అంగన్‌వాడీల పోరుబాట

ABN , First Publish Date - 2022-02-16T07:26:07+05:30 IST

అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, మినీ వర్కర్లు పోరుబాట పట్టనున్నారు. సమస్యల పరిష్కారం కోసం 21న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు....

అంగన్‌వాడీల పోరుబాట

జీతాల పెంపుదల కోసం రోడ్డెక్కనున్న సిబ్బంది .. 21న అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు 


 బడ్జెట్‌ సమావేశాల్లో ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు 

 11 సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్‌ 

 సీఎం వేతనాల పెంపు వాఖ్యలపై ఆగ్రహం 


‘‘అంగన్‌వాడీ వర్కర్లకు చంద్రబాబు హయాంలో రూ.7వేలు జీతం ఇస్తే... మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.11,500 చేశాం. మినీ వర్కర్లకు బాబు హయాంలో జీతం రూ.4,500 అయితే మనం వచ్చిన తర్వాత దాన్ని రూ.7వేలు చేశాం’’...  ఈనెల 8న ‘జగన్న చేదోడు’ కార్యక్రమంలో సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలు ఇవీ.. అయితే అంగన్‌వాడీలకు వేతనాలు బాగా పెంచామని సీఎం చెప్పడాన్ని వారంతా తప్పుబడుతున్నారు. తమకు చంద్రబాబు హయాంలోనే వేతనాలు పెరిగాయని, తెలంగాణ కంటే అదనంగా వెయ్యి పెంచుతామని ప్రకటన చేసినా, ఈ ప్రభుత్వం పెంచింది రూ.వెయ్యి మాత్రమే అంటున్నారు. సమస్యలు పరిష్కరించకపోతే పోరుబాట పడతామని హెచ్చరిస్తున్నారు.(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, మినీ వర్కర్లు పోరుబాట పట్టనున్నారు. సమస్యల పరిష్కారం కోసం 21న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. అంగన్‌వాడీవర్కుర్లు, హెల్పర్లు, మినీలు పెద్దసంఖ్యలో పాల్గొనాలని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ పిలుపునిచ్చింది. తమ డిమాండ్ల సాధన కోసం అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షా 20వేల మంది సిబ్బంది సమస్యల పరిష్కారానికి రోడ్డెక్కారు. నిరసనల్లో భాగంగా ఈ నెల 10న ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయాల వద్ద ధర్నాలు చేపట్టారు. ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) 11 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సిద్ధం చేసింది. 

ఇవీ డిమాండ్లు..

ఐసీడీఎ్‌సకి బడ్జెట్‌ పెంచాలి. కనీస వేతనం రూ.2000 ఇవ్వాలి. పదవీ విరమణ ప్రయోజనాలు రూ.5 లక్షలు, వేతనంలో సగం పెన్షన్‌ ఇవ్వాలి. నూతన విద్యావిధానం రద్దు చేయాలి. అంగన్‌వాడీ సెంటర్ల నిర్వహణకు ట్యాబ్‌లు ఇవ్వాలి. మెనూ చార్జీలు పెంచాలి. రేషన్‌ కార్డులు తొలగించరాదు.  400 జనాభా దాటిన మినీలను మెయిన్‌ సెంటర్లుగా మార్చా లి. మినీ వర్కర్లకు మెయిన్‌ వర్కర్లతో సమానంగా వేతనం ఇవ్వాలి. అంగన్‌వాడీలకు రిటైర్‌మెంట్‌ వయసు 62కు పెంచా లి. అంగన్‌వాడీ వర్కరు, హెల్పరు చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. బీమా వర్తింపజేయాలి. వేతనంతో కూడిన మెడికల్‌ లీవు సౌకర్యం కల్పించాలి. గ్రేడ్‌-2 సూపర్‌వైజర్‌ పోస్టులకు వెంటనే నోటిఫికేషన్‌ ఇవ్వాలి. కాగా, అంగన్‌వాడీలకు వేతనాలు బాగా పెంచామని ఈ నెల 8న ‘జగనన్న చేదోడు’ పంపిణీ సందర్భంగా సీఎం జగన్‌ చెప్పడాన్ని వారంతా తప్పుబడుతున్నారు. అదంతా పచ్చి అబద్ధమని మండిపడుతున్నారు. తమ పోరాటాల ఫలితంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే వేతనాలు పెరిగాయంటున్నారు.  2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. తెలంగాణ కంటే అదనంగా వెయ్యి పెంచుతామని ప్రకటన చేసినా, కేవలం రూ.1000 పెంచారని, ఇది సీఎం గమనించాలన్నారు. 


అక్కడ అలా.... ఇక్కడ ఇలా... 

తెలంగాణలో తాజాగా ఇచ్చిన పీఆర్సీ ప్రకారం అంగన్‌వాడీలకు 30శాతం జీతాలు పెరిగాయి. అంగన్‌వాడీ వర్కర్‌ రూ.13,650, హెల్పరు,, మినీ వర్కర్‌ రూ.7,600 తీసుకుంటున్నారు. వీరందరికీ రిటైర్‌మెంట్‌ బెనిఫిట్‌ రూ.5లక్షలు ప్రకటించారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం రిటైర్‌మెంట్‌ బెనిఫిట్‌ కింద అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.50వేలు, హెల్పరు, మినీ హెల్పర్‌కు రూ.20వేలు మాత్రమే ఇస్తున్నారని చెబుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అంగన్‌వాడీలకు సంక్షేమ పథకాలు నిలిపివేసింది. దీంతో అరకొర వేతనాలతో కుటుంబాన్ని వెళ్లదీయడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


అబద్ధపు ప్రచారాన్ని ఖండిస్తున్నాం 

అంగన్‌వాడీ వర్కర్ల జీతం రూ.10,500కు పెంచుతూ చంద్రబాబు ప్రభుత్వం 2018లో జూలైలో జీవో 18 జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం రూ.1000 మాత్రమే పెంచింది. అదనంగా వేతనాలు పెంచారనే అబద్ధపు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా పీఆర్సీ అమలు చేసి జీతాలు పెంచాలి’’ 

- సుబ్బరావమ్మ, అంగన్‌వాడీ వర్కర్స్‌, 

హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 


‘విద్యుత్‌’ సమ్మెపై ఉక్కుపాదం

 సమ్మెలను ప్రేరేపించే వారిపై చర్యలు.. ట్రాన్స్‌కో అదనపు కార్యదర్శి ఆదేశాలు..

అమరావతి, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి), ఎన్టీటీపీఎస్‌: విద్యుత్‌ సంస్థల్లో సమ్మెలు, ఆందోళనలపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఉద్యోగులను సమ్మెలు, నిరసనల దిశ గా ప్రేరేపించేవారిపై చర్యలు తీసుకోవాలని చీఫ్‌ ఇంజనీర్లకు ట్రాన్స్‌కో అదనపు కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. సామాజిక మాధ్యమాలోల్ల నిరసన కార్యక్రమాలను ప్రచారం చేయడం, పత్రికలకు సమాచారం అందించడం వంటి వాటిపైనా రోజువారి సమాచారం సేకరించాలని కోరారు. బాధ్యులపై చర్యలు చేపట్టాలని అదనపు కార్యదర్శి జారీ చేసిన  అంతర్గత మెమోలో పేర్కొన్నారు. కాగా,విద్యుత్‌ సంస్థలు ప్రైవేటుపరమైతే ప్రీపెయిడ్‌ మొబైల్‌ రీచార్జ్‌ లాగా భవిష్యత్తులో ‘ప్రీపెయిడ్‌ పవర్‌’ అమలు చేస్తారని, రీచార్జ్‌ చేస్తేనే పవర్‌ వస్తుందని ఎన్టీటీపీఎస్‌ జేఏసీ నేతలు, ఇంజనీర్లు హెచ్చరించారు.  

నేడు చర్చలు: విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బాలినేని శ్రీనివాస్‌ బుధవారం జేఏసీ నేతలతో చర్చించనున్నారు. గత చర్చల్లో తీసుకున్న నిర్ణయాలు అమలు కాకపోవడంతో తాజాగా జరిగే చర్చలపై ఆసక్తి నెలకొంది.  


రెండో రోజూ దర్శనం లేదు!

 ఉద్యోగ, ఉపాధ్యాయ ఐక్యవేదికకు సమయం ఇవ్వని సీఎం, సీఎస్‌

 దీంతో వినతిపత్రాన్ని మెయిల్‌లో పంపిన నేతలు 

అమరావతి, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): తమ డిమాండ్లను విన్నవించడానికి వెళ్లిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారుల ఐక్యవేదికకు సీఎం జగన్‌, సీఎస్‌ సమీర్‌శర్మ వరుసగా రెండో రోజు కూడా సమయం ఇవ్వలేదు. వీరిని కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు సోమవారం ప్రయత్నించి విఫలమైన ఐక్యవేదిక నేతలకు మంగళవారం కూడా అదే పరిస్థితి ఎదురైంది. దీంతో ఆ వినతిపత్రాన్ని మెయిల్‌ ద్వారా పంపిన వీరు.. దానిని మంగళవారం ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యాలయంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో చైర్మన్‌ జోసెఫ్‌ సుధీర్‌బాబు, జనరల్‌ సెక్రటరీ శరత్‌చంద్ర, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాద్‌, యూటీఎఫ్‌ అధ్యక్ష,, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు, ప్రసాద్‌ పాల్గొన్నారు. పీఆర్‌సీ ఫిట్‌మెంట్‌ 27 శాతం ఇవ్వాలని.. గ్రాట్యుటీని ఏప్రిల్‌ 2020 నుంచి అమలుచేయాలని.. సీపీఎ్‌సను రద్దు చేసి పాత పింఛను విధానం అమలుచేయాలని, కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించాలని.. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కనీస టైమ్‌ స్కేల్‌తో పాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ చెల్లించాలని.. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులను 2021 నుంచే క్రమబద్ధీకరించాలని అందులో కోరారు. 

Read more