బైజూస్‌.. గోల్‌మాల్‌!

ABN , First Publish Date - 2022-07-13T08:12:48+05:30 IST

బైజూస్‌.. గోల్‌మాల్‌!

బైజూస్‌.. గోల్‌మాల్‌!

పెట్టుబడుల సమీకరణలో అడ్డగోలు పనులు

6 వేల కోట్ల సమీకరణపై గత సెప్టెంబరులో ప్రకటన

అందులో సగం పెట్టుబడులుగా స్వీకరణ 

నేటికీ సంస్థ ఖాతాల్లో కనిపించని సొమ్ము 

వెలుగులోకి తీసుకొచ్చిన మార్నింగ్‌ కాంటెక్ట్స్‌ సంస్థ 

‘ఆకాశ్‌’తో డీల్‌ సెటిలవ్వకపోవడంతో గుట్టు రట్టు 

అంతర్జాతీయ, జాతీయ మీడియాలో రోజంతా వార్తలు

నిధులు విదేశాల్లోనే మళ్లించారేమోనన్న అనుమానం 

ఫేక్‌ పెట్టుబడులు కావొచ్చని సర్వత్రా సందేహాలు 

ఏపీ విద్యార్థులకు ఉచిత ట్యూషన్లపైనా చర్చ 


రాష్ట్ర విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్లు చెప్పడానికి ముందుకొచ్చిన కార్పొరేట్‌ సంస్థ బైజూస్‌ వివాదాల సుడిలో చిక్కుకుంది. నిధుల గోల్‌మాల్‌ వ్యవహారంలో ఇప్పుడు ఈ సంస్థ పేరు జాతీయ, అంతర్జాతీయ మీడియాలో మార్మోగిపోతోంది. రూ.6వేల కోట్ల నిధుల సమీకరణ అంశంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ కంపెనీల నుంచి పెట్టుబడులుగా వచ్చిన వేల కోట్లు సంస్థ ఖాతాల్లో కనిపించడం లేదని వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో నిధుల మళ్లింపు ఏమైనా జరుగుతోందా? లేక ఫేక్‌ పెట్టుబడులను చూపించి మార్కెట్‌లో విలువను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 


(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

విదేశీ కంపెనీల నుంచి నిధులు సమీకరిస్తున్నట్లు బైజూస్‌ కొంతకాలంగా చెబుతోంది. అయితే ఇది నిజమేనా అన్న అనుమానాలు మార్కెట్‌ నిపుణులకు ఉన్నాయి. ఆ సంస్థ చెబుతోన్న దాంట్లో రూ.2,500 కోట్లు కంపెనీ ఖాతాల్లో జమ అయిన దాఖలాలు లేవని, అసలు ఆ నిధులు చేరాయా? లేక దారి మళ్లించారా? అన్న సందేహాలను వ్యక్తం చేస్తూ ‘ది మార్నింగ్‌ కాంటెక్స్ట్‌’ సంస్థ సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ‘విట్రువియన్‌, సుమేరు వెంచర్స్‌, బ్లాక్‌రాక్‌ కంపెనీలు పెట్టుబడి పెట్టాయని బైజూస్‌ చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని కంపెనీ వ్యవహారాల శాఖ వెబ్‌సైట్‌ ప్రకారం విట్రువియన్‌ నుంచి ఈ ఏడాది మార్చి 29న రూ.571 కోట్లు వచ్చాయి. మిగతా రెండు కంపెనీల నుంచి వచ్చిన నిధులు ఖాతాల్లో కనిపించడం లేదు. ఆ నిధులు ఏమయ్యాయి?’ అన్న ప్రశ్నలు ఆ సంస్థ లేవనెత్తింది. ఈ అంశంపై పెట్టుబడి పెట్టిన కంపెనీలు క్రోల్‌ అనే దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాయని, సుమేరు నుంచి బైజూ్‌సకు నిధులు చేరలేదని దర్యాప్తులో తేలినట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే అసలు సుమేరు అనే సంస్థ గురించే తమకు తెలియదని, ఎప్పుడూ, ఎక్కడా ఆ పేరే వినలేదని పారిశ్రామిక దిగ్గజాలు, సంస్థలు చెప్పినట్లు తేల్చి చెప్పింది. ఇప్పుడు తాజాగా మరో వ్యవహారం బయటకొచ్చింది. అమెరికాకు చెందిన అక్షత్‌ క్యాపిటల్‌ పార్టనర్స్‌ సంస్థ బైజూ్‌సలో రూ.1,200 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు గతేడాది సెప్టెంబరులో ప్రకటించింది. అయితే ఈ సొమ్ము కూడా బైజూ్‌సకు రాలేదని మార్నింగ్‌ కాంటెక్ట్స్‌ పేర్కొంది. దీంతో బైజూస్‌ నిధులు, వనరుల సమీకరణ ప్రయత్నాలు వివాదంలో చిక్కుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఆ సంస్థ ఆడిట్‌ రిపోర్ట్‌ ప్రకటించకపోవడమే ఈ గందరగోళానికి, అనుమానాలకు కారణమని మార్నింగ్‌ కాంటెక్ట్స్‌తో పాటు మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. 


మీడియా స్కాన్‌లో బైజూస్‌ 

బైజూస్‌ ఖాతాల్లో నిధులు కనిపించడం లేదంటూ మార్నింగ్‌ కాంటెక్ట్స్‌ వెలువరించిన అంశాలు జాతీయంగా, అంతర్జాతీయంగా చర్చనీయాంశం అయ్యా యి. అంతర్జాతీయ బిజినెస్‌ న్యూస్‌ చానెల్‌ సీఎన్‌బీసీ టీవీ 18 సహా దేశీయ వార్తా పత్రికలు, వెబ్‌ మీడియాలో మంగళవారం రోజంతా బైజూస్‌ ఆర్థిక పరిస్థితిపై కథనాలు ప్రసారమయ్యాయి. 


పదేళ్లలో 11 స్టార్ట్‌పల కొనుగోలు 

ఆన్‌లైన్‌ ట్యూషన్‌ల నిర్వహణ కోసం 2011లో ఏర్పాటైన బైజూస్‌ ఇప్పుడు దేశంలో ప్రధాన ఎడ్‌టెక్‌ కంపెనీగా ఎదిగింది. పదేళ్లలో 11 స్టార్ట్‌పలను కొనుగోలు చేసి దేశంలోనే ప్రముఖ కార్పొరేట్‌ ఆన్‌లైన్‌ ట్యూషన్‌ టీచింగ్‌ సంస్థగా ఎదిగింది. ఇదంతా గతం. ఇప్పుడు ఆ సంస్థను ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. ఫలితంగా బైజూ్‌సతో పాటు తన పరిధిలోని పలు సంస్థల్లో ఉద్యోగాలకు భారీగా కోత పెడుతోంది. మరోవైపు దేశంలో నంబర్‌ 2గా ఉన్న ఆకాశ్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసె్‌సను గతేడాది కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకుంది. దీని విలువ రూ.8వేల కోట్లని అంచనా. దీన్ని సెటిల్‌ చేయడానికి రూ.6వేల కోట్లు ఈక్విటీ కేపిటల్‌ రూపంలో సమీకరిస్తామని బైజూస్‌ ప్రకటించింది. ఇందులో రూ.3వేల కోట్ల నిధులు తానే సమీకరిస్తానని ఆ సంస్థ సీఈవో రవీంద్రన్‌ ప్రకటించారు. అయితే కరోనా ప్రభావం తగ్గి దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌ క్లాసులు, ట్యూషన్లు మూతబడ్డాయి. పాఠశాలలు, కాలేజీలు ఆఫ్‌లైన్‌లో ప్రారంభం కావడంతో బైజూస్‌ ఆన్‌లైన్‌ ట్యూషన్ల సంఖ్య తగ్గింది. కొత్తగా చేరేవారి కన్నా, అప్పటికే ఉన్న చందాదారులు వేగంగా తగ్గిపోయారు. దీని ప్రభావం సంస్థ ఆదాయంపై పడింది. దీంతో ఆకాశ్‌ డీల్‌ పెద్ద సమస్యగా నిలిచింది. సరిగ్గా ఇదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్‌లు చెప్పించేందుకు బైజూ్‌సతో ఏపీ సర్కారు ఒప్పందం చేసుకోవడం చర్చనీయాంశమవుతోంది.

Read more