మా స్థలాలపై ‘బొత్స’ కన్నేశారు!

ABN , First Publish Date - 2022-02-19T08:43:36+05:30 IST

‘అప్పులు చేసి స్థలాలు కొన్నాం. ఇళ్లు కట్టుకోడానికి అనుమతులు తెచ్చుకున్నాం. మంత్రి బొత్స సత్యనారాయణ బంధువులు అడ్డుకుంటే కోర్టుకూ వెళ్లాం....

మా స్థలాలపై ‘బొత్స’ కన్నేశారు!

 న్యాయం చేయాలంటూ ఆర్డీవోకు వినతి

విజయనగరం కలెక్టరేట్‌ , ఫిబ్రవరి 18: ‘అప్పులు చేసి స్థలాలు కొన్నాం. ఇళ్లు కట్టుకోడానికి అనుమతులు తెచ్చుకున్నాం. మంత్రి బొత్స సత్యనారాయణ బంధువులు అడ్డుకుంటే కోర్టుకూ వెళ్లాం. ఆ స్థలాలు మావేనని అధికారులు నిర్ధారించారు. అయినా మంత్రి బంధువుల దౌర్జన్యాలు ఆగలేదు. ఇప్పుడు ఏకంగా మా స్థలాలను వ్యవసాయ భూములుగా పేర్కొంటూ మంత్రి బొత్స పేరుతో ఆన్‌లైన్‌ రికార్డుల్లోనే నమోదు చేశారు. పట్టాదారుపాస్‌ పుస్తకాలు కూడా ఇచ్చేశారు. మీరే మాకు న్యాయం చేయాలి’ అంటూ విజయనగరం సత్యసాయినగర్‌ లేఅవుట్‌లో ప్లాట్లు కొన్నవారు శుక్రవారం విజయనగరం ఆర్డీవో భవానీశంకర్‌కు వినతిపత్రం అందజేశారు. మా నిర్మాణాలను ఏ క్షణంలోనైనా తొలగించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని, మీరే కాపాడాలని వేడుకొన్నారు.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం విజయనగరం బిట్‌-1 తోటపాలెం పరిధి సర్వే నెంబరు 53-4, 53-5లో రైల్వే ఎంప్లాయీస్‌ కో ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ వారు 1982వ సంవత్సరంలో సత్యసాయినగర్‌ పేరుతో ఇళ్ల స్థలాలను  లేఅవుట్‌ చేశారు. ఇందులోని ప్లాట్లను సుమారు 70 మంది కొనుగోలు చేశారు. ప్లాట్లు కొన్న వారిలో కొంతమంది ఇళ్ల నిర్మాణానికి అనుమతులు తీసుకున్నారు. కొందరు నిర్మాణాలు ప్రారంభించారు. మరికొంతమంది ఫెన్సింగ్‌ వేసుకున్నారు. అయితే ఈ భూములు తమవేనని, వాటిని ఖాళీ చేయాలంటూ బొత్స గురునాయుడు కుమారుడు బొత్స ఆదినారాయణ తదితరులు.. బాధితులను ఆ స్థలాల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు 2015 నుంచీ జరుగుతున్నాయి. స్థానిక ఎమ్మార్వో కూడా ఈ స్థలాలు తమకే చెందుతాయని చెప్పారని, అయినా బొత్స కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో తాము కోర్టుకు కూడా వెళ్లామని బాధితులు తెలిపారు.


ఈ క్రమంలో గత నెల 28న 53-4, 53-5 సర్వే నెంబర్లు గల భూమిని పల్లం భూమిగా చూపించి ఆదినారాయణ సోదరుడు, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ పేరుతో ఆన్‌లైన్‌లో రెవెన్యూ రికార్డులను అధికారులు మార్చేశారని బాధితులు తెలిపారు. ఇళ్ల స్థలాలుగా రికార్డుల్లో నమోదై ఉన్న భూమిని పల్లం భూమిగా చూపి పట్టాదారు పాసుపుస్తకం ఎలా మంజూరు చేస్తారని బాధితులు ప్రశ్నించారు. ఈ స్థలాలకు మున్సిపల్‌ కార్యాలయంలో ఆస్తి పన్నులు కూడా చెల్లించామని, అయినప్పటికీ పల్లంభూమిగా వెబ్‌ల్యాండ్‌లో ఎలా మార్పు చేశారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై విచారణ చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఆర్డీఓకు ఫిర్యాదు చేసిన వారిలో పి.విజయలక్ష్మి, కస్తూరీబాయి, కలిదిండి ఆంజనేయులు, కలిదిండి రామభద్రరాజు, లెంక శ్రీనివాసరావు, ఏటుకూరి పద్మజ, కె.ఎ్‌స.ఎన్‌. వర్మ ఉన్నారు.

Updated Date - 2022-02-19T08:43:36+05:30 IST