ఉమాశంకర్‌ రెడ్డిదే తొలి వేటు!

ABN , First Publish Date - 2022-03-16T08:17:23+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బాబాయ్‌ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి మరిన్ని కీలకమైన వివరాలు బయటికి వచ్చాయి. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన షేక్‌ దస్తగిరి గతనెల 21వ తేదీన కోర్టు ముందు ఇచ్చిన రెండో వాంగ్మూలం ఇప్పుడు వెలుగు చూసింది.

ఉమాశంకర్‌ రెడ్డిదే తొలి వేటు!

బూతులు తిడుతూ.. పిడిగుద్దులు గుద్దుతూ గొడ్డలి వేట్లు

వివేకాను చంపిందిలా.. రెండో వాంగ్మూలంలో దస్తగిరి వెల్లడి

వివేకాను చంపాలని గంగిరెడ్డి చెప్పాడు

‘భయంలేదు.. పెద్దలున్నారు’ అన్నాడు

నేను... సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌ రెడ్డి 

గంగిరెడ్డి ఇంట్లోనే మాట్లాడుకున్నాం

గంగిరెడ్డి చెప్పినట్లుగా చేయాలన్న శంకర్‌ రెడ్డి

ముందుగా కుక్కను చంపిన సునీల్‌, శంకర్‌

వాచ్‌మన్‌ రాజశేఖర్‌ లేని సమయం చూశాం

గోడదూకి వివేకా ఇంటి ఆవరణలోకి వచ్చాం

ముందే అక్కడున్న గంగిరెడ్డి తలుపు తీశాడు

ముందు ముఖంపై సునీల్‌ గట్టిగా కొట్టాడు

గొడ్డలితో తొలి దెబ్బ ఉమాశంకర్‌ రెడ్డిదే

వివేకా ఛాతీపై సునీల్‌ యాదవ్‌ పిడిగుద్దులు 

అంతా మేం చూసుకుంటాం అని భాస్కరరెడ్డి అన్నారు

నా వాంగ్మూలం బయటపడ్డాక బెదిరింపులు: దస్తగిరి 


అమరావతి/కడప, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బాబాయ్‌ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి మరిన్ని కీలకమైన వివరాలు బయటికి వచ్చాయి. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన షేక్‌ దస్తగిరి గతనెల 21వ తేదీన కోర్టు ముందు ఇచ్చిన రెండో వాంగ్మూలం ఇప్పుడు వెలుగు చూసింది. వివేకానంద రెడ్డి వద్ద డ్రైవర్‌గా చేరడం నుంచి ఆయనను హత్య చేసిన తీరు, తర్వాత గంగిరెడ్డి తదితరుల నుంచి వస్తున్న బెదిరింపుల గురించి దస్తగిరి వివరంగా చెప్పారు. దస్తగిరి ఆ వాంగ్మూలంలో చెప్పిన వివరాలు... నా మేనమామ వైఎస్‌ రాజారెడ్డి ఆస్పత్రిలో అంబులెన్స్‌ డ్రైవర్‌గా పని చేసేవాడు. ఆయన ద్వారానే  2016లో వివేకానంద రెడ్డి దగ్గర డ్రైవర్‌గా చేరాను. 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డి ఓడిపోయారు.


రెండు మూడురోజుల తర్వాత వివేకానందరెడ్డి  హైదరాబాద్‌కు వెళ్లి  జగన్‌ను కలిశారు. తిరుగు ప్రయాణంలో రైలు ఎక్కి ముద్దనూరులో దిగి... నాకు ఫోన్‌ చేసి పికప్‌ చేసుకోమన్నారు. నేను పులివెందుల నుంచి ముద్దనూరులో ఆయనను పికప్‌ చేసుకున్నాను. ఆ దారిలో గంగిరెడ్డికి వివేకా ఫోన్‌ చేశారు. తన ఇంటికి రమ్మన్నారు. ఆ తర్వాత గంగిరెడ్డిని తీసుకుని నేను, వివేకానందరెడ్డి కలిసి అవినాశ్‌ రెడ్డి ఇంటికి వెళ్లాం. అక్కడ వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి, అవినాశ్‌ రెడ్డి, శంకర్‌ రెడ్డి ఉన్నారు. వివేకానంద రెడ్డి.. శివశంకర్‌ రెడ్డిని ఉద్దేశించి ‘‘ఓరేయ్‌... నువ్వు మా కుటుంబంలోకి చేరి మోసం చేశావు. మా కుటుంబం నుంచి దూరం చేశావు. నిన్ను వదిలిపెట్టనురా. వీడి మాటలు విని మీరు కూడా నన్ను మోసం చేశారు. మీ అందరి కథ చూస్తా. మీ అంతు తేలుస్తా’’ అన్నారు. అక్కడి నుంచి తిరిగి గంగిరెడ్డిని తీసుకుని పులివెందులలోని తన పర్సనల్‌ ఆఫీసుకు వెళ్లారు. గంగిరెడ్డిని, జగదీశ్వర రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో తిట్టారు. 2017 సంవత్సరం నుంచి ఒక ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌ నిమిత్తం నేను, గంగిరెడ్డి, వివేకానందరెడ్డి తిరుగుతున్నాం. తర్వాత గజ్జల జగదీశ్వర్‌ రెడ్డి తమ్ముడు ఉమాశంకర్‌ రెడ్డి, యాదాటి సునీల్‌ యాదవ్‌ను తీసుకొచ్చి వివేకానంద రెడ్డికి పరిచయం చేశారు. ‘‘మన మనిషే. మీకు పనులు ఏమైనా ఉంటే చేసి పెడతాడు’’ అని చెప్పారు.


2018 నవంబరు నెలలో సెటిల్‌మెంట్‌ పూర్తయింది. రూ.8 కోట్ల నగదు వస్తుందని నిర్ధారించుకుని... నేను, గంగిరెడ్డి, వివేకానంద రెడ్డి బెంగళూరు వెళ్లాం. బెంగళూరులో వివేకానందరెడ్డికి యలహంకలో ఒక గెస్ట్‌ హౌస్‌ ఉంది. ఆ రాత్రి గంగిరెడ్డి, వివేకా మద్యం సేవించారు. సెటిల్‌మెంట్‌లో వచ్చే డబ్బుల్లో సగం వాటా ఇవ్వాలని గంగిరెడ్డి అడిగారు. దీనిపై వివేకాకు కోపం వచ్చింది. ‘నన్ను వాటా అడిగేంత వాడివా’ అంటూ అరిచారు. అప్పటి నుంచి గంగిరెడ్డి, వివేకా మధ్య మాటల్లేవు. 2018 డిసెంబరులో నేను వివేకా వద్ద డ్రైవర్‌గా పని మానేశాను. తర్వాత  నేను ఎర్రగంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌తో మాట్లాడుతూనే ఉన్నారు.

 

హత్యకు కుట్ర ఇలా... 

2019 ఫిబ్రవరి 10వ తేదీన సునీల్‌ యాదవ్‌ నాకు ఫోన్‌ చేసి గంగిరెడ్డి ఇంటికి వెళ్లాలి, పులివెందుల బస్టాండ్‌ వద్దకు రమ్మన్నాడు. నేను అక్కడికి వెళ్లే సరికి... సునీల్‌ యాదవ్‌, ఉమా శంకర రెడ్డి వెయిట్‌ చేస్తున్నారు. అందరం కలిసి గంగిరెడ్డి ఇంటికి వెళ్లాం. అక్కడ గంగిరెడ్డి నన్ను చూసి... ‘‘బెంగళూరు సెటిల్‌మెంట్‌లో వాడు (వివేకా) మనకు డబ్బులు ఇవ్వలేదు. మీకు తెలుసా’’ అన్నాడు. నాకు తెలియదు సార్‌ అని బదులిచ్చాను. అప్పుడు గంగిరెడ్డి... ‘నాకు ఒక పనిచేసి పెడతావా’ అని అడిగాడు. ‘చెప్పండి.. చేస్తాను’ అన్నాను. వివేకానంద రెడ్డిని చంపాలి అన్నాడు. ‘ఆయన వద్ద డ్రైవర్‌గా పని చేశాను. ఆయనను చంపలేను’ అని చెప్పాను. ‘‘నువ్వొక్కడివే కాదు. నీతోపాటు మేమందరం వస్తాము’ అన్నాడు. అయినా నేను చేయలేనని చెప్పాను. అప్పుడు ఎర్ర గంగిరెడ్డి... ‘నువ్వు భయపడాల్సిన అవసరంలేదు. మన వెనుక అవినాశ్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డి, డి.శంకర్‌ రెడ్డి,  మనోహర్‌ రెడ్డి ఉన్నారు. వాళ్లు చూసుకుంటారు’’ అని చెప్పారు. అంతేకాకుండా... శంకర్‌ రెడ్డి మనకు రూ.40 కోట్లు డబ్బులు కూడా ఇస్తారని, అందులో నుంచి రూ.5 కోట్లు ఇస్తానని చెప్పారు. ‘వివేకానంద రెడ్డి దగ్గర పని చేసి ఏం సంపాదించావ్‌! ఈ పని చేస్తే నీలైఫ్‌ సెటిల్‌ అవుతుంది’ అని గంగిరెడ్డి చెప్పారు.  నేను ‘సరేలే సార్‌’ అని చెప్పాను.


కుక్కను చంపి...

‘వివేకానంద రెడ్డి ఇంట్లోకి వెళ్లడానికి ఎలాంటి  అడ్డంకులు ఉన్నాయి? ఏ దారులు ఉన్నాయి చెప్పు?’ అని గంగిరెడ్డి అడిగాడు. వివేకా ఇంటి వద్ద వాచ్‌మన్‌ రాజశేఖర్‌, కుక్క జిమ్మీని దాటుకుంటే ఇంట్లోకి సులువుగా వెళ్లవచ్చునని చెప్పాను. అప్పుడు గంగిరెడ్డి... ‘‘నేను కృష్ణా రెడ్డి (వివేకా పీఏ)తో మాట్లాడి రాజశేఖర్‌ అక్కడ లేకుండా చేస్తాను. కుక్కను మీరు చంపండి’’ అని చెప్పాడు. అప్పుడు అక్కడే ఉన్న సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌ రెడ్డి కుక్కను మేం చంపుతాం... మీరు కృష్ణారెడ్డితో మాట్లాడుకోండి అన్నారు. సరే, మీరు వెళ్లండి, రెండు మూడు రోజుల్లో అడ్వాన్స్‌ పంపిస్తా... అన్నాడు. అక్కడి నుంచి బయటికి వచ్చిన తర్వాత ‘భయం వేస్తోంది’ అని సునీల్‌ యాదవ్‌తో అన్నాను. ‘ఎందుకు భయపడుతున్నావు. మన వెనుక పెద్దవాళ్లు ఉన్నారు. వాళ్లకు లేని భయం మనకెందుకు’ అన్నాడు. రెండు మూడు రోజుల తర్వాత సునీల్‌ యాదవ్‌ నన్ను మా ఇంటి వెనకాల ఉన్న హెలిప్యాడ్‌వద్దకు రమ్మన్నాడు. నల్లరంగు బ్యాగ్‌లో రూ.కోటి డబ్బులు తీసుకొచ్చాడు. అందులో రూ.25 లక్షలు తీసుకున్నాడు. మిగిలిన 75 లక్షలు నేను తీసుకున్నాను. నేను రూ.75 లక్షలు తీసుకుని... పులివెందుల బస్టాండు వద్ద చెప్పుల దుకాణం నడిపే నా స్నేహితుడు మున్నా వద్ద దాచాను. సునీల్‌ యాదవ్‌ తర్వాత నన్ను ఎర్రగంగిరెడ్డి ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి ఫోన్‌లో శివశంకర్‌ రెడ్డితో మాట్లాడారు. ‘గంగిరెడ్డి ఎలా చెబితే అలా చేయండి. మేమున్నాం’ అని శివశంకర్‌ రెడ్డి అన్నారు. 2019 ఫిబ్రవరి నెలలో సునీల్‌ యాదవ్‌, ఉమా శంకర్‌ రెడ్డి, ఇద్దరూ కలిసి వివేకా నంద రెడ్డి ఇంటి దగ్గరి కుక్కను కారుతో (హోండా అమేజ్‌) తొక్కించి చంపించారు.

 

వాచ్‌మన్‌ను కాణిపాకం వెళ్లాడని...

వివేకా ఇంటి నైట్‌వాచ్‌మన్‌ రాజశేఖర్‌ 2019 మార్చి 13, 14, 15 తేదీల్లో కాణిపాకం వెళ్తున్నట్లు పీఏ కృష్ణారెడ్డి ద్వారా తెలిసింది.  వివేకా హత్యకు ఆ మూడు రోజుల్లో ప్లాన్‌ చేయవచ్చునని గంగిరెడ్డి తెలిపారు. ఆ తర్వాత... శివప్రకాశ్‌ రెడ్డి మనవరాలి బర్త్‌డే కోసం మార్చి 14న హైదరాబాద్‌ వెళ్లాలని వివేకా అనుకున్నారు. అయితే... అదే రోజున పని ఉందని గంగిరెడ్డి చెప్పడంతో... ఫ్లైట్‌ టికెట్‌ను వివేకా క్యాన్సిల్‌ చేసుకున్నారు. 


ఇంట్లోకి వెళ్లిందిలా...

2019 మార్చి 14వ తేదీనే వివేకాను హత్య చేయాలని నిర్ణయించుకున్నాం. ఆ రోజు మధ్యాహ్నం సునీల్‌ యాదవ్‌ ఫోన్‌ చేసి... ఒక గొడ్డలి కొనుక్కోమన్నాడు. పులివెందులలో తీసుకుంటా అంటే, వద్దు... కదిరికి వెళ్లి తీసుకోమన్నాడు. నేను కదిరికి వెళ్లి గొడ్డలి కొన్నాను.  రాత్రి 9 - 9.30 గంటల సమయంలో వివేకా ఇంటి సమీపంలో ఎప్పుడూ కలిసే చోటు (మద్యం తాగే స్థలం)కు రమ్మన్నాడు. అక్కడికి నేను గొడ్డలి తీసుకుని వెళ్లాను. నేను, సునీల్‌ యాదవ్‌ మద్యం సేవిస్తూ కూర్చున్నాం. రాత్రి 11.45 గంటలకు వివేకా కారు ఆయన ఇంటిలోకి వెళ్లింది. తర్వాత సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌ రెడ్డికి ఫోన్‌ చేశాం. ఉమా శంకర్‌ రెడ్డి ఎర్ర గంగిరెడ్డిని పికప్‌ చేసుకుని.. వివేకా ఇంటివద్ద వదిలిపెట్టాడు. ఆ తర్వాత అతను మా వద్దకు వచ్చారు. మేం ముగ్గురం రాత్రి 1.30 దాకా మద్యం తాగుతూ ఉన్నాం. అక్కడి నుంచి ఉమా శంకర్‌ రెడ్డి వేసుకువచ్చిన పల్సర్‌ బైక్‌ పైన నేను, సునీల్‌ యాదవ్‌, ఉమా శంకర్‌ రెడ్డి ముగ్గురం వివేకా ఇంటి వెనుక వైపు వెళ్లి... కాంపౌండ్‌ దాటి లోపలికి వెళ్లాం. మేమందరం సైడ్‌ డోర్‌ తట్టాం. లోపలే ఉన్న గంగిరెడ్డి తలుపు తీశాడు. మేమందరం లోపలికి వెళ్లాం. నా దగ్గరున్న గొడ్డలిని కిటికీ కర్టెన్‌ వెనుక దాచేసి, తలుపు గడియ  పెట్టాను. 


తెల్లవారిన తర్వాత... 

తెల్లవారుజామున 5.20 గంటలకు... సునీల్‌ యాదవ్‌ నాకు ఫోన్‌ చేసి... నన్ను రోడ్డుమీదికి రమ్మన్నాడు. ఎర్రగంగిరెడ్డి ఇంటికి పోవాలని చెప్పాడు. అందరం ఎర్రగంగిరెడ్డి ఇంటికి వెళ్లాం. ‘మీరేం టెన్షన్‌ పడొద్దు. నేను అవినాశ్‌ రెడ్డితో, డి.శివశంకర్‌ రెడ్డితో మాట్లాడాను. అంతా వాళ్లు చూసుకుంటారు. అక్కడికి నేను కూడా వెళ్తున్నాను. మేనేజ్‌ చేస్తాను. మీ బ్యాలెన్స్‌ అమౌంట్‌ సాయంత్రంకానీ, రేపు ఉదయం కానీ సెటిల్‌ చేస్తాను’’ అని చెప్పాడు. 15.3.2019 సాయంత్రం గంగిరెడ్డిని, సునీల్‌ యాదవ్‌ను, ఉమా శంకర్‌ రెడ్డిని పోలీసులు విచారణ నిమిత్తం కడపకు తీసుకెళ్లారు. మరుసటి రోజున నన్ను కూడా తీసుకెళ్లారు. ‘నేను నిజం చెబుతాను. నన్ను చిత్ర హింసలు పెడుతున్నారు’ అని గంగిరెడ్డికి చెప్పాను. ‘నిజం చెప్పవద్దు. అక్కడ సాక్ష్యాలు లేకుండా తుడిచేశారు. కావాలంటే నువ్వు బయటికి వెళ్లిన తర్వాత ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తాను. లైఫ్‌ సెటిల్‌ చేస్తాను’ అని చెప్పాడు. తర్వాత ఎర్ర గంగిరెడ్డి జైలుకు వెళ్లాడు. తర్వాత... ఈ హత్య కేసును సీబీఐకి అప్పగించారు. నేను, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌ రెడ్డి అందరం ఈశ్వరయ్య తోటలో వైఎస్‌ భాస్కర్‌ రెడ్డిని, శివశంకర్‌ రెడ్డిని కలిసి... మా పరిస్థితి ఏమిటి, సీబీఐకి కేసు అప్పగించారుకదా అని అడిగాము. ‘మేం చూసుకుంటాం లే. ఇబ్బంది లేదు’ అని చెప్పారు. తర్వాత సీబీఐ వాళ్లు నన్ను 2020 మార్చి 3న ఢిల్లీకి రావాలన్నారు. ఢిల్లీకి నాతోపాటు భరత్‌యాదవ్‌ను కూడా పంపించారు. భరత్‌ యాదవ్‌ నాలుగైదు రోజులు మాత్రమే ఢిల్లీలో ఉండి... సీబీఐ వాళ్లకు అనుమానం వస్తుందని పులివెందులకు వచ్చేశాడు.


వాంగ్మూలం బయటపడిందిలా... 

నేను ఢిల్లీలో రెండున్నర నెలలు సీబీఐ విచారణలో ఉన్నాను. కానీ... అక్కడ నిజం చెప్పలేదు. తర్వాత పులివెందులకు వచ్చాను. అప్పుడు భరత్‌ యాదవ్‌ బయ్యపురెడ్డితో కలిసి వచ్చి... ఢిల్లీలో సీబీఐకి ఏం చెప్పావని నన్ను అడిగారు. ఏమీ చెప్పలేదని అన్నాను. తర్వాత... సీబీఐ వారు కడపకు వచ్చి విచారణ మొదలుపెట్టారు. కొన్ని రోజుల తర్వాత సీబీఐకి నిజం చెప్పాను. నన్ను జడ్జి ముందుకు తీసుకెళ్లారు. అక్కడ నేను ‘కన్ఫెషన్‌’ వాంగ్మూలం ఇచ్చాను. కానీ... సీబీఐకి, జడ్జికి ఏమీ చెప్పలేదని గంగిరెడ్డి వాళ్లకు అబద్ధం చెప్పాను. 


తర్వాత పులివెందులలో సునీల్‌యాదవ్‌, ఉమాశంకర్‌ రెడ్డి తరఫున లాయర్లు నా వాంగ్మూలం ప్రతులు కావాలని కోర్టు ద్వారా అడిగి తీసుకున్నారు. వాటిని బయటపెట్టారు. ‘నువ్వు చేసింది తప్పు. వాళ్లమీద చెప్పి చాలా తప్పు చేశావు. వాళ్లు నిన్ను వదిలిపెట్టరు. చంపుతారు. ఇప్పటికైనా మించి పోయిందేమీ లేదు. ఒక ప్రెస్‌ మీట్‌ పెట్టి... నేను ఇచ్చిన వాంగ్మూలం అబద్ధం అని భరత్‌ యాదవ్‌ చెప్పమన్నాడు. డబ్బులు కావాలంటే ఇస్తానన్నాడు. ఇప్పటికీ నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నారు.


ఒక్కో వేటు ఇలా వేశాం..

వివేకా హాలులో ఉన్న సోఫాసెట్‌లో కూర్చున్నారు. ‘వీళ్లు ఈ టైమ్‌లో వచ్చారేంటి’ అని అన్నారు. ‘డబ్బులు సెటిల్‌మెంట్‌ గురించి’ అని గంగిరెడ్డి చెప్పాడు. అప్పుడు వివేకా మాతో మాట్లాడుతూ బెడ్‌రూమ్‌లోకి వెళ్లారు. మేం కూడా (నేను, గంగిరెడ్డి, ఉమాశంకర్‌ రెడ్డి, సునీల్‌ యాదవ్‌) లోపలికి వెళ్లాం. ‘‘ఎన్నిసార్లు చెప్పినా సెటిల్‌మెంట్‌ డబ్బులు అడుగుతావేంటి. ఎంపీ ఎన్నికలు వస్తాయి. ఆ తర్వాత ఇస్తాను’’ అన్నారు. కాదు, ఇప్పుడే కావాలని గంగిరెడ్డి అన్నారు. పక్కనే ఉన్న ఉమాశంకర్‌ రెడ్డి ‘‘నువ్వు మాకు ఏమీ చేయలేదురా! మేం డబ్బులు వదిలిపెట్టేది ఏంట్రా’’ అని వివేకాను బూతులు తిట్టారు. ‘‘ఏంట్రా నన్ను బూతులు తిడుతున్నావ్‌’ అని వివేకా పైకి లేవబోయారు. అప్పుడు... సునీల్‌ యాదవ్‌ ‘‘నీతో ఏంట్రా మాట్లాడేది లం.. కొడకా!’’ అంటూ తన కుడిచేతితో వివేకానంద రెడ్డి ముఖంపైన గట్టిగా కొట్టాడు. ఆయన వెనక్కి పడిపోయారు. ఉమాశంకర్‌ రెడ్డి నాతో.. ‘పోరా, గొడ్డలి తీసుకురా’ అని అన్నాడు. నేను కర్టన్‌ వెనుక దాచిన గొడ్డలిని ఉమాశంకర్‌ రెడ్డికి ఇచ్చాను. ఉమాశంకర్‌ రెడ్డి గొడ్డలితో వివేకా తలపై వేటు వేశాడు. ఆయన ‘అమ్మా’ అని అరిచాడు. కుడివైపు తిరిగి పైకి లేస్తుండగా, ఉమా శంకర్‌ రెడ్డి గొడ్డలితో తలు వెనుక భాగాన మళ్లీ కొట్టారు. వివేకా కిందపడిపోయి... అమ్మా అమ్మా అని అరుస్తున్నాడు. అప్పుడు సునీల్‌ యాదవ్‌ వివేకా ఛాతీ మీద 15 నుంచి 16సార్లు గట్టిగా పిడిగుద్దులు గుద్దాడు. తర్వాత ఉమాశంకర్‌ రెడ్డి నా చేతికి గొడ్డలి ఇచ్చి, ‘వీడు లేవకుండా చూసుకో. మేం ఈలోపల డాక్యుమెంట్‌ (ఏదో ల్యాండ్‌కు సంబంధించి) వెతుకుతాం’ అని చెప్పారు. వివేకా తన కుడిచేయి పైకి లేపి... ‘ఏంట్రా... నా ఇంట్లో వెతుకుతున్నారు’ అని అన్నారు. నేను గొడ్డలితో కుడిచేయి మీద వేటు వేయగా... ఆయన అరచేయి కోసుకుపోయింది. ఆయన గట్టిగా అరవడం ప్రారంభించాడు. అప్పుడు ఎర్ర గంగిరెడ్డి ‘ఈ నా కొడుకుతో ఒక లెటర్‌ రాయించండి’ అన్నాడు. అప్పుడు నేను, సునీల్‌ యాదవ్‌ వివేకా చొక్కా పట్టుకుని ఈడ్చుకుని వచ్చి... కప్‌బోర్డ్‌ దగ్గర మోకాళ్ల మీద కూర్చోబెట్టి... తన పెన్నుతో లెటర్‌ రాయమన్నాం. ఆయన రాయను అన్నాడు. నలుగురం బాగా కొట్టాం. ‘‘లం... కొడకా! నువ్వు రాస్తే వదిలేస్తాం. రాయకపోతే చంపేస్తాం’’ అని హెచ్చరించాడు. ‘‘నా డ్రైవర్‌ను నేను త్వరగా డ్యూటీకి రమ్మన్నానని నన్ను చంపబోయాడు. డ్రైవర్‌ ప్రసాద్‌ను వదిలిపెట్టవద్దు. ఇట్లు... వివేకానందరెడ్డి’’ అని రాయించాం. ఆ తర్వాత వివేకానంద రెడ్డిని బాత్‌రూమ్‌లోకి ఈడ్చుకుని వెళ్లి చంపుదామని గంగిరెడ్డి చెప్పాడు.  మేం నలుగురం వివేకాను లాక్కెళ్లి బాత్‌రూమ్‌లో పడేశాం. వివేకా తలపై గొడ్డలితో ఉమాశంకర్‌ రెడ్డి ఐదారువేట్లు బలంగా వేశాడు.


సునీల్‌ యాదవ్‌... వివేకా మర్మాంగం మీద బలంగా తన్నాడు. అక్కడే వివేకా ప్రాణం పోయింది. ఎర్ర గంగిరెడ్డి పంచెకు అయిన రక్తపు మరకలు అక్కడే కడుక్కున్నారు. డాక్యుమెంట్‌ తీసుకున్న తర్వాత బీరువాను గొడ్డలితో పగలగొట్టాలని చూశాడు. అది తెరుచుకోలేదు. శబ్ధం వస్తుందని ఆ పని మానుకుని... లైట్లు ఆర్పేసి, ఫ్రంట్‌ డోర్‌ ఓపెన్‌ చేసి, ముందుగా గంగిరెడ్డి బయటికి పోయాడు. తర్వాత మేం ముగ్గురం వచ్చాం. అప్పుడు రంగన్న గంగిరెడ్డిని చూసి... ‘ఎవరు ఎవరు’ అని గట్టిగా అరిచాడు. మాకు భయం వేసింది. నేను, సునీల్‌ యాదవ్‌ గోడదూకి, బైక్‌మీద పారిపోయాము. హత్యకు వాడిన గొడ్డలిని సునీల్‌ యాదవ్‌కు ఇచ్చాను. వైఎస్‌ రాజారెడ్డి ఆస్పత్రి బాత్‌రూమ్‌లో కాళ్లు, ముఖంపై రక్తపు మరకలు కడుక్కున్నాను.

Read more