బటన్‌ నొక్కి జనమే పంపేస్తారు!

ABN , First Publish Date - 2022-07-22T07:40:48+05:30 IST

అప్పులతో ఆంధ్రప్రదేశ్‌ను మరో శ్రీలంకగా మారుస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు జగన్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. డబ్బులివ్వడానికి..

బటన్‌ నొక్కి జనమే పంపేస్తారు!

బటన్‌ నొక్కి.. జనమే పంపేస్తారు!’

మొండికేస్తే జగన్‌ను బజారుకీడుస్తా

గోదావరి వరద సాయంలో తీవ్ర నిర్లక్ష్యం

జగన్‌ గాల్లో తిరిగి వెళ్లిపోయారు

2 వేలిచ్చి చేతులు దులుపుకొంటారా?

బురద కడుక్కోవడానికి కూడా చాలదు

ప్రతి ఇంటికీ పది వేల పరిహారం ఇవ్వాలి

బాధితులందరికీ పక్కా ఇళ్లు ఇవ్వాలి

వరద ప్రాంత పర్యటనలో బాబు డిమాండ్‌


భీమవరం/అమలాపురం, జూలై 21 (ఆంధ్రజ్యోతి): అప్పులతో ఆంధ్రప్రదేశ్‌ను మరో శ్రీలంకగా మారుస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు జగన్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. డబ్బులివ్వడానికి బటన్‌ నొక్కుతున్నానంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని.. అదే బటన్‌ నొక్కి ప్రజలు ఇంటికి పంపేస్తారని హెచ్చరించారు. గోదావరి వరదలో ప్రజల కష్టాలను చూస్తే బాధేస్తోందన్నారు. వారిని ఆదుకోకుండా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని.. జనాలను బురదలోకి తోసేసి గాలిలో తిరుగుతోందని ధ్వజమెత్తారు. నేరుగా వచ్చి ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి ముఖ్యమంత్రికి, మంత్రులకు తీరిక లేదని ఆక్షేపించారు. పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లోని గోదావరి వరద ప్రాంతాల్లో గురువారం ఆయన పర్యటించారు. ఆచంట మండలం అయోధ్యలంకలో బాధితుల కష్టాలను చూసి చలించిపోయారు. బురదలోనే కూలిన ఇళ్లలోకి వెళ్లి బాధితులను పరామర్శించారు.


కోనసీమలో సోంపల్లి, చాకలిపాలెం జంక్షన్‌, మానేపల్లి, అప్పనపల్లి ప్రాంతాల్లో రాత్రి విస్తృతంగా పర్యటించి బాధితులతో మాట్లాడారు. సభల్లో ప్రసంగించారు. ఆయా సందర్భాల్లో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘వరద వస్తే చెప్పి రాదు. పైనుంచి ఎన్ని నీళ్లు వస్తున్నాయి.. ఎంత ప్రమాదం ఉంటుందో ప్రభుత్వమే అంచనా వేయాలి. పునరావాసం కల్పించాలి. భోజనాలు ఏర్పాటు చేసి పరిహారం ఇవ్వడం బాధ్యత. ఇటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదు. బాధ్యత కలిగిన సీఎం విమానంలో పైపైన తిరిగి వెళ్లిపోయారు. అదే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తిత్లీ, హుద్‌హుద్‌, హరికేన్‌ తుఫాన్లు వచ్చినా తక్షణం స్పందించి సమర్థంగా ఎదుర్కొని ప్రజలను ఆదుకున్నాం. ఇప్పుడు గోదావరి వరదలో ప్రజల ఇబ్బందులను వైసీపీ పట్టించుకోలేదు. ప్రభుత్వం వరద బాధితులకు అరకొర సాయం అందిస్తోంది. పడవలు ఇవ్వలేదు. భోజనం పెట్టలేదు. నాలుగు రోజులు చూశాను. వరద సాయంపై ప్రభుత్వ స్పందన శూన్యం. నేను వస్తున్నానని రూ.2 వేలిచ్చి నాటకమాడుతున్నారు. ఈ మొత్తం ఇంట్లో బురద కడుక్కోవడానికి కూడా సరిపోదు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో న్యాయం చేసేవరకు మళ్లీ మళ్లీ వరద ప్రాంతాల్లో పర్యటిస్తా. జగన్మోహన్‌రెడ్డి మొండికేస్తే బజారుకీడుస్తా’ అని హెచ్చరించారు.


సాయం కింద ప్రతి ఇంటికీ 10 వేలివ్వాలని డిమాండ్‌ చేశారు. ‘పొరుగునే ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కరికీ రూ.10 వేలు ఇస్తోంది. జగన్‌ సర్కారు విలీన గ్రామాల్లో రూ.2 వేలు ఇస్తుంటే అక్కడి ప్రజలు తామీ రాష్ట్రంలో ఉండం.. తెలంగాణలో కలిసిపోతామంటున్నారు. అయినా ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలి’ అని కోరారు. 

పోలవరం పూర్తయి ఉంటే..

ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేసి ఉంటే ఇంత వరద విపత్తు వచ్చి ఉండేది కాదని చంద్రబాబు అన్నారు. ‘టీడీపీ మళ్లీ వచ్చి ఉంటే ఇప్పటికే పోలవరాన్ని పూర్తిచేసి ప్రజలకు ముంపు బాధ లేకుండా చేసేవాడిని. ప్రస్తుతం వచ్చిన వరదల వల్ల దిగువ కాఫర్‌ డ్యాం, డయాఫ్రం వాల్‌ దెబ్బతిన్నాయి. గోదావరి వరదపై జలసంఘం ఎప్పటికప్పుడు రాష్ర్టాలను అప్రమత్తం చేస్తుంది. అయితే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మాత్రం గోదావరి లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయడంలో పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శించింది’ అని ఆరోపించారు.


ఇటీవలి కాలంలో దళితులను ప్రభుత్వం తీవ్రంగా వేధిస్తుందన్నారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ అంటే టీడీపీకి ఎంతో గౌరవమని, ఎన్టీఆర్‌ కాలంలో అంబేడ్కర్‌కు భారతరత్న ప్రకటించిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. బలహీనవర్గాల నేతైనఫూలే ఆశయ సాధనకు టీడీపీ కృషి చేస్తుందన్నారు. 


అయోధ్యలంకకు భరోసా

వరద వల్ల కలిగిన నష్టాలను, వరద మిగిల్చిన కష్టాలను అయోధ్యలంక వాసులంతా చంద్రబాబుకు వినతి పత్రాల రూపంలో వివరించారు. సుదీర్ఘ కాలంగా గోదావరిపై వంతెన నిర్మాణం జరగలేదని వాపోయారు. రాష్ట్రప్రభుత్వం తక్షణం వంతెన నిర్మాణం చేయాలని.. లేదంటే టీడీపీ అధికారంలోకి వచ్చాక నిర్మించి లంక వాసుల కష్టాలను తీరుస్తానని ఆయన హామీ ఇచ్చారు. మురుగు నీరు తాగుతున్నామంటూ ఒక వృద్ధురాలు చంద్రబాబుకు బాటిల్‌ అందించింది. దీనిపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. టీడీపీ వచ్చాక లంక గ్రామాలకు మినరల్‌వాటర్‌ అందిస్తామన్నారు.


అడుగడుగునా ఘనస్వాగతం

వరద ప్రాంతాల్లో పర్యటించేందుకు విజయవాడ నుంచి అయోధ్యలంకకు రోడ్డు మార్గంలో వచ్చిన చంద్రబాబుకు అడుగడుగునా ప్రజలు స్వాగతం పలికారు. ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, తణుకు, సిద్దాంతం ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. సిద్దాంతం నుంచి చినమల్లం, పెదమల్లం మీదుగా చంద్రబాబు పోడూరు చేరుకున్నారు. పోడూరు నుంచి దాదాపు గంటపాటు పడవలో ప్రయాణించారు. ముంపునకు గురైన అయోధ్యలంక ప్రాంతాన్ని సందర్శించారు. మార్గమధ్యంలో చినమల్లం, తడిపూడి తదితర ప్రాంతాల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మంచివారిగా గుర్తింపు పొందిన ఉభయగోదావరి జిల్లాల్లో పులివెందుల రాజకీయాలు చెల్లవని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం వస్తే బదులు తీరుస్తామని హెచ్చరించారు. ఆయా ప్రాంతాల్లో ఆయన వెంట మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, దేవినేని ఉమ తదితరులు పాల్గొన్నారు.

Read more