తనిఖీలపై మాకు అభ్యంతరం లేదు

ABN , First Publish Date - 2022-03-08T08:56:07+05:30 IST

తమ పరిశ్రమలో తనిఖీలకు సంబంధించి ఎలాంటి అభ్యంతరం లేదని అమర్‌ రాజా పరిశ్రమ యజమాన్యం హైకోర్టుకు నివేదించింది. అయితే తనిఖీల కోసం కేంద్ర, రాష్ట్ర...

తనిఖీలపై మాకు అభ్యంతరం లేదు

 నిపుణుల నేతృత్వంలో కమిటీ వేయండి

 హైకోర్టుకు నివేదించిన ‘అమర్‌ రాజా’

అమరావతి, మార్చి 7(ఆంధ్రజ్యోతి): తమ పరిశ్రమలో తనిఖీలకు సంబంధించి ఎలాంటి అభ్యంతరం లేదని అమర్‌ రాజా పరిశ్రమ యజమాన్యం హైకోర్టుకు నివేదించింది. అయితే తనిఖీల కోసం కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు, ఎన్విరాన్మెంట్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(నీరి) నిపుణులతో సంయుక్తంగా కమిటీని ఏర్పాటు చేయాలని కోరింది. పరిశ్రమలో కాలుష్య నియంత్రణ విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్నామని పేర్కొం ది. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. పీసీబీ అభిప్రాయం తెలుసుకొనేందుకు విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది. పరిశ్రమ మూసివేతకు పీసీబీ ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను మరో రెండు వారాలకు పొడిగించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలిచ్చింది. పరిశ్రమను మూసివేయాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ అమర్‌ రాజా బ్యాటరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ నాగుల గోపినాథ్‌రావు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు వచ్చింది. అమర్‌రాజా తరఫున సీనియర్‌ న్యాయవాది బి. ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. ఉద్యోగుల రక్తంలో లెడ్‌ శాతం పరిమితులకు లోబడే ఉందని నివేదికల్లో తేలిందన్నారు. నివేదికలను కోర్టు ముందు ఉంచకుండా పీసీబీ జాప్యం చేసిందన్నారు. కంపెనీ వ్యవస్థాపక యజమాని కూడా పరిశ్రమ ప్రాంగణంలోనే నివాసం ఉంటున్నారన్నారు.   నిబంధనలు పాటిస్తున్నామని పరిశ్రమ, పాటించడంలేదని ఏపీపీసీబీ పరస్పర విరుద్ధమైన వాదనలు లేవనెత్తుతున్నాయని తెలిపారు. పరిశ్రమలో తనిఖీల నిమిత్తం సంయుక్త కమిటీ ఏర్పాటు చేయాలన్నారు.  పీసీబీ తరఫు ప్రభుత్వ న్యాయవాది సురేందర్‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కమిటీకి విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వం వహిస్తే బాగుంటుందన్నారు. ఈ నెల 11న పీసీబీ తరఫున సీనియర్‌ న్యాయవాది వాదనల అనంతరం కమిటీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలన్నారు. 

Read more