనే రద్దైన త్రిశూల్‌ సిమెంట్స్‌ పేరు మీద డిమాండ్‌ నోటీసు ఇచ్చారన్నారు. అప్పట్లో అధికారుల అనుమతుల మేరకే ఖనిజాన్ని తవ్వామని తెలిపారు. డిమాండ్‌ నోటీసు అమలును నిలుపుదల చేయాలని కోరారు. ఆ తరువాత వ్యాజ్యాన్ని డివిజన్‌ బెంచ్‌ ముందు ఉంచాలా?లేదా అనే విషయంపై నిర్ణయం తీసుకోవాలన్నారు. అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సిమెంట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పి తెల్లరేషన్‌ కార్డు హోల్డర్లు 1605 ఎకరాల్లో లైమ్‌స్టోన్‌ తవ్వకాలకు లీజు పొందారని, వారందరూ జేసీ దివాకర్‌రెడ్డి బినామీలేనని, ఆయన వద్ద సర్వెం ట్లు, కారు డ్రైవర్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. ఫ్యాక్టరీ నిర్మించకుండానే ఖనిజాన్ని తవ్వి వేరేవారికి విక్రయించారన్నారు. 13.91 లక్షల మెట్రిక్‌ టన్నుల ఖనిజాన్ని తవ్వి తరలించినందుకు రూ.100.24 కోట్లు పెనాల్టీ చెల్లించాలని డిమాం డ్‌ నోటీసు ఇచ్చామన్నారు. మరోవైపు త్రిశూల్‌ సిమెంట్స్‌కు 1605 ఎకరాల్లో లైమ్‌స్టోన్‌ మైనింగ్‌ లీజు మంజూరు చేస్తూ 2006లో ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్‌ చేస్తూ 2011లో తాడిపత్రికి చెందిన వి.మురళీ ప్రసాద్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారని ఆయన తరఫు న్యాయవాది పీఎస్‌ రాజశేఖర్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుత పిటిషన్‌లో ప్రతివాదిగా చేర్చాలని అనుబంధ పిటిషన్‌ వేశామన్నారు. సిమెంట్‌ ఫ్యాక్టరీ నిర్మించకుండా ఆ కంపెనీ మైనింగ్‌ చేయడానికి వీల్లేదన్నారు. అందుకు భిన్నంగా ఖనిజాన్ని తవ్వి ఇతర సిమెంట్‌ కంపెనీలకు విక్రయించి ప్రజా సొమ్మును దోచుకున్నారన్నారు. తాము పిల్‌ దాఖలు చేసిన తరువాతే ప్రభుత్వం మైనింగ్‌ లీజును రద్దు చేసిందని తెలిపారు.

Read more