పాదయాత్రకు బ్రహ్మరథం

ABN , First Publish Date - 2022-10-08T09:14:43+05:30 IST

పాదయాత్రకు బ్రహ్మరథం

పాదయాత్రకు బ్రహ్మరథం

దారి పొడవునా హారతులు, పూల వర్షం 

అమరావతి రైతులకు వెల్లువెత్తిన మద్దతు 

భారీవర్షంలోనూ సాగిన మహాపాదయాత్ర


భీమవరం, అక్టోబరు 7: అమరావతి రాజధాని సాధన కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో మహిళలు అడుగడుగునా హారతులు, పూల జల్లులతో రైతులకు స్వాగతం పలికారు. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు ఉండి నియోజకవర్గంలోని పెదఅమిరం నుంచి ప్రారంభమైన పాదయాత్ర అక్కడి నుంచి భీమవరం మీదుగా సాగింది. పట్టణంలో ప్రధాని మంత్రి మోదీ ప్రారంభించిన అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహానికి రైతులు నివాళులర్పించారు. భీమవరంలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయగా, రాత్రి వీరవాసరంలో బస చేశారు. 26వ రోజు పెదఅమిరం నుంచి వీరవాసరం వరకు మొత్తం 17 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నిర్వహించిన పాదయాత్రకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం, ఫార్వర్డ్‌ బ్లాక్‌, స్వచ్ఛంద సంఘాలకు చెందినవారు సంఘీభావం తెలిపారు. అనేక గ్రామాల్లో మహిళలు రథంలోని వేంకటేశ్వర స్వామికి పూజలు చేసి, రైతులకు హారతులిచ్చారు. పాలకోడేరు, వీరవాసరం మండలాల్లో వేలాది రూపాయలతో పాటు బియ్యాన్ని విరాళంగా ఇచ్చారు. ఉండి నియోజకవర్గం తరపున సేకరించిన రూ.13.50 లక్షల విరాళాన్ని ఎమ్మెల్యే రామరాజు అందజేశారు. 


పాదయాత్రపైనే నిఘా ఎందుకో: జేఏసీ 

వీరవాసరంలో అమరావతి జేఏసీ నాయకులు గద్దె తిరుపతిరావు, గద్దె శైలజ, కంభంపాటి శిరీష తదితరులు విలేకరులతో మాట్లాడారు. మహాపాదయాత్రపై రోజూ పోలీస్‌ నిఘా పెట్టి ఎవరు వస్తున్నారు, ఏమిస్తున్నారు, ఏం తింటున్నారో కూపీ లాగడం సిగ్గుచేటన్నారు. బొత్స సహా మంత్రులు వారి శాఖలను వదిలేసి తమపైనే విషం కక్కుతున్నారన్నారు. విశాఖపై వారిది కపట ప్రేమని ధ్వజమెత్తారు. 

Read more