రైతుల పాదయాత్రపై బొత్స మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు.. నా వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నా

ABN , First Publish Date - 2022-09-27T01:24:36+05:30 IST

అమరావతి రైతుల పాదయాత్రపై మరోసారి మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) కీలక వ్యాఖ్యలు చేశారు.

రైతుల పాదయాత్రపై బొత్స  మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు.. నా వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నా

హైదరాబాద్: అమరావతి రైతుల పాదయాత్రపై మరోసారి మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల యాత్రను ఆపాలనుకుంటే 5 నిమిషాలు చాలు అన్నానని, తన  వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. అది రైతుల పాదయాత్ర కాదు.. రియల్ ఎస్టేట్ యాత్ర అని దుయ్యబట్టారు. యాత్రను ఎలా ఆపగలమో ముందు ముందు మీరే చూస్తారని తెలిపారు. అమరావతి (Amaravati) రైతులకు ప్రభుత్వం అనేక రకాలుగా మేలు చేసిందని, దానిని త్యాగం అని ఎలా అంటారు? అని బొత్స ప్రశ్నించారు. గత ప్రభుత్వ ఒప్పందాన్ని తామెక్కడా ఉల్లంఘించలేదని, అమరావతికి తాము వ్యతిరేకం కాదని ప్రకటించారు. ముంబైని తలదన్నే రాజధానిగా విశాఖ తయారవుతుందని బొత్స సత్యనారాయణ తెలిపారు. 


రైతుల యాత్రను ఆపాలనుకుంటే 5 నిమిషాలు చాలు

అమరావతి రైతుల పాదయాత్రను ఆపాలనుకుంటే తమకు ఐదు నిమిషాలు చాలని బొత్స సత్యనారాయణ అన్నారు. అది ప్రజాస్వామ్య పద్ధతి కాదన్న ఉద్దేశంతో ఆ పనిచేయడం లేదని చెప్పారు. అమరావతి రైతులు చేస్తున్నది పాదయాత్రా.. రియల్‌ ఎస్టేట్‌ యాత్రా, రాజకీయ యాత్రా అన్నది అర్థం కావడం లేదని ఆయనీ సందర్భంగా అన్నారు. విశాఖను పరిపాలనా రాజధాని చేస్తే చంద్రబాబుకు లేదా అమరావతి రైతులకు కలిగే నష్టమేమిటని ప్రశ్నించారు. ‘రాజధాని కోసం భూములిచ్చి రైతులు త్యాగం చేశారని చెబుతున్నారు. చట్టప్రకారమే అక్కడ భూసమీకరణ జరిగింది. భూములిచ్చిన రైతులతో అప్పటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని మా ప్రభుత్వం కూడా అమలుచేస్తోంది. అంతేకాకుండా కౌలు చెల్లింపు సమయాన్ని సీఎం జగన్‌ ఇంకా పెంచారు. రైతులతో చేసుకున్న ఒప్పందాల్లో అక్కడే రాజధాని నిర్మిస్తామని ఎక్కడా ప్రస్తావించలేదు. ఉంటే చూపించాలి’ అని డిమాండ్‌ చేశారు. కొన్ని మీడియా సంస్థలు ప్రాంతీయ, రాజకీయ విభేదాలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. ‘ఈ ప్రాంతంలో మనుగడ ప్రారంభించి ఎదిగిన మీడియా సంస్థలు ఆ కృతజ్ఞత మరచి పనిచేస్తున్నాయి. తేడావస్తే ఈ ప్రాంతంలో మీ పత్రికలు, టీవీ చానళ్లు ఏవీ ఉండవు’ అని బొత్స హెచ్చరించారు.

Read more