భూయజ్ఞం బద్దలు!

ABN , First Publish Date - 2022-10-08T09:06:51+05:30 IST

భూయజ్ఞం బద్దలు!

భూయజ్ఞం బద్దలు!

బయ్యవరం భూమాయలో బయటపడ్డ రియల్‌ అవతార్‌

అనకాపల్లి సమీపంలో రహస్యంగా సాగిన భూయజ్ఞం

ఒకేచోట.. 500 ఎకరాలు సేకరణ

రైతుల నుంచి బలవంతంగా కొనుగోలు

డీపట్టా, అసైన్డ్‌ భూములూ సొంతం

మడుగులూ, వాగులూ పూడ్చేసి చదును

ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని రోడ్డు

‘ఆంధ్రజ్యోతి’ కథనంతో పెను సంచలనం

నాడు విచారణకు ఆదేశించిన కలెక్టర్‌ 

ఇప్పటికీ బయటపడని నివేదిక

వైసీపీ నేతల ఒత్తిళ్లతో గప్‌చుప్‌

అంతలోనే తెరపైకి రియల్‌ ఎస్టేట్‌ 

మౌంట్‌ విల్లాల పేరుతో భారీగా వ్యాపారం


కొండలను చదును చేసేశారు. రిజర్వాయర్‌లోకి నీరుపోయే వాగులను పూడ్చేశారు. అసైన్డ్‌ భూములను లాగేసుకున్నారు. వందల ఎకరాల్లో పరుచుకున్న పచ్చని చెట్లను తెగనరికేశారు. పర్యావరణం, అడవులు, గనులు.. ఇలా ఎన్నెన్నో అనుమతులు ఉంటేగానీ ముట్టరాని, కొట్టరాని ప్రకృతి సంపదలివి. అయినా...అధికార పార్టీ పెద్దలు ఆదేశించారు.. కొందరు అధికారులు మౌనం పాటించారు. ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లిలోని కశింకోట ప్రాంతంలో 500 ఎకరాల భూమిని భారీ విధ్వంసం సృష్టించి మరీ చదును చేసేశారు. రహస్యంగా సాగిస్తున్న భారీ భూయజ్ఞం ఎందుకు?... ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించింది. అప్పట్లో దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనం సంచలనం సృష్టించింది. కలెక్టర్‌ హడావుడిగా వేసిన కమిటీ ఇచ్చిన నివేదిక ఇంకా వెలుగులోకి రాలేదు. ఇంతలోనే అక్కడ రియల్‌ ఎస్టేట్‌కు భారీఎత్తున తెర లేచింది. ‘మౌంట్‌’ విల్లాల విలాసం మొదలైంది.


విశాఖపట్నం/అనకాపల్లి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధిలోని విస్సన్నపేట పరిసరాల్లో సుమారు 500 ఎకరాల సేకరణకు భారీ విధ్వంసమే సృష్టించారు. ఈ భూమిని చాపచుట్టడానికి అధికార పార్టీ పెద్దలు చేయని అక్రమాలు, పాల్పడని ఉల్లంఘనలు లేవు. ‘ఆంధ్రజ్యోతి’ వీటిని అప్పుడే బయటపెట్టింది. దీనిపై అప్పటి ఉమ్మడి విశాఖ కలెక్టర్‌ వేసిన కమిటీ తన నివేదికను కూడా ఇచ్చింది. ఆ నివేదిక ఏమయిందో తెలియదుగానీ... ఇప్పుడు అక్కడ అధికార పార్టీ పెద్దలు రియల్‌ వ్యాపారానికి తెరతీసేశారు. విల్లాలు వేస్తున్నామంటూ బ్రోచర్లు వేసి ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే...కశింకోట మండలం విస్సన్నపేట, జమాదులపాలెం గ్రామాల సమీపంలో బయ్యవరం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 195-2లో 609.24 ఎకరాల భూములు ఉన్నాయి. వీటిలో 300 ఎకరాల వరకు జిరాయితీ కాగా మరో 200 ఎకరాలు ఇనాం (రైత్వారీ పట్టా తీసుకున్నారు), బంజరు/డి-పట్టా భూములు ఉన్నాయి. జిరాయితీ భూముల్లో రాంబిల్లికి చెందిన కొన్ని భూస్వామ్య కుటుంబాలకు తాత ముత్తాతల నుంచి దఖలు పడినవి ఉన్నాయి. డి-పట్టా భూములు స్థానికుల పేర్లతో ఉన్నాయి. ఈ భూముల కొనుగోలు కోసం అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతలు మరో ప్రజా ప్రతినిధి ద్వారా ఆరంభంలో రైతులతో మాట్లాడించారు. భూములు ఇవ్వబోమని వారు స్పష్టం చేశారు. దీంతో పలు రకాలుగా ఒత్తిళ్లు, బెదిరింపులకు దిగారు. భూములు అమ్మితే తమకే ఇవ్వాలని, ఇతరులకు అమ్మితే వాటికి రిజిస్ట్రేషన్‌ జరగకుండా చేస్తామని భయపెట్టారు. తమ మాట వినని రైతుల భూముల సర్వే నంబర్లను రెవెన్యూ అధికారులకు అందజేసి, వాటిని అనధికారికంగా బ్లాక్‌ లిస్టులో పెట్టించారు. ఇటువంటి భూముల మీద బ్యాంకులు రుణాలు ఇవ్వవు. ఇతరత్రా తనఖాలు కూడా సాధ్యం కాదు. దీంతో చివరకు కొంతమంది రైతులు ‘పెద్దలతో గొడవ ఎందుకు’ అనుకుంటూ మెట్టు దిగి వచ్చారు. అమ్మడానికి అంగీకరించిన వారినుంచి సేల్‌ అగ్రిమెంట్‌ రాయించుకొని అడ్వాన్సుగా కొంతమొత్తాన్ని చేతిలో పెట్టారు. ఈ సేల్‌ అగ్రిమెంట్‌లన్నీ నేరుగా నేతల పేరిట కాకుండా...వారి బంధువులు, మిత్రుల పేర్లతో జరిగాయి. రైతుల నుంచి కొనుగోలు లేదా ముందస్తు ఒప్పందం ద్వారా తీసుకున్న భూములను చదును చేసే క్రమంలో అనేక ఉల్లంఘనలకు పాల్పడ్డారు. దీనిపై గత ఏడాది అక్టోబరు 13న ‘ఆంధ్రజ్యోతి’ ‘గప్‌చు్‌పగా భూయజ్ఞం’ పేరిట ప్రత్యేక కథనం ప్రచురించడంతో అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. 


నాడే నిగ్గుతీసిన కమిటీ...

అనకాపల్లి ఆర్డీవో, సర్వే, గనుల శాఖ ఏడీలు, అనకాపల్లి తహసీల్దార్‌, ఇనామ్‌ తహసీల్దారుతో కూడిన కమిటీ పలు పర్యాయాలు విస్సన్నపేటలో చదునుచేసిన భూములను పరిశీలించి, అనేక అక్రమాలు చోటుచేసుకున్నట్టు గుర్తించింది. వందల ఎకరాలను చదునుచేసే క్రమంలో చెట్లు నరికివేశారు. సహజసిద్ధమైన వాగులు, గెడ్డలను పూడ్చేశారు. అలాగే భూముల చదును సమయంలో కొట్టిన చెట్లు, తవ్విన మట్టి తరలింపునకు పంచాయతీ, రెవెన్యూ అధికారుల నుంచి అనుమతులు తీసుకోలేదు. వాల్టా చట్టాన్ని ఉల్లంఘించారు. ఈ చట్టం ప్రకారం వర్షం నీరు ప్రవహించే వాగులు కప్పకూడదు. ఇటువంటి వాగులు ప్రభుత్వానికి చెందుతాయని చట్టం చెబుతున్నా...అక్కడ సమీపంలో ఉన్న రంగబోలుగెడ్డ రిజర్వాయర్‌కు నీరు వెళ్లే వాగులను కప్పేశారు. ఆ భూములున్న ప్రాంతానికి వెళ్లేందుకు చేపట్టిన రహదారి నిర్మాణంలో ఎన్నెన్నో ఉల్లంఘనలు జరిగినట్టు కమిటీ గుర్తించింది. రోడ్డు కోసం ప్రభుత్వ భూమితోపాటు దళితులకు ఇచ్చిన అసైన్డ్‌ భూములూ ఆక్రమించుకున్నారని, కొండను తవ్వేసి మట్టి, రాళ్లు తరలించారని కమిటీ పరిశీలనలో వెల్లడైనట్టు తెలిసింది. కొండ నుంచి రాయి తవ్వడానికి, తరలింపునకు గనుల శాఖ అనుమతి తీసుకోలేదు. గనుల శాఖ నిబంధనల మేరకు అనుమతి లేకుండా తవ్వకాలు చేపట్టినందుకు, మరోచోటకు తరలించినందుకు భారీ జరిమానా విధించాల్సిన అధికారులు పట్టించుకోలేదని వచ్చిన ఆరోపణలను కమిటీ పరిగణనలోకి తీసుకుంది. విచారణ అనంతరం అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్‌కు కమిటీ తన నివేదిక అందజేసింది. ఈలోగా జిల్లాల విభజన జరగడంతో ఫైళ్లన్నీ అనకాపల్లి  తరలించారు. 


బ్రోచర్ల కలకలం...

అనకాపల్లి ఆర్డీవో సీతారామారావు నేతృత్వంలో విచారణ జరిపి ఇచ్చిన నివేదిక వెలుగు చూడలేదు. అనకాపల్లి జిల్లాకు వచ్చిన అధికారులంతా కొత్తవారు కావడంతో విస్సన్నపేట భూముల అక్రమాలపై విచారణ కమిటీ సమర్పించిన నివేదిక వారి దృష్టికి వెళ్లలేదా?...లేక అక్కడ భూములు చదునుచేసి రియల్‌ వ్యాపారం చేస్తున్న వారిలో అధికార పార్టీకి చెందిన పెద్దలు ఉండడంతో మనకెందుకొచ్చిన గొడవలే అనుకు ని మౌనం దాల్చారా అనేది తెలియదు. ఇదే అదనుగా అక్కడ లేఅవుట్‌ను పూర్తిగా అభివృద్ధి చేసిన పెద్దలు, వీఎంఆర్‌డీఏ అనుమతి కోసం దరఖాస్తు చేశా రు. ఇంకా అనుమతి రావల్సి ఉన్నప్పటికీ వ్యాపారం కోసం బ్రోచర్‌ ముద్రించేశారు. సుమారు 403 ఎకరాల్లో 230 మౌంట్‌ విల్లాలు నిర్మించనున్నట్టు ఆ బ్రోచర్‌లో పేర్కొన్నారు. ఎవరైనా లేఅవుట్‌ వేస్తే సవాలక్ష ప్రశ్నలు అడిగే రెవెన్యూ, పంచాయతీ, గనులు, సర్వే శాఖలు... విస్సన్నపేట భూముల విషయంలో మాత్రం మొద్దునిద్ర పోతు న్నాయి. నీటి మడుగులు, వాగులు, గోర్జీలు కప్పకూడదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో... ప్రభుత్వం 2007లోనే ఒక చట్టం తీసుకువచ్చింది. ఈ విషయం తెలిసినా అనకాపల్లి జిల్లా అధికారులు ఏమీ పట్టనట్టు ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. Read more