తప్పుడు అప్పులకు అడ్డా!

ABN , First Publish Date - 2022-07-24T07:38:41+05:30 IST

తప్పుడు అప్పులకు అడ్డా!

తప్పుడు అప్పులకు అడ్డా!

అన్ని శాఖలు, కార్పొరేషన్లను ముంచేస్తున్న జగన్‌

దొంగ అప్పుల కోసం రోజుకో ‘మోడల్‌’ రెడీ

ఏపీఎస్ డీసీతో మొదలైన దా‘రుణాలు’

అప్పులు తేవడంలో భారీ క్రియేటివిటీ

ఆర్బీఐ, కేంద్రం తప్పుపట్టగానే కొత్త దారి

చివరికి... సొంత శాఖల సొమ్ములకూ కన్నం


ఒకప్పుడు ‘ఆంధ్రప్రదేశ్‌’ అంటే అన్నపూర్ణ, అభివృద్ధి, అమరావతి! ఇప్పుడు... ఆంధ్రప్రదేశ్‌ అంటే ఆర్థిక అరాచకాలు, అక్రమ మార్గాల్లో అప్పులకు అడ్డా! రాష్ట్రంలోనే కాదు... ఇది జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చ! అప్పులు తెచ్చుకునేందుకు కార్పొరేషన్లను వాడుకుంటున్న వైనం కాగ్‌, ఆర్బీఐతోపాటు కేంద్రాన్నీ కదిలించింది. ఇలా కూడా అప్పులు చేయవచ్చా అని ఇతర రాష్ట్రాలు ఏపీ వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాయి. కేంద్రం పదేపదే ‘శ్రీలంక’ పరిణామాలను గుర్తు చేయడానికి కారణం... అంతులేని దా‘రుణాలే!’


జగన్‌ సర్కార్‌ తన అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రంలోని ప్రతి శాఖనూ, ప్రతి ప్రభుత్వ సంస్థనూ అప్పుల కుప్పగా మార్చేసింది. ఈ అవకతవకల నుంచి జనాల దృష్టి మళ్లించేందుకు ‘బటన్‌ నొక్కుడు’ పేరిట సంక్షేమ పథకాలను ఇప్పుడే కొత్తగా అమలు చేస్తున్నట్లు కథలు చెబుతోంది. ఈ బటన్‌ నొక్కుడులో సగం డబ్బు సామాజిక పెన్షన్లదే. రూ.200గా ఉన్న పెన్షన్లను టీడీపీ ప్రభుత్వం ఒకేసారి రూ.వెయ్యికి పెంచింది. ఆ తర్వాత రూ.2వేలు చేసింది. ఈ మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వం పెంచింది మరో రూ.500 మాత్రమే. ఇక... ఎప్పటి నుంచో అమలవుతున్న పథకాల పేర్లు, అమలు తీరు మార్చేసి వాటికి తన ‘కలర్‌’ వేసుకుంది.


(అమరావతి - ఆంధ్రజ్యోతి) 

రాష్ట్రం అప్పులు చేయడానికి ఒక పద్ధతి ఉంది. సొంత ఆదాయానికి మించకుండా ఖర్చులు ఉండాలి. అభివృద్ధి కార్యక్రమాల కోసం అప్పులు చేయవచ్చు. అది కూడా... రాష్ట్రాల ఆర్థిక వనరులు, తిరిగి చెల్లించగల స్తోమత ఆధారంగా కేంద్రం అనుమతిస్తుంది. కానీ... జగన్‌ ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఖజానాకు వచ్చే ఆదాయం సరిపోవడంలేదు. కేంద్రం ఇచ్చిన అప్పుల పరిమితి కూడా సరిపోవడం లేదు. అందుకే... కేంద్రానికి తెలియకుండా దొంగదారిలో అప్పులు తేవడంపై రాష్ట్రం దృష్టి సారించింది. ఈ విషయంలో ఏకంగా పీహెచ్‌డీ చేసేసింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్‌ (ఏపీఎ్‌సడీసీ) అనే ఒక తప్పుడు మోడల్‌ను సృష్టించింది. కనీసం పైసా కూడా ఆదాయం లేని ఒక కార్పొరేషన్‌ను పేపర్లపై పుట్టించి... మద్యంపై విధించిన అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ పన్నును ఆ కార్పొరేషన్‌కు మళ్లించారు. దానినే కార్పొరేషన్‌ ఆదాయంగా చూపి రూ.23,200 కోట్ల అప్పులు తెచ్చారు.


అదే ‘రహదారి’లో... 

ఏపీఎ్‌సడీసీ మోడల్‌లోనే... ఏపీ రోడ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌(ఏపీఆర్‌డీసీ) ఏర్పాటు చేశారు. ఏపీఎ్‌సడీసీకి విశాఖలోని కలెక్టర్‌ కార్యాలయం, ఎమ్మార్వో కార్యాలయాలు, కాలేజీలు, పార్కులు, ప్రభుత్వ భూములు బదిలీ చేసి వాటిని బ్యాంకులకు తాకట్టు పెట్టినట్లే... ఏపీఆర్‌డీసీకి రోడ్లు, భవనాల శాఖ పరిధిలోని గెస్ట్‌హౌ్‌సలు, స్థలాలు, ఇతర ఆస్తులను బదిలీ చేసి, వాటిని బ్యాంకులకు తాకట్టుపెట్టి సుమారు రూ.7వేల కోట్ల అప్పులు తీసుకొచ్చారు. ఏపీఎ్‌సడీసీ మోడల్‌ తప్పు, రాజ్యాంగ విరుద్ధమని కేంద్రం లేఖ రాయడం, బ్యాంకులు పక్కకు తప్పుకోవడంతో.... ఈసారి బేవరేజెస్‌ కార్పొరేషన్‌ను తెరపైకి తెచ్చారు. ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని రెండు ముక్కలు చేసి... స్పెషల్‌ మార్జిన్‌ పేరుతో బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు ‘లేని ఆదాయాన్ని’ కట్టబెట్టారు. దీనిని హామీగా చూపించి బ్యాంకుల నుంచి రూ.40,000 కోట్ల దొంగ అప్పులు తేవాలని ప్లాన్‌ చేశారు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ద్వారా ఈ అప్పులు తెచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. ఈలోపే కార్పొరేషన్లకు అప్పులిచ్చేముందు 2015 మాస్టర్‌ సర్క్యులర్‌లో నిబంధనలు పాటించాలని ఆర్‌బీఐ మరోసారి ఆదేశించడంతో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వెనక్కి తగ్గింది. ‘అయినా తగ్గేది లేదు’ అంటూ ప్రభుత్వం మరో తప్పుడు మార్గం కనిపెట్టింది. బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు మళ్లించిన వేలకోట్ల ఆదాయాన్ని చూపించి... మార్కెట్లో ఎన్‌సీడీలు (నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌) జారీ చేసి రూ.8,300 కోట్లు అప్పు తెచ్చేసింది. 


మార్క్‌ఫెడ్‌నూ వదలకుండా... 

తప్పుల అప్పు మోడల్‌లోకి జగన్‌ సర్కారు ‘మార్క్‌ఫెడ్‌’ను కూడా దించేసింది. ధాన్యం, చేపలు, రొయ్యలు ఇతర పంటల మార్కెట్‌ ఫీజులు పెంచేసి... అదనంగా వచ్చే ఆదాయాన్ని చూపించి బ్యాంకు నుంచి రూ.1700కోట్లు తేవాలని ప్లాన్‌ చేసింది. నిజానికి... పెంచిన మార్కెట్‌ ఫీజు నిబంధనల ప్రకారం ఖజానాకే చేరాలి. కానీ... కేవలం అప్పులు తెచ్చేందుకు దానిని మార్క్‌ఫెడ్‌కు మళ్లించారు. ఇది కూడా రాజ్యాంగ ఉల్లంఘనే.


సొంత ఇంటికీ కన్నమే... 

కార్పొరేషన్ల ద్వారా బ్యాంకుల నుంచి తప్పుడు అప్పులు చేయడం ఒక ఎత్తు! సొంత ఇంటికీ కన్నం వేసేలా... ప్రభుత్వ సంస్థల డబ్బులు దోచేయడం మరొక ఎత్తు! జగన్‌ సర్కారు ఈ దా‘రుణా’లకూ పాల్పడింది. దీనికోసం ‘ఏపీ స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌’ అనే కొత్త సంస్థను సృష్టించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్పొరేషన్‌... ప్రభుత్వ విభాగాల నుంచే డిపాజిట్లు సేకరించింది. అదికూడా... బలవంతంగా! ప్రభుత్వ శాఖలు, ఇతర కార్పొరేషన్లు, ఇంటర్మీడియట్‌ బోర్డు, హెల్త్‌ యూనివర్సిటీ వంటి సంస్థలు, చివరికి కోర్టుల వద్ద ఉన్న నిధులను ‘డిపాజిట్ల’ పేరుతో ప్రభుత్వం లాక్కుంది. డబ్బులు ఇచ్చేందుకు ఇష్టపడని సంస్థల అధిపతులను సీఎంవో అధికారులు, సీఎస్‌ పరోక్షంగా బెదిరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌’కు డిపాజిట్లు వసూలు చేసే అధికారం లేదు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఆర్బీఐ తప్పుపట్టింది. ప్రశ్నల వర్షం కురిపిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖకు లేఖ రాసింది. దీంతో... ఆ కార్పొరేషన్‌ను పక్కకు పెట్టేసి... ఏపీ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ను తెరపైకి తెచ్చారు. ఇప్పుడు దీని ద్వారా ప్రభుత్వ శాఖల నుంచి డబ్బులు లాక్కునే కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ఈ మోడల్‌లో దాదాపు రూ.10,000 కోట్ల వరకు లాక్కున్నట్టు సమాచారం!


ఇప్పుడిక మారిటైం, ఏపీమెర్క్‌

ఒక దొంగ మోడల్‌ను సృష్టించడం... దానిని ఆర్బీఐ, కేంద్రం తప్పుపట్టగానే మరో కొత్త మోడల్‌ను కనిపెట్టడం! మూడేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కొత్తగా మారిటైం బోర్డు, ఏపీ మెడికల్‌ ఇన్‌ఫ్రా కార్పొరేషన్‌ (ఏపీమెర్క్‌)లను లైన్‌లోకి తెచ్చారు. మెడికల్‌ కాలేజీలు కడతామంటూ ఏపీ మెర్క్‌ ద్వారా, పోర్టుల అభివృద్ధి పేరుతో మారిటైం బోర్డు ద్వారా మళ్లీ బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చేందుకు జగన్‌ సర్కార్‌ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. పోర్టులను దాదాపుగా ప్రైవేటుపరం చేశారు. ఇక వాటి అభివృద్ధి పేరుతో అప్పులు చేయడం ఎందుకో తెలియదు. ఇక... ఏపీ మెర్క్‌ ద్వారా తేవాలనుకుంటున్న అప్పుతో నిజంగా మెడికల్‌ కాలేజీలు కడితే మంచిదే! కానీ... ఇప్పటి వరకు రాష్ట్రంలో కూల్చివేతలే తప్ప కొత్త నిర్మాణాలు ఏవీ లేవు.


గ్యారెంటీలు మరో ఎత్తుగడ

ప్రభుత్వం కార్పొరేషన్లకు గ్యారెంటీలు ఇచ్చి అప్పులు తెచ్చుకుని వాడుకోవడం జగన్‌ ప్రభుత్వం విధానం! అయితే... ప్రభుత్వ గ్యారెంటీలు చూసి కార్పొరేషన్లకు అప్పులివ్వొద్దని అటు కేంద్రం, ఇటు ఆర్‌బీఐ బ్యాంకులను హెచ్చరించడంతో ఆ మోడల్‌కి బ్రేక్‌ పడింది. అందుకే ప్రభుత్వం ఖజానా ఆదాయం మళ్లించే మోడల్స్‌ను తెచ్చారు. గ్యారెంటీ అప్పులు, నాన్‌ గ్యారెంటీ అప్పులు అన్నీ కలిసి రాష్ట్రంలోని కార్పొరేషన్లకు బ్యాంకులు ఇప్పటికే రూ.2.5 లక్షల కోట్లు ఇచ్చాయి. ఇందులో సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌, ఏపీ టిడ్కో, విద్యుత్‌ రంగ సంస్థలు ప్రధానం. సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ నెత్తిన రూ.42,000 కోట్ల అప్పు ఉంది. అలాగే, టిడ్కో పేరుతో కూడా రూ.7,000 కోట్ల వరకు ప్రభుత్వం అప్పు తెచ్చింది. విద్యుత్‌ రంగ సంస్థలది మరో సమస్య. ఆ సంస్థలకు ప్రధాన వినియోగదారు ప్రభుత్వమే. సబ్సిడీ కరెంటు, వ్యవసాయానికి ఉచిత కరెంటు అంటూ ఆ సంస్థలకు ప్రభుత్వం ఏడాదికి దాదాపు రూ.8,000 కోట్ల నుంచి రూ.10,000 కోట్ల వరకు బాకీ పడుతోంది. ఇందులో ఒక్కపైసా కూడా ప్రభుత్వం చెల్లించడం లేదు. ఆ బకాయిలు తీర్చడం కోసం విద్యుత్‌ రంగ సంస్థలు నాన్‌ గ్యారెంటీ అప్పులు చేస్తున్నాయి. ఇందుకోసం వీధుల్లో ఉండే కరెంటు లైన్లు, థర్మల్‌ స్టేషన్లు, సబ్‌ స్టేషన్లు, ప్లాంట్లు, ఇతర ఆస్తులు తనఖా పెట్టి అప్పులు చేస్తున్నాయి. వీటిని చెల్లించే భారం కూడా ప్రభుత్వానిదే.  పైగా ఈ గ్యారంటీ అప్పులను 2020 మార్చి నుంచి ప్రభుత్వం అప్‌డేట్‌ చేయడం లేదు. అమరావతి డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ వ్యవహారమైతే మరీ దారుణం! భూముల తనఖాకు, వేలంలో కొనడానికి ఎవరూ ముందుకురాకపోవడంతో నేరుగా ఆ భూములు అమ్మడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

Read more