మద్యం ధర తగ్గిస్తే సారా మానేస్తా!

ABN , First Publish Date - 2022-04-24T09:00:31+05:30 IST

‘రూ.100 ఇస్తే నాలుగు సారా ప్యాకెట్లు వస్తాయి. రూ.200 పెట్టినా రాని కిక్కు ఇందులో ఉంటుంది.

మద్యం ధర తగ్గిస్తే సారా మానేస్తా!

సారాతో రూ.100కే కిక్కు

అది రూ.200 పెట్టి మద్యం కొన్నా రాదు

అందుకే సారాకు అలవాటు పడిపోయా!

‘పరివర్తన్‌’ కార్యక్రమంలో ఎస్పీతో ఓ మద్యం ప్రియుడి గోడు


పలాస, ఏప్రిల్‌ 23: ‘రూ.100 ఇస్తే నాలుగు సారా ప్యాకెట్లు వస్తాయి. రూ.200 పెట్టినా రాని కిక్కు ఇందులో ఉంటుంది. ప్రభుత్వం మద్యం ధరలు తగ్గిస్తేనే సారా మానేస్తా’.. ఓ మందు ప్రియుడు శ్రీకుకాళం ఎస్పీకి చెప్పిన మాటిది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్టేషన్‌ ఆవరణలో శనివారం పరివర్తన-2.0 కార్యక్రమం నిర్వహించారు. చెడు వ్యవసనాలకు బానిసై సమాజంలో చులకన కావొద్దని, సారా అమ్మకాలు, తాగడం మానేస్తే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎస్పీ రాధిక చెప్పారు. ఇంతలోనే టెక్కలి సబ్‌ డివిజన్‌కు చెందిన ఓ మద్యం ప్రియుడు అక్కడికి వచ్చాడు. ‘సారా తాగకపోతే ఉండలేనని, కనీసం మలమూత్ర విసర్జన కూడా కష్టమని, ప్రభుత్వ మద్యం తాగాలంటే రూ.200 పెట్టనిదే రావడం లేదని, ఇలాంటప్పుడు ఏం చేయాలని?’ ఎస్పీని ప్రశ్నించాడు. సారా తాగడం నేరమని తెలియదా అని, దీనివల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని ఎస్పీ చెబుతున్నా.. అతడు వినిపించుకోలేదు. ప్రభుత్వం మద్యం ధర తగ్గిస్తేనే సారా మానేస్తా అని తెగేసి చెప్పాడు. దీంతో ఏం చెప్పాలో తెలియని ఎస్పీ.. సారా వల్ల కలిగే అనర్థాలు చెప్పే ప్రయత్నం చేశారు. అయినా మద్యం ప్రియుడు తన ప్రశ్నలు కొనసాగించాడు. కుటుంబ సంక్షేమం కోసమైనా సారా మానాలని, మత్తు కావాలో, డెత్‌ కావాలో తేల్చుకోమని అతనికి ఎస్పీ సూచించారు. మద్యం రేట్లు పెరగడం వల్లే సారాకు అలవాటు పడ్డానని అతడు విలేకరుల వద్ద చెప్పాడు.

Updated Date - 2022-04-24T09:00:31+05:30 IST