ఏపీకి బల్క్‌డ్రగ్‌ పార్కు

ABN , First Publish Date - 2022-08-31T08:19:20+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం బల్క్‌డ్రగ్‌ పార్కు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. 2008 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్రానికి బల్క్‌డ్రగ్‌ పార్కు కోసం..

ఏపీకి బల్క్‌డ్రగ్‌ పార్కు

సూత్రప్రాయంగా కేంద్రం అంగీకారం

కాకినాడ సెజ్‌లో ఏర్పాటుకు సన్నాహాలు

అరబిందో ద్వారా రెండేళ్ల కిందట దరఖాస్తు

వైఎస్‌ హయాంలో కాకినాడ సెజ్‌కు భూములు

ప్రమాదరహిత పరిశ్రమలను తెస్తామని హామీ

ఆ హామీపైనే 10 వేల ఎకరాలిచ్చిన రైతులు

ఫార్మా పార్కు కాలుష్యాలపై ఉద్రిక్తతల ముప్పు!


కాకినాడ, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం బల్క్‌డ్రగ్‌ పార్కు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. 2008 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్రానికి బల్క్‌డ్రగ్‌ పార్కు కోసం దరఖాస్తు చేసుకుంది. బల్క్‌డ్రగ్‌ పార్కు మంజూరు చేస్తే కాకినాడ సెజ్‌లో బూములు సిద్ధంగా ఉన్నాయని, ఇక్కడ ఫార్మా పార్కు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి 2020 ఆగస్టులో దరఖాస్తు చేసుకుంది. కాగా దేశం మొత్తం మీద 3 బల్క్‌డ్రగ్‌ పార్కులను కేంద్రం పలు రాష్ట్రాలకు ఇవ్వడానికి ప్రతిపాదించింది. దీనికి అనేక రాష్ట్రాలు పోటీపడ్డాయి ఇప్పుడది ఆంధ్రప్రదేశ్‌కు దక్కింది.


ఫార్మా బల్క్‌డ్రగ్‌ పార్కు రాష్ట్రానికి మంజూరైన నేపథ్యంలో ఫార్మా రంగం అభివృద్ధికి కేంద్రం రూ.1000కోట్ల నిధులు ఇవ్వనుంది. తద్వారా ఫార్మాకంపెనీల స్థాపన, ఫార్మా ఉత్పత్తులు, ఫార్మా పరిశోధనకు తోడ్పాటు అందించనుంది. కాగా ఇప్పుడు కేంద్రం బల్క్‌డ్రగ్‌ పార్కు మంజూరు చేసిన నేపథ్యంలో కాకినాడ సెజ్‌లోని తొండంగి మండలంలో కె.పెరుమాళ్లపురంలో దీన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. బల్క్‌డ్రగ్‌ పార్కు ఏర్పాటుకు కనీసం 2వేలు ఎకరాల భూమి అవసరం. కాకినాడ సెజ్‌ చేతిలో 10వేలు ఎకరాల భూములు ఉన్నాయి.


దాదాపు 20 ఏళ్లు బీడుగానే..

2004లో అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కాకినాడ సెజ్‌ ఏర్పాటుకు అనుమతిచ్చింది. అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అధికారుల ద్వారా ఒత్తిడి తెచ్చి కాకినాడ సెజ్‌ కోసం 10వేలు ఎకరాల వరి భూములును రైతుల నుంచి సేకరించారు. దీనిపై రైతులు కొన్నేళ్లపాటు పోరాటం చేశారు. లాఠీ దెబ్బలు, ఒత్తిళ్లు, బెదిరింపులు భరించి జైళ్లకు కూడా వెళ్లారు. రైతుల ఆందోళనల నేపథ్యంలో సెజ్‌ల కోసం సేకరించిన భూములను వృథా చేయమని, సాధ్యమైనంత తక్కువ సమయంలో చమురు, గ్యాస్‌ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చింది. మార్కెట్‌ ధరకు భూములు కొనుగోలు చేశారు. కొంతమంది రైతులు ప్రభుత్వ వేధింపుల, ఒత్తిళ్లు భరించలేక భూములిచ్చేశారు.


మరోవైపు గడచినా 20ఏళ్లుగా సెజ్‌కు తీసుకున్న భూములు బీడుగానే మిగిలాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్‌ సెజ్‌ భూములపై కన్నేశారు. అనుయాయుల ద్వారా ఫార్మా కంపెనీల ఏర్పాటుకు సిద్ధమయ్యారు. అరబిందో ఫార్మాను రంగంలోకి దించారు. ఎన్నో ఏళ్లుగా జీఎంఆర్‌ చేతిలో ఉన్న సెజ్‌ను ఆ సంస్థపై ఒత్తిడి తెచ్చి అరబిందోకు కట్టబెట్టేలా ఒప్పించారు. అనంతరం బల్క్‌డ్రగ్‌ పార్కుకు అరబిందోతో దరఖాస్తు చేయించారు. ఇప్పుడు రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం బల్క్‌డ్రగ్‌ పార్కును కేటాయించింది. 


విష కాలుష్యాలతో కల్లోలమే!

కాకినాడ సెజ్‌కు 20ఏళ్లు కిందట భూములు సేకరించిన సమయంలో కేవలం చమురు, గ్యాస్‌ ఆధారిత, కాలుష్యం పెద్దగా లేని పరిశ్రమలనే సెజ్‌లో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. దీంతో రైతులు సమ్మతించి భూములిచ్చారు. తీరా ఇప్పుడు ఆ ఆశయానికి గండి కొడుతూ విష వ్యర్థాలు ఉత్పత్తి అయ్యే పదుల సంఖ్యలో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేస్తూ బల్క్‌డ్రగ్‌ పార్కు ద్వారా ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవ్వడం తీవ్రంగా కలవరపరుస్తోంది. ఒకసారి బల్క్‌డ్రగ్‌పార్కులో ఫార్మా ఉత్పత్తులు ప్రారంభమైతే అంతులేని ప్రమాదకర రసాయన కాలుష్యంతో సెజ్‌, చుట్టుపక్కల వందలాది గ్రామాలు విషతుల్యం అవుతాయి. తొండంగి ప్రాంతానికి సమీపంలో దివీస్‌... రూ.1500కోట్లతో అప్పట్లో ఫార్మా కంపెనీలు స్థాపిస్తామని ప్రకటించింది. దీనిపై ఏడాదిన్నరపాటు మత్స్యకారులు దివీస్‌పై తిరగబడ్డారు. ఇప్పుడు ఇదే ప్రాంతానికి కూతవేటు సమీపంలోనే బల్క్‌డ్రగ్‌ ఫార్మా పార్కు వస్తుండటం చర్చనీయాంశమవుతోంది.

Updated Date - 2022-08-31T08:19:20+05:30 IST