రాష్ట్ర విభజనపై సుప్రీంలో అఫిడవిట్‌ వేయండి

ABN , First Publish Date - 2022-02-19T09:09:56+05:30 IST

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తాను దాఖలుచేసిన పిటిషన్‌పై రాష్ట్రప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయాలని...

రాష్ట్ర విభజనపై సుప్రీంలో అఫిడవిట్‌ వేయండి

కేంద్రంతో మీకు సత్సంబంధాలున్నా..

రాష్ట్ర  ప్రయోజనాలు ముఖ్యం

జగన్‌... మీరు సీఎంగానే 

వ్యవహరించండి

ఆంధ్రకు అన్యాయం జరిగిందని

సాక్షాత్తూ మోదీ, షాయే చెప్పారు

పార్లమెంటులో చర్చకు వచ్చేలా చేయండి

ఇప్పటికే లోకువైపోయాం

నోరెత్తకపోతే చరిత్రహీనులవుతాం

ఆంధ్రకు అన్యాయంపై కేసీఆర్‌ కూడా అడగాలి

బీజేపీపై పోరులో మమ్మల్నీ కలుపుకోండి

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ పిలుపు

 మాజీ ఎంపీ ఉండవల్లి


రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తాను దాఖలుచేసిన పిటిషన్‌పై రాష్ట్రప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయాలని సీఎం జగన్మోహన్‌రెడ్డికి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ కోరారు. కేంద్రంతో ఆయనకు సత్సంబంధాలున్నా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రిగానే వ్యవహరించాలని సూచించారు. ఆంధ్రకు జరిగిన అన్యాయంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా అడగాలని విజ్ఞప్తి చేశారు. ఉండవల్లి శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. 2014 ఫిబ్రవరి 18న ఏపీ విభజన బిల్లు అప్రజాస్వామిక పద్ధతిలో పాసయిందని చెప్పారు.  ‘చంద్రపాలన వెళ్లిపోయింది. జగన్‌ పాలన ఇప్పటికే సగమైంది. ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇటీవల సాక్షాత్తూ ప్రఽధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రెండుసార్లు ఆంధ్రకు జరిగిన అన్యాయం గురించి పార్లమెంటులో ప్రస్తావించారు. జగన్‌ గారూ.. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. పార్లమెంటులో చర్చకు వచ్చేలా చేయం డి. ఇప్పటికే లోకువైపోయాం.


పార్లమెంటు సాక్షిగా ఇంత అఘాయిత్యం జరిగినా నోరెత్తకపోతే చరిత్రహీనులమవుతాం. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నోటీసు ఇవ్వమని చెప్పాను. ఇవ్వలేదు. మీరు సీఎం కాగానే టేకప్‌ చేయమని కోరాను. కనీసం రిప్లయ్‌ లేదు. సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశాను. మీరూ అఫిడవిట్‌ వేయండి’ అని కోరారు. అప్రజాస్వామికంగా బిల్లు ఆమోదించారని గతంలో తాను సుప్రీంకోర్టులో వాదించానని ఉండవల్లి తెలిపారు. ‘ఇది కరెక్టయితే పూర్వపరిస్థితి తెస్తామని కోర్టు చెప్పింది. కానీ కేంద్ర, రాష్ట్రాలు అఫిడవిట్‌ దాఖలు చేయలేదు. ఏ ప్రభుత్వం పార్లమెంటులో తప్పుచేసినా తర్వాతి ప్రభుత్వం సరిదిద్దాలి. ఇదే మంచి అవకాశం. మోదీ, షాలే ఉభయసభల్లో చెప్పారు గనుక ఇప్పుడు మన వాళ్లు నోరు విప్పి చెప్పాలి’ అని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నరకే విభజన అంశాలేమీ అమలు చేయవద్దని నిర్ణయించినట్టు నీతి ఆయోగ్‌ చెప్పకనే చెప్పిందన్నారు. ర పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసే బాధ్యత కేంద్రానిదేనని మన్మోహన్‌సింగ్‌ కేబినెట్‌ తీర్మానం చేసిందని, దీనిని కూడా తెచ్చుకోకపోతే ఎలాగని ప్రశ్నించారు.


బాబు కాగితం పెడితే ఆగుతుందా?

ఇటీవల ప్రత్యేక హోదాపై చర్చించనున్నట్లు బయటకు రావడంతో గ్రేట్‌ అని సీఎంకు మెసేజ్‌ పెట్టానని ఉండవల్లి చెప్పారు. తర్వాత అది నిజం కాదని తేలిందన్నారు. ‘దానిని చంద్రబాబు ఎత్తివేయించారని, బీజేపీ ఎంపీలు ఎత్తివేయించారని వైసీపీ ప్రచారం చేసింది. గతంలో ప్రపంచబ్యాంకుకు జగన్‌ లేఖ రాశారని టీడీపీ ప్రచారం చేసింది. అయినా పార్లమెంటులో మీకు(జగన్‌కు) ఇంత మెజారిటీ ఉంది. చంద్రబాబు కాగితం పెడితే ఆగిపోతుం దా? మనల్ని లాగి లెంపకాయ కొట్టినా నోరెత్తరనే అభిప్రాయం ఉందని, దాన్ని పక్కనపెట్టి విభజన చట్టంపై సమాధానం చెప్పాలంటూ పార్లమెంటులో అడగాలన్నారు.


..మరి వారితో మాట్లాడుతున్నారు కదా!

కేసీఆర్‌ ఇక ఆంధ్రకు జరిగిన అన్యాయం గురించి కూడా అడగాలని ఉండవల్లి కోరారు. ‘మీరు రిచ్‌. మేం పూర్‌. బీజేపీపై పోరులో ఆంధ్రను కూడా కలుపుకోండి. గతంలో మమతా బెనర్జీ, శరద్‌యాదవ్‌, ములాయం సింగ్‌ యాదవ్‌,  సీపీఎం నేత సీతారాం ఏచూరి వంటి వారంతా ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించిన వారే. మరి వారితో మీరు మాట్లాడుతున్నారు కదా! దీన్ని కూడా దేశవ్యాప్తంగా చర్చకు పెట్టండి. ఆంధ్రలోనూ మీకు అభిమానులు వస్తారు. జగన్‌, వైసీపీ నేతలు కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. టీడీపీతోపాటు అన్ని పార్టీలు కలసి వస్తాయి. పార్లమెంటులో అప్పుడు జరిగింది తప్పని తేలాలి’ అన్నారు.

Updated Date - 2022-02-19T09:09:56+05:30 IST