ఏసీబీ వలలో అరకులోయ ఆర్‌ఐ

ABN , First Publish Date - 2022-09-10T08:58:17+05:30 IST

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ తహసీల్దార్‌ కార్యాలయంలో ఆర్‌ఐ-1గా పనిచేస్తున్న మజ్జి అర్జున్‌ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు శుక్రవారం పట్టుబడ్డాడు.

ఏసీబీ వలలో అరకులోయ ఆర్‌ఐ

సర్వే రిపోర్టు కోసం లంచం తీసుకుంటుండగా పట్టివేత

అరకులోయ, సెప్టెంబరు 9: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ తహసీల్దార్‌ కార్యాలయంలో ఆర్‌ఐ-1గా పనిచేస్తున్న మజ్జి అర్జున్‌ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు శుక్రవారం పట్టుబడ్డాడు. ఏసీబీ ఇన్‌చార్జి డీఎస్పీ బీవీవీఎస్‌ రమణమూర్తి కథనం ప్రకారం... అరకులోయ మండలం పెదలబుడు పంచాయతీ పానిరంగిని గ్రామానికి చెందిన కిల్లో రామచందర్‌కు అరకులోయ నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రధాన రహదారి పక్కన కొంత భూమి ఉంది. జాతీయ రహదారి (516ఈ) నిర్మాణం కోసం ఈ భూమిలో 25 సెంట్లను రెవెన్యూ అధికారులు సేకరించారు. ఆ భూమికి సంబంధించి నష్టపరిహారం పొందేందుకు రామచందర్‌ వారం క్రితం అర్జున్‌ను సర్వే రిపోర్టు అడిగారు. అందుకు రూ.50 వేలు లంచంగా ఇవ్వాలని ఆర్‌ఐ డిమాండ్‌ చేశాడు. అడ్వాన్సుగా రూ.10 వేలు తీసుకుని, మిగిలిన నగదు శుక్రవారం (9వ తేదీ) ఇవ్వాలని చెప్పాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేని రామచందర్‌, అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రతించారు. ప్రణాళిక మేరకు ఏసీబీ అధికారులు రామచందర్‌తో అర్జున్‌కు ఫోన్‌ చేయించారు. అర్జున్‌ రూ.35 వేలు తీసుకుంటుండగా.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

Read more