‘బిగ్‌బాస్‌ షో’పై మీ వైఖరేంటి?

ABN , First Publish Date - 2022-10-01T09:18:55+05:30 IST

‘‘బిగ్‌బా్‌సలాంటి షోలను కట్టడి చేసేందుకు చట్టం చేసే ఉద్దేశం ఏమైనా ఉందా? సెన్సార్‌ లేకుండా ప్రసారమవుతున్న ఈ షో విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పండి’’ అని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

‘బిగ్‌బాస్‌ షో’పై మీ వైఖరేంటి?

సెన్సార్‌ లేని షోపై చర్యలు తీసుకోరా?

వీటి కట్టడికి చట్టం చేసే ఉద్దేశముందా?

కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు


అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ‘‘బిగ్‌బా్‌సలాంటి షోలను కట్టడి చేసేందుకు చట్టం చేసే ఉద్దేశం ఏమైనా ఉందా? సెన్సార్‌ లేకుండా ప్రసారమవుతున్న ఈ షో విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పండి’’ అని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బిగ్‌బాస్‌ షోను సవాల్‌ చేస్తూ 2019లో పిల్‌ దాఖలైతే ఇప్పటి వరకు కౌంటర్‌ ఎందుకు దాఖలు చేయలేదని నిలదీసింది. సామాజిక సమస్యలపై స్పందించే ఉద్దేశం మీకు ఉందా? అని ప్రశ్నించింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి, కేంద్ర శిశు సంక్షేమశాఖ కార్యదర్శి, సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ తదితరులకు నోటీసులు జారీ చేసింది. విచారణను అక్టోబరు 11కు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ దుప్పల వెంకటరమణతో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది.


యువతను పెడదారి పట్టించడంతోపాటు అశ్లీలత, హింసాత్మక చర్యలను ప్రోత్సహించేలా ఉన్న బిగ్‌బాస్‌ షో ప్రసారాన్ని నిలుపుదల చేయాలని కోరుతూ సామాజిక కార్యకర్త, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి హైకోర్టులో పిల్‌ వేశారు. ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎలాంటి సెన్సార్‌ లేకుండా బిగ్‌బాస్‌ షోను ప్రసారం చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి షోల విషయంలో ఎలా వ్యవహరించాలో బ్రాడ్‌ కాస్టింగ్‌  మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. షోలో పాల్గొన్న సభ్యుల ప్రవర్తన అభ్యంతరకరంగా ఉందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘గతంలో టీవీల్లో దేశభక్తుల చరిత్రలను ప్రసారం చేసేవారు. ఇప్పుడు ప్రసారమవుతున్న కార్యక్రమాల్లో ఒకటైనా సమాజానికి మంచి సందేశం ఇచ్చేది ఉందా? ఏ కార్యక్రమంలో కూడా క్రియేటివిటీ ఉండడంలేదు’ అని వ్యాఖ్యానించింది. బిగ్‌బా్‌సలాంటి షోలను కట్టడిచేసేందుకు చట్టం తీసుకొచ్చే ఆలోచన ఏమైనా ఉందా? అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.


పాతకాలంలో సినిమాలు సందేశాత్మకంగా ఉండేవని, ప్రస్తుతం సినిమాలో బూతులు, కొట్టుకోవడం, విద్వేషాలు రెచ్చగొట్టుకోవడం తప్ప ఏముందని ప్రశ్నించింది. కుటుంబసభ్యులతో కలిసి కూర్చొని సినిమాలు చూసే పరిస్థితి ఉందా? అని ఆవేదన వ్యక్తం చేసింది. దురదృష్టవశాత్తు చదువులేని వారు చట్టాన్ని గౌరవిస్తున్నారని, ఉన్నత విద్యావంతులు చట్ట ఉల్లంఘనలకు పాల్పడతున్నారని వ్యాఖ్యానించింది. యూరోపియన్‌ దేశాల్లో వ్యవస్థ వ్యక్తులను కంట్రోల్‌ చేస్తుంటే.. మనదేశంలో మాత్రం వ్యక్తులు వ్యవస్థను కంట్రోల్‌ చేస్తున్నారని వ్యాఖ్యానించింది. 

Updated Date - 2022-10-01T09:18:55+05:30 IST