నేడు గుంటూరులో ‘ఆజాదీ’ సభ

ABN , First Publish Date - 2022-08-15T08:30:57+05:30 IST

నేడు గుంటూరులో ‘ఆజాదీ’ సభ

నేడు గుంటూరులో ‘ఆజాదీ’ సభ

టీడీపీ ఆధ్వర్యంలో అమృత్‌ మహోత్సవ్‌.. చంద్రబాబు హాజరు

గుంటూరు, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లయిన సందర్భంగా నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా తెలుగుదేశం పార్టీ సోమవారం గుంటూరులో భారీ బహిరంగ సభ జరుపనుంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు. చేబ్రోలు హనుమయ్య ప్రాంగణంలో వేదిక ఏర్పాట్లను టీడీపీ ముఖ్య నేతలు పర్యవేక్షిస్తున్నారు. సన్నాహక ఏర్పాట్లలో భాగంగా ఆదివారం సాయంత్రం ఎన్‌సీసీ కేడెట్లతో మాక్‌ డ్రిల్‌, పెరేడ్‌ నిర్వహించారు. ఎమ్మెల్సీలు మంతెన సత్యనారాయణరాజు, అశోక్‌బాబు, మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌, ప్రత్తిపాటి పుల్లారావు, తెలుగుదేశం అమెరికా అధ్యక్షుడు కోమటి జయరామ్‌ దగ్గరుండి పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా పదివేల మందికి పైగా కార్యకర్తలు, అభిమానులు వస్తారని పార్టీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.సోమవారం ఉదయం 8.30కల్లా చంద్రబాబు గుంటూరు చేరుకుంటారు. జూట్‌ మిల్‌ సెంటర్‌ నుంచి స్వామి థియేటర్‌ మీదుగా వేదిక వరకూ సాగే ర్యాలీలో ఆయన జాతీయ పతాకాన్ని చేబూని కార్యకర్తలతో కలిసి నదుస్తారు. కార్యక్రమంలో భాగంగా పతాకావిష్కరణ, జెండా వందనం చేస్తారు. కార్యకర్తల కవాతు, ఎన్‌సీసీ పెరేడ్లు జరుగుతాయి. బహిరంగ సభలో దేశభక్తి గీతాలు, జాతీయ భావాలను పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు, నృత్యరూపకాలు ప్రదర్శించనున్నారు. తర్వాత ప్రజలనుద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తారు. రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పొలిట్‌బ్యూరో సభ్యులు, పార్లమెంటు ఇన్‌చార్జులు, ముఖ్య నేతలు పాల్గొంటారు.

Updated Date - 2022-08-15T08:30:57+05:30 IST