ఇంతకీ రోగ్‌ ఎవరు?

ABN , First Publish Date - 2022-02-16T09:20:52+05:30 IST

ప్రధాని మోదీకి సీఎం జగన్‌ రాసిన లేఖలో తనను రోగ్‌గా పేర్కొన్నారని వచ్చిన వార్తలపై వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామరాజు...

ఇంతకీ రోగ్‌ ఎవరు?

 అప్పుల ఊబిలో ముంచినవారా?

 ప్రభుత్వ తప్పులను ప్రశ్నించినవారా?

 సోషల్‌ మీడియాలో పోల్‌ పెట్టా 

 ఎంపీ రఘురామరాజు వెల్లడి  


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీకి సీఎం జగన్‌ రాసిన లేఖలో తనను రోగ్‌గా పేర్కొన్నారని వచ్చిన వార్తలపై వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామరాజు తీవ్రస్థాయిలో స్పందించారు. ‘ఇంతకీ రోగ్‌ ఎవరు? రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచినవారా? ప్రభుత్వ తప్పులను ప్రశ్నించిన వారా? వైఎస్‌ సునీత, వైఎస్‌ షర్మిలను అడిగితే ఆ అస లు రోగ్‌ ఎవరో చెబుతారు. రోగ్‌ ఎవరో చెప్పాలని సోషల్‌ మీడియాలో కూడా పోల్‌ పెట్టాను. ప్రధానికి సీఎం జగన్‌ రాసిన లేఖలోని అంశాలన్నీ నాకు అందాయి. తమ పార్టీలో ఒక రోగ్‌ ఉన్నాడని, రాష్ట్రానికి అప్పులు ఇవ్వొద్దంటూ లేఖలు రాస్తున్నాడని జగన్‌ ప్రధానికి  లేఖ రాశారు. చేతకాని పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినవారే అసలు రోగ్‌. ఈ సాయంత్రానికే రోగ్‌ ఎవరో ప్రజలు చెబుతారు’ అని విరుచుకుపడ్డారు. మంగళవారమిక్కడ తన నివాసంలో రఘురామ విలేకరులతో మాట్లాడారు. ప్రధానితో భేటీ అయినప్పుడు జగన్‌ ఏపీకి ప్రత్యేక హోదా కోరలేదన్నారు. అప్పులు మాత్రమే రాష్ర్టానికి వచ్చేలా చూడాలని ప్రాధేయపడ్డారని ఎద్దేవాచేశారు. రాష్ట్రప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులను ఉల్లంఘించి అప్పులు తెస్తోందని తాను ఫిర్యాదు చేస్తే రోగ్‌ ఎలా అవుతానని ప్రశ్నించారు. వివిధ రకాల పథకాల పేరు తో పేదలకు డబ్బిచ్చి, మళ్లీ దానిని ఏదో రకంగా తిరిగి తీసుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు మద్య నిషేఽ ధం అమలు చేస్తామని హామీ ఇచ్చి.. ఇపుడు మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తూ, ఆ ఆదాయాన్ని చూపి అప్పులు తేవ డం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. కార్పొరేషన్ల పేరు మీద ఎన్నో అప్పులు చేశారని, తాగుడుకు బానిసైన ఇంటి పెద్ద.. అప్పులు చేసి ఆస్తులన్నీ తాకట్టు పెడతాడని, ఇదే తరహాలో సీఎం కూడా డబ్బుకోసం ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. అప్పుల కోసం దేశంలోని అన్ని బ్యాంకుల చైర్మన్లకూ లేఖలు రాశారని చెప్పారు.


బాబాయి హత్యపై రాష్ట్రమంతా చర్చ..

సీఎం జగన్‌ బాబాయి వివేకానందరెడ్డిని ఎవరు చంపారనే అంశంపై రాష్ట్రమంతటా చర్చ జరుగుతోందని రఘురామ అన్నారు. సీబీఐ చార్జిషీట్లలో శంకరరెడ్డి, అవినాశ్‌రెడ్డి పేర్లు ఉన్నాయని.. రూ.40 కోట్లు ఖర్చు చేసి, వివేకాను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని ప్రశ్నించారు. సీఎం రియాక్షన్‌ దీనిపై ఎలా ఉంటుంది.. కనీసం అధికార పత్రికలో వార్తను కూడా ఎందుకు వేయలేదని నిలదీశారు.


మీ గొప్పా.. బాబు తప్పా?

17న రాష్ట్ర విభజన సమస్యలపై కేంద్ర హోం శాఖ జరిపే భేటీ ఎజెండాలో ప్రత్యేక హోదా అంశం ఉంటే గొప్ప సీఎం జగన్‌దా.. అది లేకుంటే తప్పు చంద్రబాబుదా అని రఘురామ ధ్వజమెత్తారు. ఎజెండా నుంచి ప్రత్యేక హోదా తొలగింపు వెనుక బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు పాత్ర ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారన్నారు. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆ పదవి నుంచి వైదొలగాలని గత 9 నెలల నుంచీ అనుకున్నట్లు తెలిసిందని చెప్పారు. ఆయన బదిలీ వెనుక చాలా కారణాలు ఉన్నాయన్నారు.

Updated Date - 2022-02-16T09:20:52+05:30 IST