శ్రీకాళహస్తి సీఐపై మహిళా కమిషన్ సీరియస్... చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-10-02T01:33:59+05:30 IST

కాళహస్తి సీఐ అంజు యాదవ్‌ (Anju yadav)పై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ (Ap Women Commission) సీరియస్ అయింది. తోపుడు...

శ్రీకాళహస్తి సీఐపై మహిళా కమిషన్ సీరియస్... చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు

తిరుపతి (Tirupati): శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్‌ (Anju yadav)పై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ (Ap Women Commission) సీరియస్ అయింది. తోపుడు బండి మహిళా వ్యాపారిపై మహిళా సీఐ  అంజు యాదవ్‌ వ్యవహరించిన తీరును తప్పుబట్టింది. చర్యలు తీసుకోవాలని తిరుపతికి ఎస్పీ (Tirupati Sp)కి ఫిర్యాదు చేసింది. 


శ్రీకాళహస్తిలో తోపుడు బండి మహిళా వ్యాపారిపై సీఐ అంజు యాదవ్ దురుసుగా ప్రవర్తించారు. రాత్రి సమయంలో అత్యుత్సాహం ప్రదర్శించారు. తోటి మహిళ అని చూడకుండా మహిళా వ్యాపారి చీర లాగి జీపులోకి లాగి పడేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు.  అంజు యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎస్పీకి ఆమె విజ్ఞప్తి చేశారు. 


శ్రీకాళహస్తి ఇన్‌స్పెక్టర్ అంజు యాదవ్ ప్రవర్తించిన తీరు జుగుప్సకరంగా ఉందని గజ్జల లక్ష్మి అన్నారు. రక్షకభటులే నేడు భక్షించే పరిస్థితికి చేరారని ఆమె మండిపడ్డారు. ఒక మహిళ అన్న ఇంగితజ్ఞానం లేకుండా చిరు వ్యాపారి పట్ల అనుచితంగా వ్యహరించారని ధ్వజమెత్తారు. బాధితురాలి చీర లాగేసి వివస్త్రను చేసి జీపులో తోసి అంజు యాదవ్ దారుణంగా ప్రవర్తించిందని గజ్జల లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి నేడు రాష్ట్రంలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఒక మహిళను బూటు కాలితో తన్నిన చరిత్ర సీఐ మంజు యాదవ్‌దని వ్యాఖ్యానించారు. గతంలోనే అంజు యాదవ్‌ గురించి ఎస్పీకి వివరించానని.. అయినా తీరు మారేలా మారలేదని గజ్జల లక్ష్మి అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఐ అంజు యాదవ్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి మహిళా సీఐ డిపార్ట్‌మెంట్‌లో ఉంటే పోలీస్ వ్యవస్థపై నమ్మకం కోల్పోవాల్సి వస్తుందని గజ్జల లక్ష్మి తెలిపారు. 

Read more